గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2010, ఆదివారం

అల్లసానిని అవ హేళన చేస్తూ చెప్పిన రామలింగని చాటువు.

ఒకమారు అల్లసాని పెద్దన కవి ఒక కవితలో "అమావాశ్య నిశి" ని ఛందస్సు కోసం "అమవస నిసి" అని వాడగా దానికి రామలింగకవి పెద్దనను ఎగతాళి చేస్తూ చెప్పిన అద్భుతమైన చాటువు గా చెప్పఁ బడుతున్నదీ క్రింది పద్యము. మీరూ చూడండి.

ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!
భావము:-
ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని అమవస నిసి అని చెప్పితివి కదా?  ఏమి తిని చెప్పితివి? భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?
ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వఛత లేని పదం అని  రామకృష్ణ కవి నిష్కర్షగా ఆశుపద్య రూపమున తన అభిప్రాయమును వెల్లడించెను.
జైహింద్.
Print this post

7 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది చాటువు అవును ! " వారిజాక్షు లందు వైవాహికము లందు " ఈ పద్యము నేను చాటువుల్లో చదివాను " " అది చాటువు కాదని కొందరి వాదన మరి ఇంతకీ అది చాటువా ? కాదా ?
చాటువు = ఇష్టమైనది ,లోకోక్తి ,అనే కదా అర్ధం [ నాకు తెలిసి ]

ప్రణీత స్వాతి చెప్పారు...

తెనాలి రామకృష్ణ నాకు చాలా ఇష్టమైన సినిమా. మంచి పద్యం చెప్పారండీ..ఈసారి భావం చదవకముందే..పద్యం చదువుతోంటేనే అర్ధమైపోయిందండీ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నమస్తే రాజేశ్వరక్కయ్యా!
ధన్య వాదములు.
మీరు చెప్పినట్టు వారిజాక్షులందు అనే పద్యం చాటువు కాదు.
చాటువు అంటే సందర్భానుసారము ఆశువుగా కవి చెప్పే మాటలు పద్యాలు.
ఐతే కొన్ని ముఖ్యమైన పద్యాలు మనవ జీవితలో మమైకమైపోతాయి. అవి అతి ప్రముఖమైన గ్రంథస్థ పద్యములైనప్పటికీ మనుజుల నాలుకపై నాని నాని గ్రంథము నుండి వేరు పడి తమ ప్రాశస్త్యాన్ని పెంచుకొని కాలక్రమంలో చాటువేమో అనిపించేంతగా ప్రఖ్యాతమై; చాలా మంది అది చాటువే అని భావించేలా గుంటాయి. అంత మాత్రాన అవి మూల గ్రథం నుండి మరుగునకు పోలేవు.
మీరు చెప్పిన పద్యం పోతన భాగవతం అష్టమ స్కంధమున 20 వ అధ్యాయమున 584 వ పద్యము.
వామనునకు బలి చక్రవర్తి కోరిన మూడడుగులను దానం చేయడానికి సంసిద్ధమౌతూంటే ఆచార్యుఁడగు శుక్రుఁడు
" ఆడి తప్పనన నవసరము లేదు. ఏలందువా దీనికొక ధర్మం ఉంది. అదేమిటంటే మనం కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో అబద్ధం ఆడ వచ్చును. చెప్పుతున్నాను విను.
‘వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పోంద దధిప!’"
అని అంటాడమ్మా!

కథా మంజరి చెప్పారు...

మంచి ఫొటో పెట్టారు. చాలా బాగుంది.

రవి చెప్పారు...

తెనాలి ఆయన భట్టుమూర్తిని కూడా ’కీసర బాసర కాపు కూతలు’ అంటూ ఓ సందర్భంలో దూషించినట్టు, కవయిత్రి మొల్లతో అసభ్యంగా మాటలాడినట్టూ, ఇలా నానాకథలూ ఉన్నాయి కదండీ. ఎంచేతో తెనాలి రామకృష్ణుడికీ బుద్ధి? ఈ మహానుభావుడు రాయల వారి తర్వాత ఏమయ్యాడో ఏమో?

సరస్వతుల శ్రీనివాస ఉమాశంకర్ చెప్పారు...

అంతటి తెంపరితనం బహుశా రామకృష్ణునికే సాధ్యమేమో! రాయల ఆస్థానానికి విచ్చేసిన నరసరాజ కవిని సైతం పెద్దల కవిత్వంలో తప్పులు పడతానన్నందుకు ఆగ్రహం తో ఊగిపోతూ ఆశువుగా చెప్పిన "తెలియనివన్నితప్పులని" పద్యం లో "పలుమార్లు పిశాచపు పాడె కట్టా" అని దునిమినా ఆయనకే చెల్లింది. రామలింగని పద్యాలతో నేను గతంలో పెట్టిన పోస్ట్ ను ఒకసారి సందర్శించి మీ అభిప్రాయం తెలియజేయగలరు.

http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_5015.html

అలాగే "కాస్త ఇలా చాటు కొస్తారా" శీర్షికతో నేను పోస్ట్ చేసిన చాటు పద్య సేకరణ (మీకు తెలియవని కాదు...ఏదో నా తుత్తి అంతే) చూసి ఎలా ఉన్నాయో చెప్పండి

కాస్త ఇలా చాటు కొస్తారా - ఒకటో భాగం
http://blogavadgeetha.blogspot.com/2009/12/1.html

కాస్త ఇలా చాటు కొస్తారా - రెండో భాగం
http://blogavadgeetha.blogspot.com/2009/12/2.html

కాస్త ఇలా చాటు కొస్తారా - మూడో భాగం
http://blogavadgeetha.blogspot.com/2009/12/3.html

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీంద్రా! ఆశీశ్శులు.
నీ ప్రశ్న సముచితం. ఐతే నాకు లభించిన పద్యంలో దోషములుండ వచ్చును. రామకృష్ణుడు సరిగానే చెప్పి ఉండ వచ్చును. సరియైన ప్రతి లభిస్తే సరి చేస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.