గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2018, ఆదివారం

8వ పద్యపక్షము సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యము. రచన. చింతా రామ కృష్ణా రావు

జైశ్రీరామ్.  

శ్రీమద్గుణ సంపన్నులైన పాఠకాళికి 
భోగి పండుగ సందర్భముగా 
శుభాకాంక్షలు.

8వ పద్యపక్షము
సమాజ శ్రేయస్సు నా కర్తవ్యము.
రచన. చింతా రామ కృష్ణా రావు
. అటవెలది త్రయ గర్భ సీసము.
అజుని సృష్టిని భువినపురూప సౌందర్య - సత్ప్రభా ప్రణవ ప్రశస్తి నిండె.
జ్ఞాన హీనులమయి గ్రహియింపఁగాలేము. - జ్ఞానమొదవునట్లు కనుమ కృష్ణ!
జ్ఞాన దీప్తి కలుగ కానంగనగును సత్. - సత్స్వభావమిలను జయపథంబు.
నాదు కృషిని దాని శోధించి వ్యాప్తిలం - జేయఁదగును. కలుగ జయము కృష్ణ!
.వె. సత్వమీవె ప్రణవ సౌందర్యమును నీవె, నిన్నె జూపు జనులనెన్ని వారి
వలన ప్రబల సత్స్వభావంబు కృషి చేయ వలయునయ్యనేను వసుధ కృష్ణ!
. అటవెలది త్రయ గర్భ సీసము.
చిత్స్వరూపమున ప్రసిద్ధంబుగా నీవు మనములందు దాగి మసలుదువయ
నిన్నుఁ గాంచి ప్రజల కెన్ని చూపుట నాదు విది. చరింపఁ గనుమ ప్రీతిఁ గృష్ణ!
దోష గతులఁ బాపి, భాషణంబునమంచి భావనమున మంచి ప్రబలఁజేయు
ధర్మమమరె నాకు. తప్పక చేయించు, నాకు నీడవగుచు నడచు కృష్ణ!
.వె. నీవె దోష రహిత నిర్మలాత్ముఁడవయ్య! దోష రహితమైన భాషవీవె.
భావనములవెల్గు బ్రహ్మంబు నీవె నిన్ వరలజూపుదునయ వరద! కృష్ణ!
. అటవెలది త్రయ గర్భ సీసము.
ఆత్మశుద్ధి కొఱకు హరి పాదపద్మముల్ మనములందు నిలుపి మనునటులను
చేయవలయు నేను చిన్మార్గ గామినై భక్తపాళికిలను భవ్య కృష్ణ!
నీదు తోడు కలిగి ఖేదంబులను బాపి నిత్య సంతసమును నిలుపవలయు
భారతీయులమది. పరమార్థమిదె కదా! ధర్మ పథము నిమ్ము దయను కృష్ణ!
.వె. ఇహములోన కుములు నీస్వరు నెఱుఁగమిన్, మోహతప్తులగుచు మూర్ఖ జనులు.
వారి మదులకెక్క నీరూపమును జేయ వలయు నేను. మదుల నిలుచు కృష్ణ!
. . త్రికరణశుద్ధిగా శుభ గతిన్ జరియించుచు, సత్యమార్గమున్
ప్రకటితమౌనటుల్ తెలిపి భవ్యమహోద్గతి కొల్పి మేదినిన్
సకల జనాళికిన్ జయము, శాంతియు గొల్పుట నాదు ధర్మమౌన్
ప్రకటిత భక్తితో హరిని ప్రార్థన చేసి యొనర్తు నా విధిన్.
. . ప్రజలకు స్వస్తి గొల్పఁగను, రాజులు ధాత్రిని ధర్మ దీక్షతో
సుజనులు మెచ్చ చేయఁగ, వసుంధరదేవులు ధేనువుల్ సదా
ప్రజనిత సౌఖ్యమున్ వరల, ప్రాభవమొప్పఁగ చేయఁ బూనెదన్.
నిజమగు శక్తిమ్ము, ధరణిన్ విధి పూర్తిగ చేయ దైవమా!

జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు మరదలికీ పిల్లలకీ మనవలకీ అందరికీ సంక్రాంతి + నూతన సంవత్సర శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.