గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2010, మంగళవారం

బంధ కవిత్వములో ఒక ప్రక్రియ " ఛురికా బంధము "


సద్గుణ సంపన్న సన్మిత్రులా! సాహితీ జగత్సంచారులారా!
ఆంధ్ర భాషలో ఛందో బద్ధ కవిత్వము చేయుట ఒక అపురూప ప్రక్రియ కాగా ;అందు బంధ కవిత్వము అపురూప ప్రక్రియ. 
ఈ బంధ కవిత్వమున ఛురికా బంధము అను ప్రక్రియ సుకవి పండిత మనోహరమై యొప్పు పద్ధతి అనుటలో ఏమాత్రమూ సందేహము లేదు. మహాకవులు చేసిన ఈ ప్రయోగమును నాబోటి అల్పుఁడు చేయఁ బూనుట సాహసమే ఔతుంది.  ఐనా ఉత్సాహాన్ని అణచుకో లేక ఈ ఛురికాబంధంలో ఒక కందపద్యాన్ని వ్రాసాను.
సదసద్వివేక సంపన్న పాఠకులు మీరు. గుణ గ్రహణ గుణాన్వితులు మీరు. నా రచనను పరిశీలించి గుణసంపన్నము చేయుట కొఱకు; నిర్దోషత కొఱకు తగిన సూచనలు కలవేని సూచింప మనవి చేయు చున్నాను. ఇక అవలోకించండి. 
రామ. సుమ సమ. మనోరమ
నా మది మహనీయ తేజ! నా దైవతమా!
మా మక సుగుణాకరమా!
నామ దివిజ గణ సుపూజ్య.  నా ప్రియ ధనమా!  

    సు           నా    మా!    ర  క  ణా గు  సు క       మ
రామనోర మ హ నీ  య  తే     జ!   నా    దై వ త   మా!
    స             దివిజ గణ సు పూజ్య !  నా ప్రియ  ధ  న


భావము:-
ఓ రామా! సుమ(పూల వలె) సుకుమారుఁడా!  మహనీయమైన  మనస్సును రమింపఁ జేయు తేజస్సు తో నా మనస్సున ఒప్పు వాఁడా! ( రమయతీతి రామా ) ఓ నా దేవుఁడా! నాయొక్క మంచి గుణములకు స్థాన మైన వాఁడా! దేవతా గణము చేత మంచిగా  పూజింపఁబడు పేరు కలవాఁడా! నా యొక్క ప్రియమైన ధనమైనవాఁడా!
చూచారు కదండీ! 
జైహింద్.
Print this post

19 comments:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఆర్యా!

ఛురికా బంధము కంద పద్యమే వ్రాయవలెనా లేక ఏ వృత్తమో, ఇతర పద్య విశేషంలోనో ఛురిక ఆకారంలో వ్రాయ వచ్చునా? వాటి విశేషాలను తెలుపవలసింది. బంధ కవిత్వానికి గల ప్రయోజనము, ప్రాముఖ్యతలను వివరించగలరు.

భవదీయుడు

ఫణి

rākeśvara చెప్పారు...

ఛురికా యనగానేమి?
ఈ బంధమున ఇతర వృత్తాలు, పద్యవిశేషములను ఇమడ్చవచ్చున?
విధేయుఁడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందాల రాముని చక్కని చిత్రము తో " చురికా బంధము " హృదయంగమముగా ఉంది. చిన్ననాడు చదివిన ఛందస్సుని మళ్ళీ చదవ గలుగుతున్నందుకు వయస్సు కొన్ని ఏళ్ళు వెనక్కి వెడుతోంది.చదివింప జేస్తున్న చింతా వారు అభినందనీయులు అలాగె " చక్ర బంధము , నాగ బంధము " అన్ని వ్రాస్తె ఇంకా బోలెడు సంతోషం

రవి చెప్పారు...

గురువు గారు, నా వంతు కిట్టింపు.

ఖరకరచర సితనారీ
స్ఫురతాధర సుమపరాగశోణాభూరీ!
స్వరధురధర హితకారీ
పేరణిధని,సుమప రాగవీణాధారీ!

(ఈ ఛురికలో మీరు వ్రాసిన ఛురికలోలా, పిడి మధ్యభాగం లేదు.అలాగే ఈ పద్యంలో - గోమూత్రిక, ఛురిక, శంఖ బంధాలు మూడిటిని ఇమిడ్చాను.)

ఖరకరచర = ఖరకరుడు - సూర్యుడు, ఖరకరచర - సూర్యునివలె చరించు,
సితనారీ = సర్వశుక్ల యగు వనితా (సరస్వతి)
స్ఫురతాధర = తళతళమను మెఱయు అధరము(స్ఫురదధర శీధవే అని జయదేవుడు. స్ఫురతాధర తప్పుకాదనుకుంటాను)

స్వరధురధర = స్వరములభారము మోయునది
పేరిణిధని = నాట్యశాస్త్రమను ధనమునకు నెలవు.

@ఫణిగారు, @రాకేశ్ : ఛురిక అనగా బాకు.ఈ బంధాన్ని ఉత్సాహ, కందములలో సాధారణంగా వ్రాస్తారని నాకు తెలిసిన సమాచారం.మరిన్ని వివరాలు గురువుగారు చెప్పాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఫణి ప్రసన్నకుమారా! శుభమస్తు.
ఛురికాబంధము కందానికే వర్తిస్తుందనే నియమం లేదు.మీరడిగిన మిగిలిన విషయములు మరొక పర్యాయము ఒక ప్రత్యేకాంశంగా గ్రహించి తప్పక వ్రాయగలవాఁడను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాకేశ్వరా!
కత్తి ఆకారములో(చుర కత్తి=ఛురిక)పద్యంను నిర్మిస్తే ఛురికా బంధం అంటారు. మీ మేధస్సుతో అట్టి ప్రయోగాలు కూడా చేయవచ్చును. కూడదనే నియమం లేదు.ఇక ప్రాముఖ్యత అంటారా - అది వ్రాయడంలో గల ప్రత్యేకశ్రద్ధను బట్టే చెప్ప వచ్చు దానిలో ప్రత్యేకత ఉందని.

ప్రణీత స్వాతి చెప్పారు...

గురువుగారూ..
బొమ్మలో(ఛురికా బంధం) కింద గడులలో "ది.వి.జ.మ.నో.జ్ఞ.పూ.జ్య" అని వుంది కదా..మరి పద్యం చివరి పాదంలో "దివిజ గణ సుపూజ్య " అని పూరించారు కదా..

తేడా వివరించరా..ప్లీజ్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రణీత స్వాతీ!
బొమ్మలో(ఛురికా బంధం) కింద గడులలో "ది.వి.జ.మ.నో.జ్ఞ.పూ.జ్య" అని వుంది కదూ?..మరి పద్యం చివరి పాదంలో "దివిజ గణ సుపూజ్య " అని పూరించారు కదా? అని అనుకొంటున్నావామ్మా!
దివిజగణ సుపూజ్య సరైనది.
కత్తి ఆకరంగల బొమ్మలో వ్రాసిన చిన్న ముక్క సరిచెయ్యడం నాకు చేతకాలేదు. త్వరలో సరి చేస్తాను.

రవి చెప్పారు...

ఖరకరచర సితనారీ!
స్ఫురతాధరసుమపరాగశోణా భూరీ!
స్వరధురధర హితకారీ!
బెరయున్ ధర,సుమప రాగవీణాధారీ!

నాలుగవ పాదం కాస్త మార్చాను.(బెరయున్ ధర = ఇలను సర్వాంతర్యామిగ వ్యాపించినయట్టి)

ఊకదంపుడు చెప్పారు...

కవివరులు దూసిన కత్తులన్నమాట - బావున్నాయి - కంది శంకరయ్య గారు కూడా ప్రచురించారు యొకటి. ఇద్దరు తెలుగు అధ్యాపకులూ పద్యమాలక్ష్మికి రోజూ పారాణి దిద్దుతున్నారు. మమ్మల్ని ధన్యుల్ని జేస్తున్నారు.
భవదీయుడు
ఊకదంపుడు

ప్రణీత స్వాతి చెప్పారు...

ధన్యవాదాలు గురువుగారూ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్య! మీరిస్తున్న ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. తప్పక మీరు చెప్పిన బంధ కవిత త్వరలో ఆ జగన్మాత నాచే వ్రాయిస్తుందని ఆశిస్తున్నాను.
నమస్తే.ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! ఊకదంపుఁడు గారూ! మాఉత్సాహ ప్ఊరిత రచనలకు మీ ప్రోత్సాహమే జీవగఱ్ఱ.
ధన్యవాదాలు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మీరు వ్రాసిన పద్యము, రవి గారి పద్యము చూసాక, ఛురికా బంధమని దీనిని ఎందుకు అన్నారో తెలుస్తోంది. రెందు పద్యాలూ దూసిన కత్తుల వలె ధ్వనిస్తున్నాయి. బంధ కవిత్వంలో ఆకారానికి, శబ్ధ సౌందర్యానికి అవినాభావ సంబంధం ఉన్నట్లు తోస్తోంది.
భవదీయుడు
ఫణి

Sanath Sripathi చెప్పారు...

రవిగారూ మీరు వ్రాసిన పద్యం లో గోమూత్రిక, ఛురిక, శంఖ బంధాలు మూడిటిని ఇమిడ్చాను అన్నారు. గోమూత్రిక, చురిక అర్ధం అయ్యాయి. శంఖ బంధం ఎలా అయ్యిందో చెప్పగలరా? ఒక ఉ.స (ఉచిత సలహా). మీరు మీ బంధాలు మీ బ్లాగులో గానీ లేక చింతావారికి వేగు ద్వారా గానీ పంపితే వారు ఈ టపాలో సమకూర్చగలరేమో అప్పుడు సరిగా అర్ధం ఔతుంది కదా.. ;)

రవి చెప్పారు...

@సనత్ గారు, అమ్మవారి (సరస్వతి) మీద బంధకవిత్వాలు ప్రయత్నిస్తున్నాను. (ప్రయత్నిస్తున్నాను = కిట్టించుచున్నాను). అయితే మన ప్రతిభ మీకు తెలిసిందే కదా. :-) అందుకనే గురువుల సహకారం కోసం ఆంధ్రామృతంలో ఆయన అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నంతో ఇక్కడ ఈ తప్పటడుగులు.

వీలుచూసుకుని నా బ్లాగు (ఇంద్రధనుస్సులో) గోమూత్రిక, ఛురిక, శంఖం, స్వరిత డిండిమము బొమ్మలతో సహా ప్రచురిస్తాను.

లంకా రవీంద్ర చెప్పారు...

బంధ బుధ విధ విశారద!
సుందర దరహాసితాస్య! సుగుణాంబునిధీ!
ధీ,దమ,శమ గుణశరధీ!
సుందర కవనారవింద ఛురికాకంధీ!
మీ పద్యం చదివి ఉండబట్టలేక వ్రాసానంతే! కాని, మీతో పోటీగామాత్రం కాదు. తప్పులుంటే దిద్దగలరు.

భవదీయుడు,
రవీంద్ర.

రవీంద్ర చెప్పారు...

కం:-
బంధబుధవిధ విశారద!
సుందర దరహాసితాస్య! సుగుణాంబునిధీ!
ధీ, దమ, శమ గుణశరధీ!
సుందర కవనారవింద ఛురికాకంధీ!

మీ పద్యం చదివి ఉండబట్టలేక వ్రాసానంతే! కాని, మీతో పోటీగామాత్రం కాదు. తప్పులుంటే దిద్దగలరు

రవి చెప్పారు...

@రవీంద్ర గారు: నేనూ ఔత్సాహిక కవినేనండి. నాతో పోటీపడవచ్చు. :-)

మీ పద్యం విషమాలంకారంలో బావుంది. (విషమాలంకారం ఎందుకంటే, ఆ గుణాలేవీ నాకు నప్పవు. :-))

ఇక దోషం: మీ పద్యంలో మూడవపాదం మొదటిగణం పూర్ణానుస్వరంతో వచ్చేట్టు సరిదిద్దాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.