గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2017, గురువారం

శ్రీ వల్లభ వారి నూతన ఛందములలో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత.

 జైశ్రీరామ్.
పరిశీలన, కంద, చతురానన గర్భ త్రివిక్రమ వృత్తము 
*పలికించ వచ్చితిని, *వడివడి పలుకులఁ గురిసెద *వ్రాయఁగఁ గలవా
అలరించు ఛందమునె, యడుగకె యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
కలమద్ది తీయుమిక, గడుసుగ వలదని పలుకకు, కష్టము గలుగున్‌
వెలలేని కాన్కఁగొన, వెడలెడి నుడువులఁ గననగుఁ బెక్కులు గతులున్‌
గర్భితమైనవి --
చతురానన 
వడివడి పలుకులఁ గురిసెద వ్రాయఁగఁ గలవా
యడుగక యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
గడుసుగ వలదని పలుకకు, కష్టము గలుగున్‌
వెడలెడి నుడువుల గననగు పెక్కులు గతులున్‌
కందము 
వడివడి పలుకులఁ గురిసెద
నడుగకె యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
గడుసుగ వలదని పలుకకు
వెడలెడి నుడువులఁ గననగుఁ బెక్కులు గతులున్‌
పరిశీలన 
పలికించ వచ్చితిని
అలరించు ఛందమునె
కలమద్ది తీయుమిక
వెలలేని కాన్కఁగొన
2:50 PM
03-11-2017
వృత్తము - గణములు -          యతి/యతులు -- ఛందము 
త్రివిక్రమ -- స,జ,న,న,న,న, స,న,లగ -- 9,21 -- ఉత్కృతి
చతురానన -- న,న,న,న,భ,స ---13 -- - - - - - - ధృతి
పరిశీలన ---- స,జ,లల -- యతి లేదు --- - - - - -అనుష్టుప్
కందము --పూర్వార్థము, ఉత్తరార్ధములలో నెనిమిదేసి గణములు. భ,జ,స,నల,గగ లలో అనువైనవి. బేసి గణము జగణము కారాదు. ఆరవ గణము జగణము లేదా నలము. చివరి గణము స గణము లేదా గగ.
అన్నింటిలో ప్రాస నియతము.
చింతా రామకృష్ణారావు గారు ఆంధ్రామృతము బ్లాగులో ప్రచురించినది, వల్లభ వఝల వారిచే రచింపబడినది "పరిశీలనా, కంద,చతురాననా గర్భ త్రివిక్రమ వృత్తము" ను జూడగానే పలికించ /పలుకాడ వచ్చితిని అని చెప్పి పూర్తి జేసిన/చేయించిన పద్యము. సులువైన నడక. ఔత్సాహికులు యత్నించవచ్చును.
చింతా వారికి, వల్లభ వఝల వారికి ధన్యవాదములు. పలికి / వ్రాయించిన వారికి వందనశతములు.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పావులూరి సుప్రభ గారి గర్భ కవితలు చదువుతుంటే మనమూ రాయాలని అనిపిస్తోంది .కానీ అంతటి ధైర్యం సరిపోవటల్లేదు.నా ఈ చిన్నకలానికి అంతటి తెలివి లేదని పిస్తోంది. ఇంచిమించు పదేళ్ళుగ చింతా సోదరుల బ్లాగు చదివి చదివి ఒక పరమాణువు నేర్చుకో గలిగాను అదెధైర్యంతొ ముదడుగు వేయాలని చిన్నవిన్నపం.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.