గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2017, శుక్రవారం

నవాక్షర సమ (సుందరలేఖా) వృత్తము, - కంద త్రయ, - మణిగణనికర వృత్త - గర్భిత సరసిజ వృత్తము: రచన . . . కవయిత్రి పావులూరి సుప్రభ.

                                                  జైశ్రీరామ్.
కవయిత్రి పావులూరి సుప్రభ.
నవాక్షర సమ (సుందరలేఖా) వృత్తము, - కంద త్రయ, - మణిగణనికర వృత్త - గర్భిత సరసిజ వృత్తము: 
ఇది గర్భకవిత్వము అనే ప్రక్రియ.
అయిదుగురు బిడ్దలను తన గర్భములో భద్రముగా దాచుకొన్న తల్లి :- వంటి పద్యము. 
మాతృక - సరసిజము. 
దానిలో గర్భితమైనవి -- 3 కందములు,
1 మణిగణనికరము /శశికళా వృత్తము , 1 సుందరలేఖా వృత్తము.
సరసిజము
నీవేనే నాదేవివి! నీవే నిరుపమ సుఖదవు, నిజమును, నిరవున్‌!
ఈవే బాగౌ దీవన నీవే యెరుకయు నిడవలె హితముగ బ్రతుకున్‌
నీవర్ణంబే భావన, నీవే నిరతము మనసున నిలుపుదు గరిమన్‌
కావన్‌ రా, భక్తావన గావా, కరుణను ననుగను కలికివి? పరమా
1. గర్భిత కందము
నీవేనే నాదేవివి,
నీవే నిరుపమ సుఖదవు, నిజమును, నిరవున్‌!
ఈవే బాగౌ దీవన
నీవే, యెరుకయు నిడవలె హితమయి బ్రతుకున్‌
2. గర్భితకందము
నీవర్ణంబే భావన
నీవే నిరతము మనసున, నెనరున దలతున్‌
కావన్‌ రా భక్తావన!
గావా కరుణను ననుఁగను గలికివి? పరమా!
3. గర్భిత కందము
నిరుపమ సుఖదవు, నిజమును
నిరవున్‌, నెరుకయు నిడవలె హితమయి బ్రతుకున్‌
నిరతము మనసున నిలుపుదు
గరిమన్‌, గరుణను ననుఁగను కలికివి పరమా
(గర్భిత) మణిగణనికరము ( శశికళా) వృత్తము
నిరుపమ సుఖదవు, నిజమును, నిరవున్‌,
యెఱుకయు నిడవలె హితమయి బ్రతుకున్‌
నిరతము మనసున నిలుపుదు గరిమన్‌
కరుణను ననుఁగను గలికివి? పరమా
(గర్భిత) సుందరలేఖా (నవాక్షర సమవృత్తము )
నీవేనే నాదేవివి, నీవే
యీవే బాగౌ దీవన నీవే
నీవర్ణంబే భావన, నీవే
కావన్‌ రా, భక్తావన గావా
సుప్రభ
3:15 PM
27-02-2017
సరసిజ వృత్తము ( సంకృతి ఛందము )
గణములు - మ,త,య,న,న,న,న,స.
యతులు - 1-10-18 ప్రాస నియతము
మణిగణనికరము (శశికళా) ( అతిశక్వరీ ఛందము )
గణములు - న,న,న,న,స
యతి ---- 1,9 ప్రాస నియతము
సుందరలేఖా (నవాక్షర సమవృత్తము )
గణములు - మ,త,య ( యతిలేదు ) ప్రాస కలదు.

చింతా రామకృష్ణారావు గారు  ప్రచురించిన 
" నవాక్షర సమవృత్త, - కంద త్రయ, - మణిగణనికర వృత్త - గర్భిత సరసిజ వృత్తము" స్ఫూర్తితో, 
పలికించేవారి కరుణతో పూనుకొని వ్రాసినది. 
తమ రచన తో స్ఫూర్తినిచ్చిన చింతావారికి హార్దిక ధన్యవాదశతములు. 
యత్నమునకు పచ్చజెండాను జూపి, కృపతో శక్తినిచ్చి, నాకు తెలిసిన భాషలో నేవో కొన్ని పలుకులను తట్టించి, పూర్తిజేయించిన వారికి భక్తియుత వందన శతములు.

సరసిజము లక్షణములలో 6 అక్షరస్థానము లోని ప్రాస యతిని గురించి చెప్పకపోయినా, ఉదాహరణగా నివ్వబడిన పద్యములో ప్రాసయతులు ఉన్నాయి. అందువలన నేను కూడ ప్రాసతోపాటు ప్రాసయతులను కూడ వాడి వ్రాశాను.
--------------------------------------------------------
సరసిజము నకు ఛందో దర్పణములో లక్ష్యముగా నివ్వబడిన పద్యము
.
మౌళిం బిల్లంగోలొక చేత న్మఱియొక కరమున మణిమయ లతయున్‌
బాలశ్రేణుల్మ్రోల వసింపన్‌ బసులనొదిగి చనుపసగల ప్రభువున్‌
జాలం గొల్వంజాలిన కోర్కుల్‌ సఫలములగు నన సరసిజమమరున్‌
బోలన్‌ బ్రహ్మవ్యాళవిరామ స్ఫురదురుమతయనములు నననసలున్‌.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.