గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2010, గురువారం

జయ రామ స్తోత్రము.( అధ్యాత్మ రామాయణము నుండి )

శ్రీ నేమాని రామ జోగి  సన్యాసి రావు అత్యాధునిక ఆంధ్ర మహాకవిగా నెల్లరి మన్ననలందఁ దగిన కవితా సామర్ధ్య సంపన్నులు. 
వీరు ప్రస్తుతము విశాఖపట్టణ నివాసి. వీరు ఈ మధ్యనే రచించిన "అధ్యాత్మ రామాయణము" అను పద్య కావ్యము నేటి ఆంధ్ర భాషాభిమానులకు అవశ్య పఠనీయ గ్రంథము.   
వీరు చేసిన జయ రామ స్తోత్రము అను  రామ స్తుతి లో కేవలము ఎనిమిది చిన్న చిన్న పద్యములలో కాండల వారీగా శ్రీరాముని వృత్తమును అత్యంత  నైపుణ్యముతో రచించి; అధ్యాత్మ రామాయణమును సంగ్రహముగా  తెలియఁ జేసిరి. ఈ ఎనిమిది పద్యములు పఠించినంత మాత్రమున శ్రీమద్రామాయణము పారాయణము చేసిన ఫలితము తప్పక కలుగునన్నట్లున్నవి. ఇంత నిపుణత కనబరచిన ఆధునిక కవి పుంగవులైన శ్రీ సన్యాసిరావు గారి ఈ రచన భక్తుల కందరికీ ఎంతో ప్రయోజన కరముగ నుండు ననుటలో ఏ మాత్రము సందేహము లేదు. 
ఈ గ్రంథము ఆవిష్కరణము అమెరికాలో శ్రీరామ చంద్రుని దేవాలయమున ప్రముఖుల సమక్షంలో జరిగినప్పటికీ ప్రతులు అందరికీ అందుబాటుకు రావడానికింకొంత సమయం పట్ట వచ్చును.
ఆ జయరామ స్తోత్రము మీరూ పఠించేటందులకందుబాటుగా మన ఆంధ్రామృతంలో ప్రచురించితిని. చూడ గలందులకు మనవి.
బాల కాండ.
పుడమి భరము బాపు పురుషోత్తమా! దేవ!
యజ్ఞ రక్షకా! మహర్షి  వినుత!
క్షత్రవార్ధి  సోమ! కల్యాణ గుణ ధామ!
జనకజాభిరామ! జయము రామ!
అయోధ్యా కాండ.
విపినములకు నేగి పిత్రాజ్ఞ పాలించి;
భ్రాతృ వినతి కొలది పాదుకలిడి;
మునుల వలె చెలగిన యిన వంశ శేఖరా!
జనకజాభిరామ! జయము రామ!
అరణ్య కాండ.
అసుర తతులనెల్ల నంతమొందించుచు
అఖిల ముని జనముల కండ వగుచు
నపహరింపఁ బడిన యవనిజకై పొక్కు
జనకజాభిరామ! జయము రామ!
కిష్కింధా కాండ.
వాలిని బరిమార్చి వాని తమ్ముని బ్రోచి
కపుల సాయ మంది క్ష్మా తనయను
వెతుక బట్టినట్టి విశ్వ నటాధిపా!
జనకజాభిరామ! జయము రామ!
సుందర కాండ.
అంజనా తనయున కంగుళీయకమిడి
ఆశిషములనిచ్చి యనిపి వాని
వలన సీత యునికి వార్త నెఱింగిన
జనకజాభిరామ! జయము రామ!
యుద్ధ కాండ.
వారిధి పయి యొక్క వారధి నిర్మించి
పంక్తి ముఖు వధించి వాని యనుజు
బ్రోచి; జనక సుతను బొందిన జయ రామ!
జనకజాభిరామ! జయము రామ!
ఉత్తర కాండ.
చేరుకొని యయోధ్య క్షితి నేలినాడవు.
శాంతి సుఖములు గని; జను లలరగ.
రామ రాజ్యమవని రాజిల్ల స్థిరముగా.
నకజాభిరామ! జయము రామ!
తత్వ సంగ్రహము.
సకల లోకములకు సంతతాధారమై
బయట లోన నుండు పరమ పురుష!
ఆత్మ వీవు సచ్చిదానంద మూర్తివి.
జనకజాభిరామ! జయము రామ!
చూచారు కదండీ! సంతోషం.
వారితో మాటాడాలని మీకుందా? ఐతే ఆలస్యమెందుకు? 
ఇదిగో వారి ఫోన్ నెంబరు.  08912565944.
ఆ మహా కవి మిత్రులకు ఆంధ్రామృతం తరపున  అభినందన పూర్వక ధన్యవాదములు తెలియఁ జేస్తున్నాను.
జై శ్రీరాం 
జైహింద్.
Print this post

7 comments:

కంది శంకరయ్య చెప్పారు...

ఏమని నుతి సేతు 'నేమాని సన్యాసి
రావూ గారి 'జయము రామా మకుట
శోభితంబులయి మనోభిరామంబులై
వెలయు పద్య తతికి వేయి నుతులు.
చింతా రామకృష్ణారావు గారూ, నమస్సులు. గొప్ప పద్యాల నిచ్చారు. ధన్యవాదాలు. అన్నట్టు మీ పోస్టులకు తగిన ఇంత మంచి చిత్రాలు ఎక్కడ సంపాదిస్తున్నారు? వాటిని ఇంత అందంగా ఎలా అప్ లోడ్ చేస్తున్నారు? ధన్యులండీ మీరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది శంకరయ్య! వందనంబులు మీకు.
ధన్య జీవు లీరు. మాన్య వర్య!
రామ పాదుకలవి రాజ్యమేలెనుకదా!
రామ స్తోత్రమింక రమ్యమవదె?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

జయరామ స్తోత్రమును ఎనిమిది పద్యములలొ అందించి పారాయణ చేసిన ఫలితమును దక్కించి నందులకు " కవి పుంగవులైన శ్రీ సన్యాసి రావు గారు అంతటి మధుర మైన పద్య కావ్యమును ముందుగా పాఠ కుల కందించిన చింతా వారు ధన్యులు.

రాఘవ చెప్పారు...

"అపహరింపఁబడిన హరిణికై వగఁగొన్న"-- ఎలా అన్వయించుకోవాలండీ?

"వారిధి పై యొక్క వారధి నిర్మించి"-- "వార్ధిపైన నొక్క వారధి నిర్మించి"? ముద్రారాక్షసమేమోనండీ చూడగలరు.

* * *

దివి భూమౌ తథాకాశే బహిరన్తశ్చ మే విభుః।
యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః।।

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవి రాఘవా! మీ సందేహానికి కవిగారు ఇచ్చిన వివరణను దీనికి జత చేసాను చూడండి.
RS Rao Nemani కి నాకు
వివరాలను చూపించు 12:14 pm (1 గంట క్రితం)
Dear Sir,
Vaaridhi is perfectly in order means samudramu.
Harini means lakshmee devi (ref: Sreesooktam) which can be applied to seeta devi too.
Hope the doubts are cleared.
Sanyasirao

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ నాకు వ్రసినది

రామకృష్ణారావు గారూ

౧ సందిగ్ధం కూడ దోషం కాబట్టి, సందిగ్ధం కలగకుండా ఉంటే మఱింత బాగుంటుందని, హరిణి అన్నది ఆడువారిలో ఒక జాతిక్రింద వస్తుందేమో కదా అన్న అనుమానంతో అడిగానండీ. శ్రీసూక్తభాష్యంలో సాయణులు చెప్పినది "హరిణీం హరితవర్ణాం హరిణీరూపధరాం వా" అని కాబట్టి అనుమానం నివృత్తి అయ్యింది.

౨ వారిధి... గుఱించి నేను అన్నది ఆటవెలది పాదం కావటం లేదు, గణాలు పోయాయీ అని మాత్రమేనండీ. వారిధి ప్రయోగంపై నాకు అనుమానం లేదు.

నమస్సులతో
రాఘవ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా! మీ సందేహానికి కవిగారిచ్చిన సమాధానం మీకు ఈ వ్యాఖ్యలో తెలియఁ జేస్తున్నాను. గమనించి స్పందింప గలరు.


---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
పంపినవారు: RS Rao Nemani
తేది: 21 జూలై 2010 1:03 pm

సబ్జెక్టు: Re: [ఆంధ్రామృతం] జయ రామ స్తోత్రము.( అధ్యాత్మ రామాయణము నుండి )పై క్రొత్త వ్యాఖ్య.

Dear Sir, Namaste!
Thanks for your suggestions. " vaaradhi payi nokka vaaridhi nirmiMci " ane aataveladi paadamlO ay doshamoo ledu.
Sanyasirao

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.