జైశ్రీరామ్.
ఆర్యులారా! మీ అందరికి
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఉ:- బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్
2 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
బ్లాగు వీక్షకులకు మరియు మిత్రులకు అందరికీ
భోగభాగ్యముల నిచ్చు మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
నమస్కారములు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.