మాన్య మహోదయులారా!
ఇందు మనము చతురంగ అశ్వ పదము చూడ వచ్చును. చదరంగములో అశ్వము నడకవెంట నడచి చూచినచో కోరుకొనిన పదములు భావ యుక్తముగా వచ్చుట మనము గమనింప వచ్చును.చదరంగమున నుండు అరువది నాలుగు గడులలో అరువది నాలుగు అక్షరముల కందమిమిడియుండును.పరికించి చూడుడు.
సుగుణ తతిని వలదనక నొ
సగుచును; ధర గనును సమరస హరి కృప నొగిన్.
తగ కని ఫలము కవితను చొ
రగ; రహి; జయమమర;కవన రమనిడునతడున్.
భావము:-
సమతా భావ సంపన్నుడైన ఆ శ్రీహరి వద్దని చెప్ప కుండా మనకుకృపతో క్రమముగా సుగుణ తతిని సంప్రాప్తింపఁ జేయుచు భూమిపై చూస్తూ ఉంటాఁడు. తగిన విధముగా చూచి; ఆ సత్ఫలితము మనకు కవితలో చొరఁబడు విధముగా చేసి; గొప్పతనము; విజయము మనకు అమరు విధముగా అతఁడు కవిత్వము అనెడి లక్ష్మిని ఇస్తాఁడు..
సు గు ణ త తి ని వ ల
ద న క నొ స గు చు ను;
ధ ర గ ను ను స మ ర
స హ రి కృ ప నొ గి న్.
త గ క ని ఫ ల ము క
వి త ను చొ ర గ; ర హి;
జ య మ మ ర క వ న
ర మ ని డు న త డు న్.
నరహరి - కనుమయ - వరముల - నొసగుచు. అనే దైవ ప్రార్థన ఇందు అశ్వ గమనంలో మనకు గోచరిస్తోంది కదండీ! మీరూ ప్రయత్నిస్తారనే ఆశతో నేనీ పద్యము వ్రాసితిని. మీ అభిప్రాయమును తెలుప గలరు.
జైహింద్. Print this post
5 comments:
చింతా రామకృష్ణారావు గారూ,
మీ చ"తురంగ" గతి బంధ కందం చూసాను. క్లిష్టమైన రచన. సమర్థవంతంగా పూర్తి చేసారు. మీ ప్రతిభకు నంస్కృతులు. అయితే నాకు రెండు సందేహా లున్నాయి. ఈ బంధాన్ని కందం లోనే వ్రాయాలా? వేరొక ఛందంలో వ్రాయ వచ్చునా? ఛందశ్శాస్త్రంలో "గిన్, డున్" అనేవి ఏకాక్షరాలు కదా. మీరు వాటిని విడగొట్టి వేరు వేరు గడుల్లో వేసారు. అలా చేయవచ్చునా? నా సందేహాలను తీరిస్తే నేనూ ప్రయత్నిస్తాను.
అహా. ఎంత మనోల్లాసకరంగా ఉందండి! మొదట చదవగానే సర్వలఘుకందంలో 62 అక్షరాలే ఉండాలి కదా అనిపించింది. చిత్రం చూసిన తర్వాత అర్థమయింది.
సర్వలఘు ఆటవెలది అయితే (64 అక్షరాలు) ఖచ్చితంగా ఈ బంధానికి సరిగ్గా సరిపోతుందేమో?
శంకరయ్య గారూ! మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.
ఇక ఈ బంధాన్ని తేటగీతిలో కూడా వ్రాయవచ్చును.
కందంలో లెక్క వేసుకుంటే అరవైరెండు అక్షరాలే అత్యధికంగా వస్తాయి. ఐతే
అరువదినాలుగు లఘువులకు సమానం మాత్రమే తప్ప మించవు.. అందుకని తుదినుండ
వలసిన గురువు కొఱకు పొల్లక్షరం కూడా ఉచితమే.
కావున దానితో సరిచేయవచ్చును.
ఇక గీతపద్యంలో నింపితే పసేముంటుంది? కందంలో ఐతే రంజుగా సాగుతుందని
నాకనిపించిందండి.
తప్పక మీరూ ప్రయత్నించండి.
శుభమస్తు.
చిరంజీవీ!రవీ!నీకు ఈ ప్రక్రియ నచ్చినందుకు సంతోషం.
కందంలో అరవై రెండు అక్షరాలికే అవకాశముంది. ఐతే తక్కువలో తక్కువగా వచ్చేవి
అరవైనాలుగు లఘువులుగా గుర్తించి; అరువదినాలుగు గడులలో నింపే మార్గంలో
నేను యత్నించాను.
నీవు చెప్పినట్టు తీతంలో నింపుతే యింపేముంటుంది? దానికి ప్రాసనియమం
ఉండదు. దానికి తోడు ప్రాస యతినైనా వాడే వెసులుబాటుంటుంది కదా! అదే
కందమైతే దానిపట్టు దనికుంది. అందుకనే కందంలో ఆ విధంగా వ్రాసను.
నూవూ చక్కగా వ్రాసే యత్నం చేసి నాకానందం కలిగిస్తావని ఆశిస్తున్నాను.
మహా సముద్రము వంటి మన ఛందస్సు నుంచి చక్కని ఆణిమ్ముత్యాలను అందిస్తున్న చింతా వారు బహు ప్రశంస నీయులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.