గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2010, శనివారం

శ్రీ చక్ర బంధ తేట గీతము 2

శ్రీ చక్ర బంధ తేట గీతము.
వనజ నాభుఁడ! శ్రీయుత! భావ్యమౌన? 
లఁక్ష్మిఁ గలిగియు శ్రీఁ గొల్ప రాదె? యే ది. 
యు మన నీకున్న శ్రీశుండ! యుందు నేడ?
జేయున్నంది వా దేవ!
భావము:-
ఓ పద్మ నాభుఁడా! లక్ష్మీ సమేతుఁడా!నీకిది భావ్యమగునా?
నీవు లక్ష్మిని కలిగి యుండియు మాకు ధనమును కలుగునట్లు చేయరాదా?ఓ లక్శ్మీపతీ! నేను (ఏదియు; మనన్ + ఈకున్న ) మనుట కొఱకు ఏదియూ నీ వీయనిచో నేనెందుండువాఁడను? ఓ దేవా! వీధిలో గల నన్ను అందుకొని వరలునట్లు చేయుము. (నాకు"వలయునది+ఇడవ?"= "వలయునదిడవ(వా)?" = నాకు కావలసినది నీవు ఈయవా యేమి? తప్పక ఇమ్ము అని భావము).ఈ చివరిది వివిధ పద గోపనము అనెడి బంధ కవిత.
సాహితీ ప్రియులారా! వందనములు.
శ్రీ చక్రమును ఇంకా పెద్దదిదా చూడాలనుకొంటే ఆ చక్రంపై మౌస్ తో ఏరో మార్కు ఉంచి లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఆంధ్రామృతాన్ని ఆరగిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.
దయ చేసి మీరు కూడా సముత్తేజితులై వినూతన ప్రక్రియలో రచన చేసి పంపగలందులకు మనవి. అవి ఆంధ్రామృతం ద్వారా పాఠకుల కందించే ప్రయత్నం చేయగలను.
జై శ్రీరామ్,
జైహింద్. 
Print this post

3 comments:

రవి చెప్పారు...

తేటగీతే అందమైనది. శ్రీచక్ర బంధముో మరింతగా శోభిస్తూంది.

అజ్ఞాత చెప్పారు...

ఆర్యా నమస్తే,

మీరుచెప్పిన విధముగ రెండు చక్రబంధ తేటగీతులు భావముతో పంపుచున్నా ను.కాని చక్రములను చూపలేకున్నాను.వీటిని పరిశీలింప గోరుచున్నాను.


శ్రీచక్రబంధ తేటగీతం - 1

సిరియనంగను శ్రీకాంతు దివ్యభామ
లక్ష్మి యని బిల్వ శ్రీలిచ్చు, లచ్చి మంచి
యున్నతిని గూర్చు శ్రీరమ్య యున్నమేర
సిరులనీయుమ మన్నించి క్షీరవాసి

భావం

సిరి యనగా శ్రీకాంతుని భార్య. లక్ష్మియని పిలిచిన లక్ష్మీదేవి
సంపదలు చేకూర్చును. మంచి యున్నతిని ఆదిలక్ష్మి యున్న మేర చేకూరును. పాలసముద్రమునందు వసించు లక్ష్మీ మాకు సంపదలిమ్ము

శ్రీచక్రబంధ తేటగీతం - 2

వరములీనెడు శ్రీరవి భాగ్యుడై,నె
ల కొనగన్ "గురు" శ్రీరాజ్యలక్ష్మినౌగ
మితముమీరిన శ్రీలందు మేలునౌను
వరల నిమ్మిక నెన్నంగ భానుదేవ

నౌగ = ఔనుగదా
వరలనిమ్మిక = ఇటుపైని ఒప్పునటుల చేయుము

భావము

వరములను ప్రసాదించెడి గ్రహరాజు రవి భాగ్యస్థానమునందుండి గురుడు రాజ్యస్తానమునందుండిన రాజ్యలక్ష్మిగలవాడవును. మితిమీరినసంపదలుండి మేలుగ జీవించును. ఓ భానుదేవ ప్రజలను ధనధాన్యములతో తులతూగునటుల వరములిమ్ము

తే. గీ.
చెడు గ్రహంబులుజూచిన చెడును ఫలము
శనియుజూచిన ఆంగ్లంబు చక్కనేర్చు
రాజకీయాన రాణింప రాడుసుమ్మ
కుజునిచూపున కల్గును కువలయంబు


వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి, జుత్తాడ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నరసింహ మూర్తి మాష్టారూ!నమస్తే.
చాలా చక్కగా వ్రాసారు.మీలో ఇంతటి మహత్తర కవితా శక్తి దాగి ఉంది కదా! మరి అది వెలికి రావడానికి ఇన్నాళ్ళా!!!
అధుతం.
మీ సాధన నిలాగే కొనసాగించండి.
అభినందన పూర్వక ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.