గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2010, ఆదివారం

శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతాభివందనములు.



శ్రీమదాంధ్రామృతమును గ్రోల నేర్చిన సహృదయులు పరమానంద సంభరితహృదయులై నిత్య నూతనోత్తేజ భాసుర ముఖు లగుదురన్న నగ్న సత్యమును అనుభవ పూర్వకముగా గ్రహించిన నేను;  ఆంధ్ర భాషాభిమానులకు నేను పొందుతున్న ఆనందమును  పంచ వలెననెడి భావముతో " ఆంధ్రామృతం "  అనెడి బ్లాగును ఆంధ్ర భాషలో ప్రారంభించి యుంటిని.
ఇంత వరకు అనేక సాహిత్యాంశములను వివిధ రీతులలో ప్రచురించి యుంటిని. 
ముఖ్యముగా పద్య రచనా విధానమును; రచనా వైవిధ్యములను; పద్య రూపమున గల చమత్కార ప్రశ్నలను; బంధ చిత్ర కవిత్వ రీతులను; పద్య రచనలో గుణ దోష వివరణను తెలుపుటయే కాక; మహా కవుల రచనా విశేషములను;  ఆటి విషయమై కవి పండితుల ఉపన్యాస సారాంశములను వ్రాసి యుంటిని. అందు ముఖ్యముగా కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్య నారయణ గారి రామాయణ కల్ప వృక్షముపై  కవి వతంస బిరుదాంకితులగు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు చేసిన పరిశోధనాత్మక ఉపన్యాసములను "కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత" అనే శీర్షికతోసుమారు 50 వ్యాసాలుగా ప్రచురించి యుంటిని.
చ:- 
కవియును పండితుండునయి కావ్య విశిషిష్టత గాంచ నేర్చు స
ద్భవునకు సాధ్యమైన పని భవ్యుల భావుకతల్ గణించుటల్.
పవలును రేయి  భావుకత వ్రాసిరి సత్కవి విశ్వనాథ ప్రా
భవము గణించి యీ బులుసు వంశ మహోద్భవ వేంకటేశ్వరుల్.
మిత్రులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఆంధ్రామృతం ద్వారా నేను చేయుచున్న ప్రయత్నమునకు స్పందించి తమ ఉపన్యాసములనుండి " కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత " అను పేర దాదాపు ఏబది వ్యాసములను  శ్రమ దమాదుల కోర్చి; లిఖిత పూర్వకముగా నాకు నిరంతరాయముగా పంపియున్నందున నేను ఆయా వ్యాసములను ఆంధ్రామృత పాఠకులకు అదించి తద్వారా వారి ప్రశంసలకు పాత్రుఁడనైతిని. ప్రపంచ వ్యాప్తముగానున్న ఆంధ్రుల కందుబాటులో నున్న ఈ వ్యాసములను అనేకులగు ఆంధ్రామృతాభిమానులు పఠించి అమిత కావ్యానంద పారవశ్యమును పొందిరి. ఈ విధముగ విశ్వనాథ భావుకతను పరిశీలనాత్మక వ్యాసములుగా నాకందఁ జేసిన కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి నామనః పూర్వక ధన్యవాదములు ఆంధ్రామృతం తరపున తెలియఁ జేసుకొను చున్నాను.
ఇట్టి సాహిత్య కృషి నిరంతరాయముగా చేస్తూ ఇంకా మధురాతి మధురమైన అనేకులైన మహ కవుల కావ్యాలలో నిబిడీ కృతమైయున్న వారి భావ వైశిష్ఠ్యములను; కవితా వైవిధ్యములను; తమ ఆలోచనల ద్వారా వెలికి తీసి ఉపన్యాసాలుగా ఆంధ్ర ప్రజానీకమునకందించుటయే కాక ; ఆయా వ్యాసములను మన ఆంధ్రామృతం ద్వారా పాఠకాళికి అందించెడి అవకాశము కల్పించ గలరని ఆశించు చుంటిని.
-:చ`తురంగ'గతి బంధ కందము:-
సొగసులు తెలుపగను బులుసు 
తగును వసుధను. ఘనులును; నుత జనములు కనన్ 

దగు హితములు;  మునుల తతులు 

తగ భరత కులజుఁడని శుభ తతి నిడు కవికిన్. 
సొ  గ   సు  లు   తె    లు   ప      గ 
ను బు లు  సు   త     గు  ను      
సు   ను.  ఘ  ను    లు  ను;   ను 
 .   న    ము లు               న్
ద   గు హి   త    ము  లు ము   ను
ల   త  తు  లు   త     గ      భ     
   కు ల  జుఁ   డ     ని    శు     
త   తి   ని    డు   క     వి     కి     న్. 
స్వస్త్యస్తు.
జై శ్రీరాం. 
జైహింద్.
చింతా రామ కృష్ణా రావు.
తే.౦౮ - ౭ - ౨౦౧౦.
(ఆంధ్రామృతం బ్లాగరు)
చోడవరం.
http://andhraamrutham.blogspot.com
Cell No. 9247272960. 

 








Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.