గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2010, సోమవారం

ఆర్యులారా! ఈ దత్త పదిని మత్తేభంలో పూరించ వలసినదిగా మనవి.

ఆంధ్రామృతమును నిరంతము గ్రోలే ప్రియ సాహితీ ప్రియులారా! మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు.
ఇప్పుడు  మన సాహితీ బంధువయిన  శ్రీ ధవళ సోమశేఖర్ ఇచ్చిన ఒక చక్కని పూరణ నిమిత్తము ఇచ్చిన దత్త పదిని ; దానిని పూరించడానికి చేసిన నా ప్రయత్న ఫలమును మీ ముందుంచుతున్నాను. 
ముందుగా వారి లేఖను చూడండి. 
ఆచార్యా!
అంశం:- దత్త పది 
ఇడ్లీ,      పూరీ,      ఉప్మా,      కాఫీ,
ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి
ఈ సమస్య అడగదగినదేనా? ఒక వేళ అయినచో మీరు పూరించగలరా? నేను ఏవో చిన్న చిన్న కంద పద్యాలు వ్రాయగలను గానీ, వృత్తాలు కష్టం. దయచేసి సహాయము జేయఁ గలరు.  ఒకవేళ ఇది కష్టతరమైనచో, కొన్ని మార్పులు చేసి, పద్యమునందించగలరు. 
This mattebhamu, does not permit the avadhani to use any of these words to begin the poem as all of them start with a guruvu and to my knowledge, there are no words that star with డ్లీ and ప్మా.
So, it will be interesting to see how the avadhani can crack this?
Any thought? Please let me know at your earliest. I am consulting some people to see if this is possible.
కృతజ్ఞలతో,
ధవళ సోమశేఖర్.
శారదాంబ నా చేత చేయించిన పూరణ గమనింప మనవి.
మll 
కసభుక్కీల దురంత నక్ర మిచటన్ "కాల్చుండిదిడ్లీ యనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుడీ! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావు డిలలో ఉప్మాక దేవా మమున్!
విషమంబియ్యది. ఇట్టి చిన్న పనికా ఫిర్యాదటం చెంచకన్!
(ఇక్కడ నా మనోగతమును మీకు కొంచెం వివరిస్తున్నాను.  కాల్చుండు + ఇది + ఈ + ఢిల్లీ + అనన్ > కల్చుండిది +ఇడ్డిల్లీ + అనన్ >  కాల్చుండిదిడ్లీ యనన్ = ఇదే ఢిల్లీ; కాల్చేయండి అని సందేశమివ్వగానే)
భావము:-
టెఱ్ఱరిష్టులు వేసే గడ్డి తినే కసబ్ అనెడి పేరు గల అగ్ని జ్వాల యనెడి మొసలి ఇక్కడ " ఇది ఈ ధిల్లీయే; కాల్చుఁడు " అని పలుకగానే చెలరేగిన పొగ యనెడి ముసుగులు ధరించి మమ్ము పట్టుకొనెను. ఓ పూరీ జగన్నాయకా! ఓ ఉప్మాక వెంకటేశ్వరా! ఇది చూడండి. మాప్రాణములు తీయుటకు సిద్ధముగా నుండెను. ఇది మాకు మిక్కిలి విషమ మయిన సమయము. " ఇటువంటి చిన్న పనికేనా ఇలా ఈ మానవకుంజరములు పిర్యాదు చేయుచున్నవి " అని మాత్రము భావించక భూలోకములో మమ్ములను కాపాడండి.
ఇదండీ నామెదడుకు తోచిన ముంబాయ్ కాల్పుల గజేంద్ర మోక్షం. ఇది గొప్పగా ఉందని నేననుకోను. ఆ విషయంలో లోపాలోపాలను సూచించే పాఠకులే నా కవితకు మెఱుగులు దిద్దే నిపుణులు.  
ఏది యేమైనా సరే ఒకటి యదార్థమండి నావిషయంలో. ఆశారదామాత కనికరించిందా. పద్య రచన ; పూరణ; పెద్ద పనికాదు. ఆమె కటాక్షమే లేకుంటే చాలా చిన్న పదమైనా;  తప్పే వ్రాయడం జరుగుతుంది. అంతా ఆ సరస్వతీదేవి కటాక్షం చేతనేనండీ యీ జరుగుతున్న దంతా.
ఇక మీరూ ప్రయత్నించారంటే ఈమాత్రం పద్యం రచించ లేకపోతారా! ఇంతకన్నా అద్భుతంగా పూరించ గలరని నా ప్రగాఢ విశ్వాసం. నా నమ్మకం ఒమ్ము కాదని నా విశ్వాసం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రయత్నించండి. మీ పూరణలను కామెంట్ ద్వారా అందఁ జేయమని నా మనవి.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

9 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ముంబై మారణ కాండను మత్తేభంలొ చక్కగా పూరించి తగిన నగర చిత్రాన్ని కుడా అందించ గలిగిన నేర్పు చింతా వారికి గాక మరెవరికి ? అది ఒక్క శారదా కటాక్షం ఉన్న వారికె లభిస్తుంది నీవు మెండుగా లభించిన వర పుత్రుడవు అభినందనలు తమ్ముడు !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరాభరనం బ్లాగులో దత్తపది౬ ను వ్రాసి
శ్రీ కంది శంకరయ్య గారికి పంపుతూ
ఈ దత్తపది పూరింప తగినదనీ; నేను పూరించినది చూడమనీ పంపగా
వారు తన అభిప్రాయాన్నీ క్రింది విధంగా
శంకరాభరనం బ్లాగుద్వారా నాకు తెలియ జేసారు. అతని అభిప్రాయం చూడండి.

కంది శంకరయ్య చెప్పారు...
చింతా రామకృష్ణారావు గారూ,

సోమ శేఖర్ గారిచ్చిన దత్తపదికి మీ పూరణ అద్భుతం. నేనైతే ఆ పదాలతో, ఆ విషయంపై పద్యం రాయడం అసంభవం అని చెప్పాను. సోమ శేఖర్ గారూ ప్రయత్నించారు. ఆ పద్యం మీ మెయిల్ కు వస్తుంది. దాని గుణదోష విచారణ చేయండి.
25 జూలై 2010 7:05 am

అజ్ఞాత చెప్పారు...

అల వాఘా సరిహద్దులో చివరిలో ఆ మూల శైలంబు దా
పల పూ రీతులు పెక్కు గల్గు వనిలో ప్రాంతంపు ముప్మాప యా
లిలు వీడచ్చట నిల్తువీవు పిరమిడ్లీలన్, ఇటన్ తాజు హో
టలులో నార్తులు పాహి పాహి యనిరే, ఓ సైనికాఫీసరా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అజ్ఞాతా! మీ యదార్థ నామధేయము తెలిపి యుండినచో చాలా సంతసించి యుండెడివాడను.
పద్యం చాలా సమర్థవంతంగా పూరించిన మీకు నా అభినందన పూర్వక ధన్యవాదములు.

చదువరి చెప్పారు...

అజ్ఞాత, పద్యం అదరహో! నాలుగు పదాలనూ మహా చాకచక్యంగా పొదిగారు. "యాలిలువీడచ్చట" వెంటనే అర్థం కాలేదు.

సార్ చెప్పినట్టు మీపేరు రాసి ఉంటే మరింత సంతోషించేవాళ్ళం.

రాఘవ చెప్పారు...

అబ్బో! కష్టసాధ్యమైనదే ఈ దత్తపదపూరణం.

రామకృష్ణారావుగారూ, ఉప్మాక??? కసభుక్ -- భలే. ఉప్మా అన్నారు కదా అని ఉపమాలంకారం వాడకుండా, రూపకం వాడుకున్నారేమండీ? :) ఈ స్తోత్రం చేసేది కరి అని చెప్పకపోయినా, ఆ ధ్వని కలిగించడం వలన భలే రసవంతంగా ఉందండీ. మీ భారతికి నమోవాకం.

అజ్ఞాతులవారూ, గజేంద్రమోక్షానికి అన్వయిస్తూ అంటే తెలివిగా అక్కడ పోతనగారి పద్యాలకు అన్వయించుకున్నారు కదా! పద్యమెత్తుకున్న తీరు భళా. ముప్పును ముప్ చేసి, ముప్ మాప అనటం కూడ చాలా బాగుంది. "ఆలిలు వీడచ్చట..." అన్నపుడు "ఆలుల వీడి అచ్చట..." అనా మీ అభిప్రాయం? చాలా చక్కటి, సమర్థవంతమైన పూరణ. జోహార్లు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా!
విశాఖపట్టణం జిల్లలో ఉప్మాక అనే గ్రామంలో కొండపై శ్రీవేంకటేశ్వరస్వామివారు అమ్మవారితో వేంచేసి అనాదిగా భక్తుల పాలిట కల్పవల్లిగా అలరారుతున్నారు.
ఆ ఉప్మాక గ్రామం తుని . పాయకరావుపేట దాటి వెళ్ళుతూంటే వచ్చే నక్కపల్లి అనే గ్రామం ప్రక్కనే ఉంది.
ఆక్కడిదైవాన్నే నేను ఉప్మాక దేవా! అని సంబోధించాను.
నీ స్పందనకు చాలా ఆనందం కలిగింది. ధన్యవాదములు.

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత వారి పద్యం బాగా వచ్చింది. ఆలిలు వీడచ్చట అంటే ఆలి ఇలు వీడి అచ్చట అని అనుకుంటా! చివరి పాదంలో యతి కుదిరిందా?

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారూ, చింతా వారూ, చదువరి గారూ,
ఉప్మా కు ముప్మా, ఇడ్లీ కి మిడ్లీ వాడవచ్చునో లేదో తెలియదు. ' ఆలి, ఇలు (ఇల్లు) వీడి అచ్చట ' అంతా కలిపి కొట్టి ఆలిలువీడచ్చట అన్నా. చివరి పాదం యతి చూసుకోలేదు. ఇలా తప్పులున్నా సెబాసని ప్రోత్సహించడం మీ పెద్ద మనసు. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.