గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2010, బుధవారం

కుమార సంభవంలోని గోమూత్రికా బంధ పద్యము.


నన్నెచోడుడు ఒక గొప్ప ప్రాచీన కవి. అతడు కుమార సంభవం అనే తెలుగు పద్య కావ్యం వ్రాసాడు. అందులో అనేకమైన చిత్ర, బంధ కవిత్వాలు కలవు.
ఇతడు గోమూత్రికా చక్ర బంధాలతో కూడా పద్యాలను వ్రాసినాడు. గోమూత్రికా బంధ పద్యములో ఒకటి విడిచి మరొక అక్షరము మొదటి రెండు, చివరి రెండు పాదాలకు సమానముగా ఉంటుంది.
ఈ క్రింది కంద పద్యమున ఒకటవ; మూడవ పాదములందు; రెండవ; నాల్గవ పాదములందు సరి సంఖ్యాక్షరాలు సమానంగా ఉంటాయి. అది మీరు గమనించ వచ్చు.
కం.స్థితి శు    సి మూర్తీ!   వ సుర   దనుదురిధి సుకీర్తీ!
    హ  దతి శుయు మూర్తీ! స్మ పుర  నుభి దురిసుకీర్తీ!

....(10.85)
స్థి   మ    శు    సి     మూ     వ    సు   వ    ద      జ      రి    వ    ధి      కీ
   ర    తి      భ      త       ర్తీ!     ర     ర    ర     ను    దు   త    న    సు      ర్తీ!
హ   ద     శు   యు   మూ   స్మ   పు   హ    త      భి     రి    జ    న      కీ
భావము:- స్థిరమతీ, శుభమైన తెల్లని ఆకారముగలవాడా, సురాసురుల పాపసముద్రాన్ని ఇంకింప జేయువాడా, పాపాలను హరించే మంగళకరమయిన ఆకారము గలవాడా, మన్మథుని, త్రిపురాలను భేదించిన వజ్రాయుధమువంటి దేహముగలవాడా అని ఈశ్వరుని సంబోధిస్తున్నాడు కవి ఈ పద్యములో.
ఒక అక్షరంనుండి తరువాత ఉండ వలసిన అక్షరాన్ని కలుపుతూ అన్నీ అలా కలిపి చూడండి. వచ్చే డిజైన్ నుబట్టి గోమూత్రికా బంధంగా మన కర్థమౌతుంది.

నేను వ్రాసిన పద్యమును ; మన(భా)రవి వ్రాసిన పద్యమును; వ్యాఖ్యానములలో చూడవలసినదిగా మనవి.
మీరూ ప్రయత్నిస్తే అద్భుతంగా ఇలాంటి ప్రయోగం చేసి వ్రాసి ఆంధ్రామృతానికి  పంపగలరు. ప్రయత్నించండి మరి.
జైహింద్.
Print this post

12 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది అలాగె " చురికా బంధము నాగ బంధము " ఇలాంటి చ్చందస్సులు నాకెంతొ ఇష్టం " కవి గారు " " అవి కుడా " రాస్తె చందస్సుకి మరింత అందం నేర్చు కోగలిగినవారందరికి ఎంతొ బోలెడు ఆనందం శభాష్ తమ్ముడు మార్వలెస్

A K Sastry చెప్పారు...

చాలా బాగుంది.

మరిన్ని అందించండి!

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ, 1969 లో కళాశాల విద్యార్థిగా నేను "వరద శతకం" రాసాను. అందులో గర్భకవిత్వంతో పాటు చురికాబంధంలో ఒక పద్యం రాసాను. ఆ వ్రాత ప్రతి ఎక్కడో పోయింది. గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నాను. అన్నట్టు .. నా బ్లాగును "శంకరాభరణం" పేరుతో పునఃప్రారంభించాను. మీ ప్రోత్సాహం కావాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సాహితీప్రియా! శంకరయ్యా!
మీరు చిఱుత ప్రాయమునుండీకూడా పద్య రచనా వ్యాసంగము కలిగి యున్న విషయం తెలిసి నేను చాలా ఆనందం కలిగింది. చాలా చాలా సంతోషం.
తప్పక మీ రచనలు గుర్తుకుతెచ్చుకొని నాకూ వ్తెలుసుకొనే అవకాశం కల్పించండి.
తప్పక అంతర్గతంగా ఉన్న మీ కవితా ఝరిని వెలువడే విధంగా కృషి చేసి తద్వారా సమాజ శ్రేయము కూర్చే విధంగా ఉపయోగించ వచ్చు. ఇక మీ బ్లాగు శంకరాభరణం నిరంతరం నిరంతరాయంగా సాహితీప్రియులు ఆస్వాదించే విధంగా అలుపనేది ఎఱుగక ఆలాపన చేయడం ప్రారంభించండి. విజయోస్తు.

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ, ధన్యవాదాలు.

రవి చెప్పారు...

శారదా దేవి పదార్చితంగా, నా చిన్ని ప్రయత్నం.

స్వరచణ శతధృతనారీ!
స్ఫురితాధరసుమకదంబశోణా వాణీ!
స్వరగుణజిత స్మితధారీ!
విరికంధర,క్షమసుదండివీణాపాణీ!

స్వరములయందు జ్ఞానియగు బ్రహ్మాసతీ! వెలుగులు చిందుచూ, కడిమిపువ్వు వలె ఎర్రనైన పెదవి కలిగినదియును అయిన వాణీ, స్వర స్వభావములను జయించిన నగవులదానా, కుసుమమువంటి గళసీమ గలిగినదానా, (పలికించుటకు)సమర్థమైన అతి గొప్పవీణను చేత ధరించినదానా!

రెండవపాదంలో స,శ లకు యతి కుదరదని మీరు ఇదివరకు చెప్పినట్టు గుర్తు. అయితే నాకు ఇంతకంటే సాధ్యం కావడం లేదు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

స్వర చణశత ధృతనారీ! స్ఫురితా ధరసుమ క దంబ శోణా వాణీ!
స్వరగుణజిత స్మితధారీ! విరికంధర,క్షమ సుదండి వీణా పాణీ!
ధరసుమ క దంబ(ధ సు క బ)లే రావాలి.
ధర,క్షమ సుదండి(ధ క్ష సు డి) వచ్చాయి.
చిరంజీవీ! నేను చాలా గర్వపడే విధంగా నీప్రయత్నం కొనసాగించి దాదాపు కృతకృత్యుఁడవైనావు. ఐతే ఒక్క మూడు అక్షరాలు మాత్రం చిన్న తడబాటువలన మరల సరి చేసి పంప వలసి ఉంది. నిన్ను మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. చివరలోని ఆ మూడక్షరాలనూ సరి చేసి అంప గలవని నా ఆశ.

కంది శంకరయ్య చెప్పారు...

రవి గారూ, పద్యం అద్భుతంగా ఉంది. శ,స లకు యతి కుదరదని రామకృష్ణారావు గారు చెప్పే అవకాశం లేదు. మీరు పొరబడి ఉంటారు. మూడవ పాదం "స్వరగుణజితస్మితధారీ" లో జితస్మిత అన్న చోట త గురువు అవుతుంది. దాని వల్ల గణదోషం సంభవించింది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పాఠకులారా!
గోమూత్రికా బంధంతో కందం వ్రాద్దామనే నా తపనతో వ్రాసిన ఈ క్రింది పద్యం ఎలాగోలాగ కిట్టించాను. గమనించండి.
క:-
గురువర! చరణము యమునిని
దరికిని చొరగను వలవదు.దయ నను నిలుపున్.
జరుపర! ధరణి ముదమున;ని
జరిపుని హరణను. కల మృదు చయమును గొలుపన్!
భావము:-
గురుదేవా! మీ పాదములు యమునినైనాసరే సమీపింపనీయవు. కలిగి యున్న మృదులమైన సమస్తమును నాకు కలుగ చేయుటకై ఈ భూమిపై నిజ శత్రు వినాశనమును జరుపుము.

రవి చెప్పారు...

౧.
స్వరచణ శతధృతినారీ!
స్ఫురితాధరసుమసురాగశోణా వాణీ!
స్వరగుణజిత మతితారీ!
బిరికీధర,సుధసురాగవీణాపాణీ!

అధరసుమ సురాగశోణా - అధరమనే సుమము బాగుగా ఎఱ్ఱగా రంగుఁదేలినది
మతితారి - బుద్ధులను ఆడించే సూత్రధారి
సుధసు రాగ - సుధలను చిందు మంచిరాగములతోఁ గూడిన
౨.
సురగణనుత సితనారీ!
స్ఫురితాధరసుమపరాగశోణా వాణీ!
స్వరగుణజిత,హితకారీ!
బిరికీధర,సురప రాగవీణాపాణీ!

సుమ పరాగ – సుమముల పుప్పొడి వలె
సురప రాగ - అమృతపు రాగములతో
బిరికీ - మెడపై ధరించే ఓ భూషణము

రవి చెప్పారు...

మీ పద్యంలో

దరికిని
చొరగను
వలవదు
నిలుపున్
జరుపర
ముదమున
గొలుపన్

7 పదాలు (గణాలు) తెలుగులో ఉన్నవి. అంటే దాదాపు సగభాగం. మీరు పరిచయంచేసిన పద్యంలో (నన్నెచోడుడు) దాదాపు అంతా సంస్కృతమే. బంధకవిత్వంలో ఎక్కువగా సంస్కృతమే ఉంటుందని ఈ వ్యాస రచయితా అంటున్నారు. ఆ రకంగా మీ రచన ఒక కొత్త ఒరవడి.మీరు ఇలాంటివి ఇంకా మరిన్ని పద్యాలు వ్రాస్తే, మిమ్మల్ని అనుకరించే ప్రయత్నం మా వంటి అనేకులు చేయగలరు.

ఇంకో విషయం గమనించాను. నన్నెచోడుడి పద్యం వర్ణనా ప్రధానం అయితే, మీ కవిత భావప్రధానంగా ఉన్నది.

ఇంకా ఓ చిన్న పరిశీలన మీ ముందుంచుతున్నాను. మీరు ఎన్నుకున్న సర్వలఘుకందం ఉద్దేశ్యపూర్వకం కాకపోతే, కొన్ని గణాలు కుదిస్తే, బంధకవిత్వం అందగిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రక్రియలో శబ్దసౌందర్యం భావసౌందర్యంకన్నా ప్రధానంగా ఉన్నది కాబట్టి. శబ్ద సౌందర్యం తక్కువ శబ్దాలతో మరింత రాణిస్తుందేమో, అనుకుంటున్నాను. నేను ఓ అక్షరం తగ్గించాను.గమనించండి. (ఓ సారి రెండు పద్యాలూ చదివితే శబ్ద సౌందర్యం ఇనుమడించిందేమో అనిపిస్తుంది గమనించగలరు)

గురువర! చరణము యమునిని
దరికిని చొరగను వలవదు.దయ నను నిలుపున్.
జరుపర! ధరణి ముదమున;ని
జరిపుని హరణను. కల మృదు చయమును గొలుపన్!

గురువర! చరణము యమునిం
దరికిని చొరగను వలవదు.దయ నను నిలుపున్.
జరుపర! ధరణి ముదమునన్;
స్వరిపుని హరణను. కల మృదు చయమును గొలుపన్!

ఇది నా ఊహ, పైత్యం మాత్రమే. :-). చదివి నవ్వుకోగలరు. :-)

రవి చెప్పారు...

ఇందాక వ్యాఖ్యలో లంకె ఇది.

http://www.eemaata.com/em/printerfriendly/?id=819

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.