గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2017, ఆదివారం

శ్రీ వల్లభ వారి నూతన ఛందములో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత.బుధాపహ, భద్రలేమిల గర్భ కలిచారవశ వృత్తము

 జైశ్రీరామ్.
బుధాపహ, భద్రలేమిల గర్భ కలిచారవశ వృత్తము
కలిచారవశ వృత్తము
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన భావమే గదా
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచుఁ బద్యమై సదా
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి, కోరకే యెదన్‌ !
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే! యనుకంపను జూపఁగా నిటుల్‌!

గర్భితమైనవి ----
బుధాపహ
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచు
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే యనుకంపను!

భద్రలేమిల
పలుకులనాడు తల్లి, భయాపహ, పద్మవిలోచన భావమే
కలమునఁ బారుచుండుఁ గడుంగడు వింతను గూర్చుచుఁ బద్యమై
తలఁపులఁ బొంగఁజేయు తనే! దయఁజూపుచు నాపయి, కోరకే
భళి భళి! పంపెనేమొ ప్రజాపతియే! యనుకంపను జూపఁగా !

సుప్రభ
24-3-2017

వృత్తము -----గణములు ---- యతి/యతులు ---- ఛందము
----------------------------------------------------------
కలిచారవశ ---న,జ,భ,భ,భ,భ,ర,లగ ---- యతి 9,11 ---- వికృతి ఛందము
బుధాపహ -----న,జ,భ,భ,భ,భ --------------యతి 11 ----- ధృతి ||
భద్రలేమిల -- న,జ,భ,భ,భ,భ,ర ----------- యతి 11 ----- ప్రకృతి ||

క్రొత్త వృత్తాలను పరిచయము చేసిన చింతావారికి, వల్లభవఝల వారికి ధన్యవాదములు.
నాలుగు వాక్యాలనిచ్చిన పై వారికి కృతజ్ఞతాపూర్వక వందనములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.