గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జూన్ 2010, శనివారం

కవిత్వమున వ్రాయ కూడని దశ దోషములు. వివరణ.

దశ దోషములు
1.ఛందో భంగము:-
గురువుండ వలసిన చోట లఘువు; లఘువుండ వలసిన చోట గురువు ప్రయోగించిన ఛందో భంగము అను దోషమగును.
గోవింద యనవలసిన చోట ముకుంద యనిన ఛందోభంగము అను దోషమగును.
2.యతి భంగము:-
యతి ఉండవలసిన చోట కాక మరియొక చోట పాటింప బడనిచో యతి భంగము అను దోషము.
ఆంధ్ర ప్రజల సాటి అరయ లేరు. అన వలసిన చోట ఆంధ్ర ప్రజల సాటిని అరయముగ!
3.విసంధికము:-
సమాస గతములగు పదముల మధ్య సంధి చేయనిచో విసంధికము అను దోషము.
అమృతోదధిశయనఅనిఉండవలసిన చోట అమృత ఉదధి శయన అని వ్రాసినచో విసంధికము అను దోషము.
4.పునరుక్తి దోషము:-
ఇది రెండు విధమ్లు.శబ్ద పునరుక్తి; అర్థ పునరుక్తి.
తొలుతపలికిన శబ్దమునే మరల పలికిన శబ్ద పునరుక్తి.
కాంతి చంద్రుడతడు కళలు జిందెడి శశి. అనినచో శబ్ద పునరుక్తి దోషము.
పూర్వోక్తమగు అర్థమే పునరుక్తమైన అర్థ పునరుక్తి దోషమగును.
కాంతినమృత చంద్రుడని యశో మృగాంకుడనినచో అర్థ పునరుక్తి దోషమగును.
5.సంశయము:-
పద్యమున భావము నిస్సంశయముగా నుండునట్లు వ్రాయబడ వలెను. ఆ విధముగ కాక భావము సంశయాస్పదమైనచో అది సంశయమను దోషము.
అతని కలయిక వలన కదా ఇంతపట్టు జరిగినది? జరిగినది లాభమా? నష్టమా? సంసేహముగానున్నందున సంశయము అను దోషమిందుకలుగు చున్నది.
6.అపక్రమము:-
క్రమాలంకారము ఉండవలసిన చోట అపక్రమముగనున్న అపక్రమ దోషమనబడును.
విష్ణువు హృదయము నాభికమలము పాదము గంగ లక్ష్మి బ్రహ్మల నివాస స్థానములు. ఇందు క్రమ విరుద్ధముగ నున్నందున అపక్రమ దోషము కలిగినది.
7.న్యకుమ:-
మొదట పలికిన పదముల కనుగుణము కాని వ్యర్థ పద ప్రయోగము చేసిచో న్యకుమ లేదా వ్యర్థము అను దోషము .
నీవు త్యాగివి. నాలుగు కాసులెవ్వరికీ ఈయవు. ఇందు త్యాగికి  సరిపడు గునమునకు విరుద్ధముగ పిసినారి యనుపద ప్రయోగము వలన పరస్పర విరుద్ధమైనందున వ్యర్థము అను దోష భూయిష్టము.
8.అపార్థము:-
వాక్యమునందలి పదములకన్యోన్యాకాంక్ష యుండ వలెను. అట్లు లేకపోయినచో సముదాయార్థము స్ఫురింపనందున అపార్థముఅను దోషమగును.
కరిచర్మము గైరిక శిల సురగిరి అని వ్రాసినచో పరస్పరాన్వయము లేనందున అపార్థమను దోషమిందు కలుగు చున్నది.
9.అప శబ్దము:-
౧.కుసంధి; ౨.దుస్సంధి; ౩.చుట్టుంబ్రావ; ౪.వైరి వర్గము; ౫.నిడుదలకాకుదోషము; ౬.కుఱుచ కాకు; ౭.తెలుగునకు జొరని సంస్కృత క్రియల దుష్ప్రయోగములు; ౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడిన అప శబ్ద దోషమనఁబడును.
౧.కుసంధి:- దీని+ఒడయడు=దీని యొడయడుసాధువు. దీనొడయడు అసాధువు.  
౨.దుస్సంధి:- అతడు+అతడు=అతడునతడు. సాధువు. అతడున్నతడు.
౩.చుట్టుంబ్రావ:- అసలారు వందలకు వడ్డీ మూడు వందలు బలాత్కారముగ లాగుకొని జీవించువాడు ఇదిగో వచ్చు చున్నాడు. అని ఈ విధముగా చెప్పభడినచో చుట్టుంబ్రావ యను దోషము.
 ౪.వైరి వర్గము:- సంస్కృత పదమును తత్సమము చేసి తెలుగు పదముతో సమసింప జేయుట సరి అయిన పద్ధతి. అట్లు గాక పూర్వ పదమున కాంధ్ర విభక్తి చిహ్నము చేర్చక సంస్కృత ప్రాతిపదికమునకే తెలుగు పదము చేర్చి సమాసము చేసినచో వైరివర్గము అను దోషమగును. పుష్ప విల్లు. వైరి వర్గము.
ముజ్జగములు. ముల్లోకములు మున్నగునవి నిర్దోషములు. వాటిపై మరల ముజ్జగద్వంద్యుఁడు; ముల్లోక పూజ్యుఁడు అని యుండిన వైరివర్గమున చేరును.
౫.నిడుదలకాకుదోషము:- హ్రస్వముండవలసిన చోట దీర్ఘముంచినచో అది నిడుదల కాకు దోషమగును.
ఉllపొగడ దండలు అను చోట పొగాడ దండలు అని ప్రయోగించరాదు.
౬.కుఱుచ కాకు:- దీర్ఘములుంచ వలసిన చోట హ్రస్వముంచిట.
ఉllనాయెడన్ కు బదులు నయెడన్ అనిప్రయోగింపరాదు.
౭.(తెలుగునకు జొరని సంస్కృత క్రియల) దుష్ప్రయోగములు:- సంస్కృత విభక్త్యంత పదములను తెలుగు విభక్త్యంత పదములతోఁ గలిపి ప్రయోగించుట.
సత్వరము నృపస్య పదం గత్వాయాతఁడు నిహత్యకంటకుల సఖీ భూత్వా మెలగెడు. అని ప్రయోగింపరాదు.
౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడుట:- గ్రామీణుల వాడుక భాషను ప్రయోగింపరాదు.
10.విరోధములు:- 
౧.సమయ విరోధము. ౨.ఆగమ విరోధము. ౩.లోక విరోధము. ౪. కాల విరోధము. ౫.కళా విరోధము. ౬.దేశ విరోధము అని ఆరు విధములు.
౧.సమయ విరోధము:- ఆచార విరుద్ధము సమయ విరుద్ధమని గ్రహింప వలెను. బాహువుల యందు కుండలములు ధరించినాఁడు అని వ్రాసిన సమయ విరోధముగా గ్రహింపదగును.
౨.ఆగమ విరోధము:- అనగా శాస్త్ర విరోధము. 
ఉllహింసా పరమో ధర్మః అనిన అది ఆగమ విరోధముగా గ్రహింపనగును.
౩.లోక విరోధము:- లౌకికమునకు విరోధముగ వ్రాసిన దోషము.
ఉllతనయునకు పాద సేవను తల్లి చేసె. అనిన దోషము.
౪. కాల విరోధము:- దేశ కాలాను గుణముగా వ్రాయ వలసినదిగా నియమముండగా తద్విరుద్ధముగా వ్రాసినచో దోషమగును.
ఉll.సుగుణాకర పట్ట పగలు చుక్కలు పొడిచెన్.
౫.కళా విరోధము:- ఏయే కళలకు తగిన పరికరముల నాయా కళలందు చెప్ప బడుటకు బదులు తద్విరుద్ధముగా చెప్పుట.
ఉllతాళము బట్టక చదువును, పుస్తకము పట్టక పాడు ఘనుడీతడు. అనిన దోషమే కదా!
౬.దేశ విరోధము:- ప్రదేశమును బట్టి కాక తద్విరుద్ధముగా చెప్పిన దోషము.
ఉllఎడారిలో నూతులనుండి నీరు పొంగి ప్రవహించు చున్నదని చెప్పినచో దోషము. 
జైహింద్. Print this post

6 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మాస్టారు గారు,
అప శబ్దము విభాగములో వైరి వర్గము గురించి మరి కొంత వివరించవలసినదిగ నా మనవి.
1. పుష్ప శబ్దాన్ని తత్సమము చేసిన "పుష్పము" అగును కదా. దానిని "విల్లు"తో సమసింప చేస్తే పుంప్వాదేశ సంధి జరిగి "పుష్పపు విల్లు" అగును కదా. ఇది ఎలా వైరి వర్గమగును?
2. ముజ్జగములు. ముల్లోకములు నిర్దోషములనుట చేత, ముజ్జగద్వంద్యుఁడు; ముల్లోక పూజ్యుఁడు వైరివర్గము అనుట చేత, తత్సమముగా స్వేకరించిన సిద్ధ సమాసములను పొడిగిస్తూ మిశ్రమ సమాసములు చేయ కూడదని అర్థమయినది. నేను అర్థము చేసుకున్నది సరైనదేనా? తెలపగలరు.

ఊకదంపుడు చెప్పారు...

ఆర్యా!
మీ బ్లాగు నాకు అంతర్జాల పాఠశాల వంటిది.

అడిగిన తడవున దెలిపిరి
తడబడు సమయముననాకు దన్నుగ నిలువన్;
బడియగును నాకు మీపుట.
ఇడెదెనుదక్షిణగ కందమిమ్ముగ గొనుడీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! చాలా సంతోషం.

మాకందముమీ కందము.
నాకందగ జేసినారు నయ వర్తనులై.
లోకేశుఁడుసత్ కృపతో
మీ కాయువు నొసగి గాచు. మేలుగ చూచున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్! సత్యనారాయణ గారూ!
అనంతుని ఛందో దర్పణమున చతుర్థాశ్వాసమున 22 వపద్యం వ్రాస్తున్నాను చూడండి.
ఆ.వె.
తుదలు తెలుఁగుఁ జేసి యదికి పుష్పపు విల్లు
పరగ భూరుహపుఁ బండ్లు నాక
పుష్పవిల్లు నాఁగ భూరుహ పండ్లునా
వైరి వర్గమండ్రు వనజ నాభ!

పుష్పపు విల్లు భూరుహపుఁ బండ్లు అనునవి సత్ ప్రయోగములే.
పుష్ప విల్లు; భూరుహపండ్లు వైరి వర్గమగును.
రెండవది మీరూహించినట్టే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆశీర్వదించి
కవిత్వములొ రాయగూడని దోషములను చక్కగా వివరించి చెప్పినందుకు ధన్య వాదములు. ఇలా కొంతైన నేర్చుకో గలుగుతున్నందుకు సంతోషం గా ఉంది. అభినందనలు తమ్ముడు

రవి చెప్పారు...

బావున్నాయండి. ఈ అధ్యాయం కూడా బాగా అభ్యసించవలసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.