జగతి నశేష సౌఖ్యములు చక్కగ చూపుచు; మాయఁ గొల్పి; మా
ప్రగతి యభాగ్య భాగ్యములె భవ్యములంచు తలంపఁ జేసి; సత్
సుగతికి దూరమై కడకు శూన్యమునన్ మము నిల్పి ; చింతలన్
రగులొకొనంగ చేసెదవు. రక్షక! శ్రీహరి! న్యాయమా? ప్రభూ!
కర్మముఁ జేయుటే తగును. కాదని పోవ యధర్మమౌను. సత్
కర్మలె జేయనౌ ననుచు కమ్మగ గీత వచించు. కాని మా
ధర్మము కర్మగా కనుక తప్పదు. అందున క్రూర మైనదు
ష్కర్మలఁ జేయఁ జేసి నరకంబున కంపుట ధర్మమా హరీ!
జగతి ననేక జీవములఁ జంపక జీవనమెట్లు సాగు? మా
ప్రగతికి హింస తప్పదు. అబద్ధపు జీవన జీవికార్థమై
సుగతికి దూరమౌ విధిని చూపితివేల? యహింస మార్గమున్
జగతిని గొల్పి యున్న; నిను చక్కని దైవమటంచు మ్రొక్కమే?
అష్ట ప్రసిద్ధ సిద్ధులను హాయిగ నేర్పితి వొక్క నాడు. పల్
కష్టములైన గాని మది గాంచక చక్కగ సాగె నాడు. నీ
సృష్టికి వింత శోభలను చేర్చగ నన్నియు వీడఁ జేసి యీ
కష్టములన్ సృజించితివి. కాంచవదేలర! మమ్ము శ్రీ హరీ!
తపమును జేయుచుంటి. పరితాపము బాపుము జీవకోటికిన్
విపులము కాగ నీ మహిమ విశ్వము నేలుచు మమ్ముఁ బ్రోచుచున్;
నిపుణతఁ గొల్పు! నిన్ గనగ. నిత్యుఁడవై మది నిల్చి యుండు; మా
తపమును బాపుమయ్య! వర దాతగ నీవయి లోక పాలకా!
జైహింద్.
Print this post
2 comments:
జగతి నశేష సౌఖ్యములు చక్కగ చూపుచు;
నాలుగు వరసల్లో జీవిత గారడీ నంతా చెప్పేసారు.అలా వరాల కోసం వెతుక్కుంటూ పోతే అనుకో కుండా అవే ప్రత్యక్షమవుతాయి. వెతకాలనే ఇచ్చ ఉంటే చాలను కుంటాను. అచ్చ తెలుగు లో బాగా వ్రాశారు.
అలతి అలతి పదాలతొ చక్కగా ఉన్నాయి పద్యాలు తమ్ముడు హేట్సాఫ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.