
మనం అతి ముఖ్యమైన; చేయ వలసిన పనుల కంటే కూడా అత్యంత ముఖ్యమైన చేయ కూడని పనులేవో మున్ముందుగా తెలుసుకొని ప్రవర్తిస్తుంటాం కదా! న రావణాదివద్వత్రితవ్యం. రామాదివద్వర్తితవ్యం. అనే అంశాలు గ్రహించినప్పుడు రాముడులాగ ప్రవర్తిస్తే మంచి పేరొస్తుందో రాదో కాని రావణాసురుఁడు లాగా ప్రవర్తించ కుండా అను క్షణం జాగరూకతతో జీవితాంతం మెలగాలి. ఇందేమాత్రం భంగం వాటిల్లినా అపకీర్తికి అంతు ఉండదు కదా!
సరే ఆ విషయానికేమి కాని - - - ప్రస్తుతం పద్య రచన చేయాలనే ఆసక్తి ఉన్న మనం మాత్రం ఏ అలంకారం ప్రయోగించినా; ఎంత అందంగా చెవులకింపుగా పద్యం వ్రాసినా మంచి పద్యాలలో ఒక మంచి పద్యంగా సామాన్యంగా కొత కాలం మాత్రమే గుర్తింప బడుతుంది. ఇక చేయకూడనివి కొన్ని మనకు ఛందో నియమాల్లో చెప్ప బడ్డాయి.
వాటిలో దశ విధ దోషాలు ప్రక్కన పెట్టితే; అతి ముఖ్యంగా పద్యాది ఎలా గుండాలో ముఖ్యంగా ఎలాగ ఉండ కూడదో చెప్ప బడింది. ఆ నియమాన్నతిక్రమిస్తే వచ్చే ప్రతికూల ఫలితాలు కూడా వివరింప బడ్డాయి. వాటి యందు కావ్యమున కాని మరే రచన యందు కాని వ్రాసెడి మొదటి పద్యంలో ఏ స్థానంలో ఏ అక్షరం నిషిద్ధమో వివరించ బడింది. అది మీ ముందుంచుతున్నాను. దయచేసి ఇది శాస్త్ర బద్ధమైన నియమమని; నమ్మడం; నమ్మకపోవడం కవి మనసుపై ఆధారపడి ఉంటుందని మరచిపో వలదని మనవి.
1 వ అక్షరముగా:- అలు - అలూ - ఋ - ౠ - గ - ఘ - ఙ - చ - ఛ - జ - ఝ --- ఞ - ట - డ - ఢ - ణ - ద - ధ - న - బ - భ - మ - య - ర - ల - వ ళ - స - క్ష .
3 వ అక్షరముగా :- అ - క - గ - జ - ట - డ - త - ప - ర - శ - స - హ.
5 వ అక్షరముగా:- ర - స - జ - గ.
6 వ అక్షరముగా :- అ - ఆ - క - గ - జ - ట - త - ప - ర - శ - స - హ - క్ష.
7 వ అక్షరముగా :- అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష.
11 వ అక్షరముగా :- అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష.
----ప్రయోగింప రాదు.
----ఇది కేవలము కావ్యమున కాని; ఖండిక యందు కాని ప్రథమ పద్యమున ప్రథమ పాదమున మాత్రమే యని గ్రహించునది.
మిత్రులారా! ఈ నియమాన్ని భూతద్దంలో చూసి భయపడి; మనకెందుకొచ్చిన తల్నొప్పి లెద్దు అనుకొని మీ రచనా వ్యాసంగానికి స్వస్తిమాత్రం పలకకండి సుమా!
జైహింద్. Print this post
9 comments:
ఇదివరకు గోమూత్రికాబంధంలో నేను ప్రయత్నించిన కందం అపలక్షణ భూయిష్టమని అ(క)నిపిస్తున్నది. వచ్చేసారి ఈ నియమాలు గుర్తుంచుకుంటాను.
గణాలకు సంబంధించి కూడా ఏవో నియమాలున్నవని ఒకచోట చదివాను.వీలయితే తెలుపగలరు.
మీ నుండీ బంధకవిత్వపు వివరాలు మరిన్ని తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాను.
గురువు గారూ, ఇన్ని నిషిద్దాలు ఉన్నాయా ...
నేను ఆరవ అక్షరం గా త చెల్లదనే విషయాన్ని వినియున్నాను కాని .. పూర్తి జాబితా చూడటం ఇదే ప్రధమం. అలాగే దశవిధదోషాలను గూర్చి తెలియజేయమని మనవి.
ఆర్యా! ఊకదంపుడుగారూ!
దశవిధ దోషాలను తెలియజేసే ప్రయత్నం తప్పక చేస్తాను త్వరలో.
ధన్యవాదములు.
రవీ! వాంఛితార్థ ఫలసిద్ధుఁడవు కాగలవు.
గణాలకు సంబంధించీ; దశవిధ దోషాలు గూర్చీ త్వరలో అధ్యయనం చేద్దాం.
ధన్యవాదమ్లు.
నిషిద్ధాక్షరి " అవధానంలొ చూసినప్పుడు " పద్య పాదంలొ గణ విభజనకి పద్యం యొక్క అర్ధానికి తగిన విధము గా ఒక అక్షరాన్ని ఒకరు తొలగించెతె మరొకరు { అంటే అవధాని గారు ప్రుచ్చకులు ] అదే అర్ధముగల మరొక అక్షరాన్ని ఉపయొగిస్తారని అనుకున్నాను సరస్వతీ పుత్రులు చాలా చక్కగ విశదీకరించారు బాగుంది
ఛందోప్రియులకు, మరీ ముఖ్యంగా బంధ కవిత్వ రచన పట్ల మక్కువ చూపే వారికి మీరిచ్చిన వివరాలు చాల ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు.
ఛందో నియమాలు క్లిష్టతరంగా ఉన్నట్టు అనిపించినా, అనవరత సాధన వలన చాల సులభతరంగా కనిపిస్తాయి.
అప్ప కవీయము, అనంతుని ఛందము, కవిజనాశ్రయము వంటి గ్రంధస్థ విషయాలు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూ ఉంటే పద్యం మీద ప్రేమ మరింత అధికమవుతుంది.
ఈ పని చేయడానికి మీరు సమర్ధులు దోష ప్రకరణం కూడ విశదీకరించగలరు.. మీకు నా అభినందనలు.
ఆర్యా, శ్రీమదాంధ్ర మహాభారతము నందు నన్నయ్య గారు ప్రారంభించిన పద్యం 'శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో' నందు 5,6వ అక్షరములు రి,జా లు వచ్చియున్నవి. తిక్కన్న గారు ప్రారంభించిన పద్యం 'శ్రీయన గౌరినా బరగూ నందు ఐదవ అక్షరము రి వచ్చియున్నది. ఇవి పై నిషిద్ధములకు వ్యతిరేకముగా నున్నవి కదా! మీరేమందురు?
ఫణి ప్రసన్న కుమార్ గారూ! కవిజనాశ్రయములో ప్రయోగాప్రయోగ వర్ణాలను నిర్దేశించి చూపుతూ శ్రీకారం ప్రారంభంలో ఉంటే దోషాలు పరిహరింపబడతాయన్నాడు. కాన పెద్దల ప్రయోగాలతో నిమిత్తం లేకుండా శాస్త్రాన్ని అనుసరించితే మనకు అనర్థముండదనే నమ్మకంతో అనుసరించడం మనకు శ్రేయస్కరం అని నా విశ్వాసం.
ధన్యవాదములు. కృతజ్ఞుడను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.