గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2010, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 46 & 47.

కంll
అట శబరియు నిట పంపయు
నటు లాత్మకు నిటుల కనుల కనవధి భూత
స్ఫుటతర సుఖానుభూతిం
ఘటియించిరి యింత కష్ట కాలము నందున్. (1 - 46)
కంll
ఆ యాపద యచ్చోటిది
రా! యని తెలిసినను కొంత రాపిడి తగ్గున్.
కోయిలయు నుల్ల కొండల
లోయలలో నుండి యెడదలో నిడియించున్.(1 - 47)
శబరి - పంపా సరస్సు శ్రీరాముని ఆత్మకు కనులకు అంతు లేని ఆనంద ప్రదమైన సౌఖ్యమును కలిగించినవి. ఇంత కష్ట కాలము లోను దుఃఖమును మరపించినవి అనినాఁడు శ్రీరాముఁడు.
శబరి రామ భక్తురాలు. బోయ కాంత యైనను ఆ యమ్మ ప్రతీక్షా రూపమైన తపస్సు, ఆతిథ్య రూపమైన అర్చన శ్రీరామునికి హృదయానంద కారకమైనవి. ఆమె మాటలాడినంత సేపు శ్రీరాముఁడు పొందిన ఆత్మానందమునకు అవధి లేదు. ఆమెతో స్వామి పరియాచకము లాడినాఁడు కూడా. సీతా వియోగ వ్యథనే మరిపించినది శబరీ సాన్నిధ్యము.
శబరి ఎట్లున్నది? శిరసుపై పూల తట్ట మోయు చున్న ఆమె తుట్ట తుద దాక ఎండిన చెట్టు కొమ్మ - శేఖరంబున యందు పుష్పించినట్లున్నదట. పరమ యోగిని యైన శబరితో శ్రీరాముఁడు మాటలాడిన మాటలన్నియు చమత్కారములు మరియు నిర్భర దివ్యార్థములై కన బడునట్లు విశ్వనాథ ఉక్తి వైచిత్రిని పండించి పోసినాఁడు. 
అవ్వ! నివ్వరి వెన్నులయట్లు ముగ్గు
బుట్ట వలె నయ్యె నీ శిరంబును ననంగ
ప్రభువ! నీ ఆత్మ వాకిట రంగ వల్లి
నినుచుటకు నింతగాగ పండిన దతంచు.
(అరణ్య కాండ శబరి ఖండము- 357)
శ్రీరాముఁడు శబరిని ఆశ్వీయుజ సంబంధాంబు దాలకా! (ఆశ్వయుజ మాద మేఘము వంటి ముంగురులు కల దానా!) అని ప్రేమతో పిలువగా శబరి సుందరాపాంగ మంధరవిద్యుజ్జలదాభిరామ తను! (అందమైన కంటి చూపుల మెరుపులు గలిగినట్టి నీలి మేఘాభిరామ శరీరా!) అని పిలుస్తుంది.
శబరి కనుల యందు స్వామి తా దన ప్రతిబింబమరసి దార విరహ మూర్తి
విరహ బాధయెల్ల విడిచెను. అని విశ్వనాథ వర్ణించినాఁడు.
యోగ కర్త యోగ భర్త యోగ ఫల స్వరూపుఁడైన శ్రీరామునకు శబరీ యోగినీ సామీప్యము ఆత్మానంద మొనరించుటలో వింత లేదు కదా!
ఇక పంపా సరస్సు నేత్రానంద ప్రదాయిని. ఆయా సందర్భములలో పంప సౌందర్య వీక్షణా లాలసతచే రాముఁడు ప్రకృతి స్వరూపిణి యైన సీతను చూచినట్లే ఆనందించినాఁడు. 
అక్కడ శబరి ఇంద్రియాతీతమైన ఆనందము కలిగించి సీతా విస్మృతిని కలిగించగా ఇక్కడ పంపా సరస్సు ఇంద్రియగతమైన (నేత్ర) ఆనందమును కలిగించి సీతా సందర్శనము చేయించినది శ్రీరాముని చేత. బాహ్యావరణ విచ్ఛేదమునందు జానకి విస్మృతితో ఆత్మానందము ప్రకాశము కాగా సంఘటించినది శబరీ దర్శనము. తాను రాముఁడనే స్పృహ యందు సీతా సౌందర్యమును దర్శింప జేసినది పంపా సరోవర దర్శనము.
ఈ విధముగా తనకు సీతా విస్మృతి యందును సీతా స్మృతి యందును చేతను ఆనందమును ప్రసాదించిన శబరి పంపా సరస్సును స్వామి కృతజ్ఞుఁడై స్మరించుట శ్రీరాముని సద్గుణ విశేషము కాక మరేమిటి? 
ఇంతలో దూరపు కొండలలో నుండి  వచ్చిన కోయిల కూత రాముని హృదయమును గాయ పరచినది. 
ఈ ఆపద యిచ్చటి నుండి వచ్చునని తెలిసినచో హృదయము రాపిడి తగ్గును కదా! ఆ కోకిల చూడుము. ఎచ్చత ఉన్నదో. లోయలలో దాగి యుండి నన్ను బాధించు చున్నది. అని రాముఁడు లక్ష్మణునితో పలుకును. ఈ మాటలు సీతను అపహరించిన రావణుఁడు ఎచ్చటనున్నాడో తెలియని అసక్తతను కోకిల వ్యాజమున రాముఁడు వ్యక్తపరచు చున్నట్లు  గ్రహించ వలెను. 
మహా కవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు కల్ప వృక్షమును శ్లాఘించిన తీరు ఇది.
భద్రాధార కథా ప్రసాద గుణ శుంభాన్మూల మారూఢ భా
షా ద్రాగ్గుంఫ కళా ప్రవిచలత్ శాఖా ప్రశాఖంబు కుం
భ ద్రోణీ కృత పూరితాఖిల రస స్వచ్ఛాల వాలంబు. శ్రీ
మద్రామాయణ కల్ప వృక్షమున కస్మత్ గంధపుష్పాక్షతల్.
జై శ్రీరాం.
చూచారు కదండీ 46 & 47 భాగములు.
తదుపరి భాగాలు త్వరలో తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దం.
జైహింద్.  
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.