చ:- తొలి చిగురాకులో మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; కా
చెడి ప్రభువా! కృపన్ మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి; నీ
విల సుగుణాకృతిన్ సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ! ల
బ్ధుఁడవె హరీ! దయన్ వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోపకా! 101.
భావము:-
దయతో పూజ్యముగా నిలిచిన ఓ వేణుగోపకుఁడా! ఓ శుభ్ర దేహుఁడా!
ఓ శ్రీ హరీ! సృష్టిని తొలి నుండియు చిగురాకు సుకుమారముతో
సరి తూగు విధముగా మేలుగా చేసి; కాపాడే ఓ పరమాత్మా! తేనెను చిందెడి
వృక్ష సుమాలను సృష్టించి; నీవే ఈ భూమిపై మంచి గుణముల రూపమున
మంచివారిని ఏలుట కొఱకు నిలిచితి వేమో! మాకు లభించు వాఁడివే సుమా!
క:- చిగురాకులో మృదువు తూఁ - గగ సృష్టిని మేలొనర్చి; కాచెడి ప్రభువా!
సుగుణాకృతిన్ సుజను నే - లగ నిల్చితొ? శుభ్ర దేహ! లబ్ధుఁడవె హరీ! 101.
భావము:-
ఓ శుభ్ర దేహుఁడా! ఓ శ్రీహరీ! చిగురాకు సుకుమారముతో సరి తూగు విధముగా
మేలుగా సృష్టిని చేసి; కాపాడే ఓ పరమాత్మా! మంచి గుణముల రూపమున మంచివారిని
ఏలుట కొఱకు నిలిచితి వేమో! మాకు లభించు వాఁడివే సుమా!
గీ:- మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; - మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి;
సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ! - వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోప! 101.
భావము:-
ఓ శుభ్ర దేహుఁడా! మా వద్ద వెలసి; పూజ్యముగా నిలిచిన ఓ వేణుగోపుఁడా! మృదుత్వముతో
తులతూగే విధముగాఈ సృష్టిని మేలుగా చేసి; తేనెలు చిందెడి వృక్ష సుమాలను సృష్టించి;
సుజనులను పాలించుటకై నిలిచితివేమో!
చ:- నను మది నేలరా! పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ! ప్రా
ర్థన వినుమా మదిన్. బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి! నన్
కను ముదమారగా ధరణిఁ గాచు దయాంభుధి! తత్వ మెన్నుచున్
గనర హరీ! దయన్! విపుల కామిత పూరక! వేణు గోపకా! 102.
భావము:-
స్వచ్ఛమైన కోరికల నీడేర్చువాఁడా! ఓ వేణుగోపకుఁడా! గొప్ప నిష్ఠా సమన్వితుఁడా!
దిగంతమూ వ్యాపించియున్న వాఁడా! ఓ గొప్ప తేజస్సు కలవాఁడా! అనేక విధములుగా
ధన్యతను కొలిపెడి ఓ భవ్య మూర్తీ! నీ మనసు పెట్టి నా ప్రార్థనను వినుము.
నన్ను ముదమారా చూడుము. ధరణిని కాపాడెడి దయా సముద్రుఁడా!
నా తత్వమును గణించుచూ నన్ను చూడుము.
క:- మది నేలరా! పరమ నై - ష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ! ప్రార్థన వినుమా!
ముదమారగా ధరణిఁ గా - చు దయాంభుధి! తత్వ మెన్నుచున్ గనర హరీ! 102.
భావము:-
గొప్ప నిష్ఠా సమన్వితుఁడా! దిగంతమూ వ్యాపించి యున్న వాఁడా! ఓ గొప్ప తేజస్సు కలవాఁడా!
ఓ శ్రీహరీ! నా ప్రార్థన వినుము. మనస్పూర్తిగా నన్నేలుము. ముదమారా చూడుము.
ధరణిని కాపాడెడి దయా సముద్రుఁడా! నా తత్వమును గణించుచూ నన్ను చూడుము.
గీ:- పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ! - బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి!
ధరణిఁగాచు దయాంభుధి! తత్వమెన్ను -విపుల కామిత పూరక! వేణుగోప! 102.
భావము:-
ఓ గొప్ప తేజస్సు కలవాఁడా! గొప్ప నిష్ఠా సమన్వితుఁడా! దిగంతమూ వ్యాపించి యున్నవాఁడా!
ఓ వేణుగోపుఁడా! అనేక విధములుగా ధన్యతను కొలిపెడి ఓ భవ్య మూర్తీ! భూమిని కాపాడే
దయా సముద్రుఁడా! విపులమైన మా తత్వమును గణించు వాఁడా! విపులమైన
కామితములూ ఈడేర్చు వాఁడా!
చ:- వినఁ పటు నైపుణుల్ ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి గా
రును; కనగా సుధీవర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి తా.
వినఁ పటు భక్తురాల్ జనని వేంకట రత్నము జన్మ నిచ్చి, గా
చెనుర హరీ! ననున్ పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోపకా! 103.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీ హరీ! వినినట్లైతే చింతా వేంకట సన్యాసి రామా రావు తండ్రి గారు;
అన్నివిషయములలోను పటువైన నిపుణత గలవారలు; ప్రణుతులు. చూచినట్లైతే
వారు సుధీ వరగురులు. ప్రగణ్యులు; భవ్య మూర్తి. అట్టి వీరునూ; వినినచో గొప్ప భక్తురాలైన
మాతల్లి శ్రీమతి వేంకట రత్నం గారును;నాకు ఈ జన్మనిచ్చి; కాపాడిరి.
నన్ను వారి మనస్సులో నిలుపుకొని పెంచిరి.
క:- పటు నైపుణుల్ ప్రణుత వేం - కట సన్యసి రామ తండ్రి గారును; కనగా
పటు భక్తురాల్ జనని వేం - కట రత్నము జన్మ నిచ్చి, గాచెనుర! హరీ! 103.
భావము:-
ఓ శ్రీహరీ! అన్ని విషయములలోను పటువైన నిపుణత గలవారలైన నమస్కరింపఁబడెడి
చింతా వేంకట సన్యాసి రామా రావు తండ్రి గారును; చూడగా గొప్ప భక్తురాలైన మాతల్లి
శ్రీమతి వేంకట రత్నం గారును; నాకు ఈ జన్మనిచ్చి; కాపాడెనయ్యా!
గీ:- ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి - వర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి.
జనని వేంకట రత్నము జన్మ నిచ్చి, - పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోప! 103.
భావము:-
ఓ వేణుగోపుఁడా! వర గురులు; ప్రగణ్యులు; భవ్య మూర్తి; ప్రణుతులు అయిన
చింతా వేంకట సన్యాసి రామారావు తండ్రి గారును; మాతల్లి శ్రీమతి వేంకట రత్నం గారును;
నాకు ఈ జన్మనిచ్చి; కాపాడిరి. నన్ను వారి మనస్సులో నిలుపుకొని పెంచిరి.
ఉ:- ఓ యరి నాశకా! రచన నోర్చి రచించితి రామ కృష్ణ చిం
తా; యను నే; నిటన్ నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి; ప్రా
పై యరమున్. గనన్ కెలయు బంధుర కందము గీత మిందు తో
డాయె హరీ! కృపన్ వినుమయా శతకంబును వేణు గోపకా! 104.
భావము:-
ఓ శత్రు నాశకుఁడా! ఓ వేణు గోపకుఁడా! చింతా రామ కృష్ణా రావు అనే పేరుఁ గల నేను
యాతనలనోర్చుకొని; ఇక్కడ నీపై నాకుఁ గల కృతజ్ఞత; నీవు నా పక్షమున కలవన్న గర్వము
ఉట్టి పడే విధముగ వడిఁ గలదియును; ఆశ్రయమై; ఒప్పెడిదియును అగు నీప్రశస్తిని
వ్యక్త పరుస్తూ నీకు సంబంధించిన విషయము కల ఈ శతక రచన చేసితిని.
విడదీసి చూచినట్లైతే ఈ శతకమునందలి ప్రతీ వృత్త పద్యము లోనూ విజృంభమాణముగా
కంద పద్యము; మరియు తేటగీతి పద్యము తోడై యుండెను. నీవు కృపతో నేను రచించిన
ఈ శతకమును ఆలకింపుమయ్యా!
క:- యరి నాశకా! రచన నో - ర్చి రచించితి రామ కృష్ణ చింతా; యను నే
యరమున్ గనన్ కెలయు బం - ధుర కందము గీత మిందు తోడాయె హరీ! 104.
భావము:-
ఓ శత్రు వినాశకుఁడా! ఓ శ్రీహరీ! చింతా రామ కృష్ణా రావు అనే పేరుఁ గల నేను
యాతనలనోర్చుకొని; ఈ శతక రచన చేసితిని. చూడగా వడిఁ గలిగిన విజృంభమాణమగు
కంద పద్యము; గీతపద్యము ఈ శతకమున తోడాయెను.
గీ:- రచన నోర్చి రచించితి రామ కృష్ణ - నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి.
కెలయు బంధుర కందముగీతమిందు-వినుమయా శతకంబును వేణుగోపకా!104.
భావము:-
ఓ వేణుగోపుఁడా! రామకృష్ణ యనఁబడే నేను నీపై నాకుఁ గల కృతజ్ఞత; నీవు నా పక్షమున
కలవన్నగర్వము తెలియఁ జేసే విధముగా నీ ప్రాశస్త్యమును శతకముగా రచన చేసితిని.
ఇందు ప్రతి వృత్తమునావిజృంభమాణముగా కంద పద్యము; తేట గీతి పద్యము ఉన్నవి.
ఈ శతకమును ఆలకింపుమయ్యా!
ఉ:- శ్రీ గుణ ధాముఁడా! వినగ ప్రేరణ భద్రము వేణు గోపరా!
భాగవతాఢ్యుఁడౌ బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు కాన్;
తా గణనీయమై చెలఁగు ధారణ కల్గి రచించి తేను; రా
వేగ; హరీ! కృపన్ వినర ప్రీతిగ నియ్యది; వేణు గోపకా! 105.
భావము:-
ఓ మంగళప్రదమైన సద్గుణముల కాకరమైనవాఁడా! ఓ వేణుగోపకుఁడా! శ్రీ భద్రము
వేణు గోపాలాచార్య అష్టావధానియు. పరమ భాగవతులలో శ్రేష్ఠుడగు శ్రీ వజ్ఝల
నరసింహమూర్తి కవి బోధనయును ఈ శతక రచనకు ప్రేరణ కాగా; అది
గణనీయమగుచూ చెలగేటువంటి ధారణ కలిగినందున నేను రచించితిని. ఓ శ్రీ హరీ!
వేగముగా రమ్ము. ప్రీతితో ఈ శతకమునాలకింపుము.
క:- గుణ ధాముఁడా! వినగ ప్రే - రణ భద్రము వేణు గోపరా! భాగవతా!
గణనీయమై చెలఁగు ధా - రణ కల్గి రచించి తేను; రావేగ; హరీ! 105.
భావము:-
సద్గుణముల కాకరమైనవాఁడా! ఓ శ్రీహరీ! భాగవతుఁడుగ నీవే ఐనవాఁడా! ఈ శతక రచనకు
ప్రేరణ శ్రీ భద్రము వేణు గోపాలాచార్య అష్టావధానియే. ధారణ కలిగి నేనిది రచించితిని సుమా!
నీవు వేగముగా నాకడకు రమ్ము.
గీ:- వినగ ప్రేరణ భద్రము వేణు గోప .- బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు ;
చెలఁగు ధారణ కల్గి రచించి తేను; - వినర ప్రీతిగ నియ్యది; వేణు గోప! 105.
భావము:-
ఓ వేణుగోపుఁడా! శ్రీ భద్రము వేణు గోపాలాచార్య అష్టావధానియు; కవి పండితులు
శ్రీ వజ్ఝల నరసింహమూర్తియొక్క బోధన కారణము కాగా చెలగెడి ధారణఁ గలిగి
నే నియ్యది రచించితిని. నేను రచించిన ఈ శతకమును ప్రీతితో వినుము.
చ:- దొర! నగ ధారి! మా అఖిల దోష గుణంబుల నాపుమయ్య!సా
దరముగ నన్ తగన్ కనుమ దారిని చూపుచు కాంక్ష తీర; స
చ్చిర సుగుణాకృతిన్ వరలఁ జేయగ నీకది భావ్య మయ్య! ఆ
సురుఁడ! హరీ! కృపన్ వినర! చూడర! నాకృతి! వేణు గోపకా! 106.
భావము:-
ఓ నగధారీ! ఓ మా దొరా! ఓ వేణుగోపకుఁడా! మాకు సంబంధించిన సమస్తమైన
దోషావహమైన గుణములను నిలిపివేయుము. సాదరముగా తగిన రీతిగా
నన్ను చూడుమా! నా కోరిక తీరే విధముగా మంచి దారిని మాకు చూపుము.
నిజమైన శాశ్వితమైన సుగుణాకృతిగా ఈ శతకమును వరలఁ జేయుట అనునది
నీకు భావ్యమయ్యా! ఓ మూల విరాట్టూ! ఓ శ్రీ హరీ! కృపతో నన్ను చూడుము.
నేను రచించిన ఈ శతకమును వినుము.
క:- నగ ధారి! మా అఖిల దో - ష గుణంబుల నాపుమయ్య సాదరముగ! నన్
సుగుణాకృతిన్ వరల జే - యగ నీకది భావ్య మయ్య! ఆసురుఁడ! హరీ! 106.
భావము:-
ఓ నగధారీ! మూల విరాట్టువైన ఓ శ్రీహరీ! నాపై అదరము చూపుతూ; నాలోను,
నా యీ రచన లోను కలిగిన సమస్తమైన దోషములను నిలిపివేయుము. నన్ను
సుగుణాకారునిగా వరలే విధముగా చేయుట యనునది నీకు భావ్యముసుమా!
గీ:- అఖిల దోష గుణంబుల నాపుమయ్య! - కనుమ దారిని చూపుచు కాంక్ష తీర
వరల జేయగ నీకది భావ్య మయ్య! - వినర! చూడర! నాకృతి! వేణు గోప! 106.
భావము:-
ఓ వేణుగోపుఁడా! నాలోను నా యీ రచన లోను కలిగిన సమస్తమైన దోషములను
నిలిపివేయుము. నా కోరిక తీరే విధముగా మంచి దారిని మాకు చూపుచు దయతో
చూడుము. నన్ను వరలే విధముగా చేయుట యనునది నీకు భావ్యముసుమా!
నన్ను చూడుము నాకృతిని వినుము.
చ:- సుమ మధురీతిగా వినినచో ప్రథమంబుగ వేణు గోప ప
ద్యములు; కృపన్ సదా శతక మందు కనంబడి; క్షామ మంతటిన్;
తమ వ్యధలన్నిటిన్ తరిమి; తన్మధురంబగు తత్వ మిమ్ము! నా
డె మను హరీ! భువిన్. విదితుడే నిను గాంచును వేణు గోపకా! 107.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీహరీ! పాఠకులు ముఖ్యముగా భావించి యీ
వేణు గోప శతకమునందలి పద్యములు వినినట్లైతే పూల తేనెవలె ఒప్పునట్లుగా చేయుచు;
కృపతో ఎల్లప్పుడూ ఈ శతకములో నీవు ప్రత్యక్షమయి; సమస్తమైన క్షామమును;
తమను గూర్చిన శంక వలన కలిగిన వ్యధ లన్నిటినీ తరిమి; ఆ మధురమైన
పరమాత్మ తత్వమును కలుఁగఁ జేయుము. అప్పుడే భూమిపై మనుట జరుగును.
నిన్ను గూర్చి ఎఱిఁగిన వాడే నిన్ను చూడఁగలుగును సుమా!
క:- మధురీతిగా వినినచో - ప్రథమంబుగ వేణు గోప! పద్యములు; కృపన్
వ్యధలన్నిటిన్ తరిమి; త - న్మధురంబగు తత్వమిమ్ము. నాడె మను హరీ! 107.
భావము:-
ఓ శ్రీహరీ! అమృతముగా భావించి యీ శ్రీ వేణు గోప శతక పద్యములను ముఖ్యముగా భావించి
వినినచో నీ కృపతో పాఠకుల వ్యధలన్నిటినీ పోఁ గొట్టి; అందుఁ గల నీకు సంబంధించిన
ఆ మధురమైన పరమాత్మ తత్వమును ప్రసాదించుము.
గీ:- వినినచో ప్రథమంబుగ వేణు గోప - శతక మందు కనంబడి; క్షామ మంత;
తరిమి; తన్మధురంబగు తత్వమిమ్ము!-విదితుడే నినుగాంచును వేణుగోప! 107.
భావము:-
ఓ వేణుగోపుఁడా! ముఖ్యమని భావించి యీ శ్రీ వేణు గోప శతకమును ఎవరైనను వినినచో
వారికి నీవు శతకమునందు దర్శనమిచ్చి; క్షామమును పోఁ గొట్టి; అందుగల
మధురమైనటువంటి నిన్ను గూర్చిన తత్వమును ప్రసాదించుము. నిన్ను గూర్చి
తెలుసుకొన్న వాడే నిన్ను చూడ గలుగును సుమా!
ఉ:- మంగళ మందుమా! మధుర మంగళ గీతుల మంగళంబుగా!
మంగళుఁడా! సుధా మధుర మంగళ కందపు మంగళంబురా!
మంగళ మందుమా! మధుర మంగళ వృత్తుల మంగళంబుగా;
మంగ హరీ! సదా వినుత మంగళ రూపుఁడ! వేణు గోపకా! 108.
భావము:-
ఎల్లప్పుడూ పొగడఁ బడెడి మంగళ స్వరూపుఁడా! ఓ వేణుగోపకుఁడా! మంగళప్రదముగా
మేము పాడెడి మంగళ గీతుల మూలమున జయములు పొందుము.
మంగళమే నీ వైనవాఁడా! అమృతము వలె మధురమైన మంగళమైన
కందపద్య రూపమగు మంగళము. మధురమైన మంగళ వృత్తులతో నీకు మంగళము.
అట్టి మంగళము స్వీకరింపుమా!.
క:- గళ మందు; మా మధుర మం - గళ గీతుల మంగళంబు గా! మంగళుఁడా!
గళ మందుమా! మధుర మం - గళ వృత్తుల మంగళంబు గా! మంగ హరీ! 108.
భావము:-
ఓ అలమేలు మంగా సమేతుఁడ వైన శ్రీహరీ! మా గొంతుకలనుండి వెలువడు మధురమైన
మంగళ ప్రదమైన తేట తేట గీతుల మూలమున మంగళ మగును గాక! మధురమైన
మంగళ ప్రదమైన వృత్తులతో గూడిన మా గళ మందు మా మంగళ మందుము.
గీ:- మధుర మంగళ గీతుల మంగళంబు! - మధుర మంగళ కందపు మంగళంబు!
మధుర మంగళ వృత్తుల మంగళంబు!-వినుత మంగళ రూపుఁడ!వేణుగోప!108.
భావము:-
పొగడఁ బడెడి మంగళ ప్రదమైన స్వరూపము కలవాఁడా! ఓ వేణుగోపుఁడా! నీకు మధురమైన
మంగళ ప్రదమైన గీతులతో మంగళము పలుకు చుంటిని. నీకు మధురమైన మంగళప్రదమైన
కంద పద్యములతో మంగళము పలుకు చుంటిని. నీకు మధురమైన మంగళ ప్రదమైన
వృత్తులతో మంగళము పలుకు చుంటిని. నీకు శుభమంగళమ్.
// అంకితము //
చః-
త్రిక పర తత్వమై విపుల ధీ వరదాయికి, వేణు గోపబా
లక మణికిన్, బ్రభాంకునకు,లక్ష్మి హృదీశ్వర కూర్మ మూర్తికిన్,
త్రిక వరుడౌ పినాకి నుత ధీవరుకిత్తు సుఖింప దీని, పా
వకుఁడ! హరీ!మదిన్ వినుమ! వర్ధిలఁ జేయుమ! వేణు గోపకా!
కః-
పర తత్వమై విపుల ధీ
వరదాయికి, వేణు గోప బాలక మణికిన్
వరుడౌ పినాకి నుత ధీ
వరుకిత్తు సుఖింప దీని, పావకుఁడ! హరీ!
గీః-
విపుల ధీ వర దాయికి, వేణు గోప
కునకు,లక్ష్మి హృదీశ్వర కూర్మ మూర్తి
కి, నుత ధీవరుకిత్తు సుఖింప దీని,
వినుమ! వర్ధిలఁ జేయుమ! వేణు గోప!
మంగళం మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైశ్రీరాం.
జైహింద్.