గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2018, సోమవారం

౨వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం. రచన. చింతా రామకృష్ణా రావు

జై శ్రీరామ్.
౨వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం.
రచన. చింతా రామకృష్ణా రావు
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరమగు ధాత్రి జీవకోటికి నిత్య - జీవ జలమునిచ్చు, క్షేమమిచ్చు.
యుగ యుగాలుగనిది జగతిని నిత్యమున్ - సాగుననుట కీవె సాక్షి కృష్ణ
కలుషమైన జలము కలుషంబు లెటు పాపు? - కావ వలయు నీటి జీవన గతి
నీరు లేక జగతి నిలుచుటెట్టులు? కాన - నీటి నిలువ పెంచు మేటి కృష్ణ!
.వె. ప్రాణులకిల నీరు ప్రాణవాయువటులే. - నీటి నిలువ భువిని నిలుప వలయు.
సలిల రక్షణమును జరుపకుండిన జల - మంతరించు కద యనంత కృష్ణ!                     1
ఆటవెలది త్రయ గర్భ సీసము.
మానవుల్ జలమును మన్నించి రక్షించు - పూనికఁ గొని చేయఁ బుణ్యమొదవు.
నీరు వ్యర్థ పరచు నీచులు పాపులై - యంతరింత్రుకద యనంత కృష్ణ!
ధనము ఖర్చయినను దానినార్జింపగా - వచ్చు. భువిని నీరు మచ్చుకయిన
మిగులనీక మితికి మించి వెచ్చించిన - మృగ్యమౌన్. గొలుపు పరిణతి కృష్ణ!
.వె. జ్ఞాన మొసగుమయ్య సద్భావనము నిమ్ము - మానవాళినిలను మనఁగనిమ్ము.
నీటి నిలువఁ బెంచు నేర్పరులుగఁ జేయ - నేలతల్లి మెచ్చు నిన్ను కృష్ణ!                        2
ఆటవెలది త్రయ గర్భ సీసము.
బ్రతుకనెంచు జనులు పరమాత్మ సృష్టి యీ - నీరమనుచు దాని పారఁబోయ
వలవ రిలను జలము వర్ధిల్లఁ జేయఁగాఁ - వలచి యింకఁ జేయఁ దలచు కృష్ణ!
పూర్వ కాలమునను భూమి పీల్చుటఁ జేసి - నీటి మయము భూమి నిత్యమపుడు.
రాళ్ళ కట్టడములు వేళ్ళూనుటను చేసి - భూమి పీల్చునెటుల పూజ్య కృష్ణ!
.వె. ఇలకు నింక జలము నింకుడు గోతులన్ - గొలుపుటుత్తమమయ జలలు పెరుగు
సహజ వనరులందు సలిలంబు మృగ్యమౌన్ - కావకున్న దానిఁ గనుము కృష్ణ.!             3
మత్తకోకిల - ద్విపదద్వయ - తరువోజ - గర్భ సీసము.
నీరు జీవన ధార, నిల్పుము నీవు ని - త్యుఁడ! భూమిపై నేర్పుతోడవగను.
పారఁ బోయక కోరువారికి పంచి వ - ర్ధిలఁ జేయుమా! భవ్య తేజమున/ను.
నీరమే రమ. వాడ నేర్పుము నిత్యని - ర్మల చిత్తమున్ నేర్చు రాజిలఁగ/ను
నీరు తక్కువ వాడు నేర్పరి నిల్పుని - త్యము నన్యులన్. నిత్య ధార్మికుఁడు/ను
తే.గీ. నీరు వ్యర్ధము చేసినన్ నిలువదు రమ. - నీరు పొదుపుగా వాడిన నిలుచునామె.        4
భావి జీవన గతికయి జీవ జలలఁ - బెంచు, నీటిని భూమినింకించు కృష్ణ!
సీ. గంగను తలఁ దాల్చె గౌరీశుడే. యట్టి - గంగను చూడరే గౌరవముగ?
నింగిని వీడి మీ ముంగిలికొచ్చు నా - యంగన నింకనీరా పృథివిని ?
పొంగారు భూమిపై నింగినంటెడి యిండ్లు - నిర్మించి నీటిని నిలుపఁ తగునె?
కొంగుబంగారమీ పొంగెడి జలము మీ - ముంగిట నింకించి పొంగరేల?
తే.గీ. నీటికింకుడు గోతులే నెలవు కాన - వాటి నిర్మాణములు చేసి వరలనిండు
భూమి ననువైన నీటితో పూజ్యులార! - గంగ మీ కోరికల్ తీర్చి కాచునిలను.
. జనులకు విన్నవింతునిల జక్కఁగ నీటిని వాడుకొండు మీ
రనవసరంబుగా జలము వ్యర్థము చేయక, నీరు భూమిలో
ఘనముగ నింకునట్టులుగ కట్టడిఁ జేసి చరింపఁ జేయుడీ!
జనులిక నీటి లోటు కనఁ జాలరు వారి మితవ్యయంబునన్.                                      5
 స్వస్తి 
   జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నీటి యొక్కవిలువను గురించి చక్కని పద్యములలో వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.