గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2009, బుధవారం

న గాయత్ర్యాః పరం మంత్రం

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLmqzcdDHN6EjgNEoMl3Ru5gvLWgO8dyocmhewDKtOYCgUmm-q0f0FgUsDDEf1BaKDv1N9-4XG6vFTHeCAmbsf11NAutCbUmjlBSa6yTM651biCrIk-PomAJiY7W8p4isaKRkVb1MCEwc/s400/Gayatri+Devi.jpg
న గాయత్ర్యాః పరంమంత్రం అనే విషయం తెలిసిన వారం కాబట్టే మనం ఆ మంత్రాన్ని నిత్యం యాంత్రిక పరికరాల ద్వారా వింటూ వుంటాం.

ఐతే వేద విదులు ఈ మంత్రంలో దేవతామూర్తుల బీజాక్షరాలున్నాయనీ, ఆయా దేవతా మూర్తులు ధ్యానం చేయబడతారనీ, ఉదాత్త అనుదాత్త స్వరాలను భంగం వాటిల్ల కుండా చదవడం వలన ప్రయోజనం చేకూర గలదనీ చెప్పడం మనకు తెలుసు. ఐతే ఆ స్వరాలు మనం గురు ముఖతః మాత్రమే నేర్వ గలమనీ వారి నుడి.

కొందరైతే అర్థ రహితంగా చదివే దేదైనా సరే వ్యర్థమే అంటారు. అలాగని మనం అర్థ సంగ్రహం చేద్దామంటే చాలా కష్ట సాధ్యమైన పని అనడంలో సందేహం లేదు. తెలుసుకొనినా అభ్యాసం చేసేటంతటి తీరిక మనకెక్కడిది?

అది దృష్టిలో పెట్టుకొని, నాకర్థమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ గాయత్రీ మహా మంత్రమును, దానిలోని అర్థాన్ని తనలో ఇముడ్చుకొన్న శ్లోకాన్ని, తేట తేట తెలుగులో అందరికీ పఠన యోగ్యమయే విధంగా నిత్య పారాయణకు అనుకూలంగా పద్యంగా వ్రాసి, భావాన్ని పొందు పరచుచున్నాను.

విజ్ఞులు గుణగ్రహణ పారీణులు అయినట్టి మీరు గుణములను గ్రహించడంతో పాటు దోష కలుషితమైన అంశ మనిపించిన విషయాన్ని ఇందు గమనించినట్లయితే తప్పక సరిజేయ , తెలియ జేయ మనవి.

గాయత్రీ మంత్రము:-
ఓం, భూర్భువస్సువః , తత్ సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. ఓం.

శ్లోకము:-
ఓం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః .
ప్రేరయేత్ తస్య యత్ భర్గ తద్ వరేణ్య ముపాస్మహే.

ఆ.వె.:-
ప్రణవ మంత్రముగను, వర "భూః - భువః - సువః"
వ్యాహృతులుగ నున్న భవ్యుడెవడు
మనకు బుద్ధి ప్రేరణను జేయు, సకలంబు
సృష్టి జేయు నట్టి , శ్రేష్ఠమైన,
దైవ దివ్య దీప్త తత్వ స్వరూపమున్
ధ్యాన మొనర జేయుదము సతంబు.

భావము:-
ప్రణవ మంత్రము గాను, " భూః - భువః - సువః "అనే వ్యాహృతులు గాను, ఉంటున్న ఏ దైవము మన బుద్ధిని ప్రేరేపిస్తాడో, సకలాన్ని సృష్టించే వాడైన ఆ దైవము యొక్క ప్రశస్తమైన జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.

ఈ నా సాహసాన్ని మన్నించి, గుణ గ్రహణ చేయ మనవి. ఇది సామాజిక ప్రయోజన కరంగా వుంటే ధన్యుడను.
జైహింద్.
Print this post

4 comments:

రవి చెప్పారు...

ఉదాత్త, అనుదాత్త, స్వరితాలను కాస్త వివరించగలరా? నా వద్ద సంస్కృతంలో కొన్ని చర్చలు ఉన్నాయి వీటి మీద. అయితే అర్థం కావడం లేదు.

Sanath Sripathi చెప్పారు...

రామకృష్ణ గారూ, 'వరేణ్యం ' అన్న భావం రాలేదేమో అనిపిస్తోంది. గమనించగలరు. ఎవరైతే మా బుధ్ధులను ప్రచోదనము చేస్తున్నాడో అట్టి సవితృ మండలాంతర్వర్తి అయిన భర్గోదేవుణ్ణి "వరేణ్యం"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతిగారికి వందనములు. ధన్యోస్మి. మీసూచన చూచాను. నా అబిప్రాయం విన్నవిస్తున్నాను.

" వరేణ్యం, = ప్రశస్తమైన,
భర్గః = జ్యోతిర్మయ రూపాన్ని,
ధీమహి = ధ్యానిద్దాం.
అని శ్రీ స్వామీ జ్ఞానానంద " స స్వర వేద మంత్రములు " అనే గ్రంథంలో ఇచ్చిన వివరణ ననుసరించి వ్రాసితిని.
మీరు సూచించినట్లు " వరేణ్యం = శ్రేష్ఠుడైన " కంటే " శ్రేష్ఠమైన " అనే పదం ప్రయోగించడం యోగ్యంగా ఉంటుంది.

ఆ.వె.:-
ప్రణవ మంత్రముగను, వర "భూః - భువః - సువః"
వ్యాహృతులుగ నున్న భవ్యుడెవడు
మనకు బుద్ధి ప్రేరణను జేయు, సకలంబు
సృష్టి జేయు, నట్టి శ్రేష్ఠుడైన {శ్రేష్ఠమైన}
దైవ దివ్య దీప్త తత్వ స్వరూపమున్
ధ్యాన మొనర జేయుదము సుబుద్ధి{ సతంబు }.

మీ అమూల్యమైన సూచనలు బంగారాన్ని మేలిమి బంగారంగా మార్చగలవు. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవితేజా!
ఉదాత్త అనుదాత్త స్వరితములను గూర్చి వివరించ మాన్నారు.
వేద పఠనము చేసే సమయంలో అచ్చట ఉన్న అక్షరాలను మామూలుగా చదవడం కాకుండా స్వర యుతంగా చదవాలనే నిర్దేశంతో స్వర సంజ్ఞలను కూడా అక్షరాలకు పై స్తాయిలో పలక వలసిన వాటికి మనం గమనిస్తున్న ఒకటి సంజ్ఞగాను, అదే దీర్ఘ స్థాయిలో పలుక వలసిన వాటికి పద్కొండు సంజ్ఞగను, దిగువ స్థాయిలో పలుక వలసిన అక్షరమ్ క్రింద అడ్డు గీత తోను సూచించడమ్ మనం చూస్తుంటాం.పై స్థాయిలొ పలకడాన్ని ఉదాత్తమనీ దిగువ స్థాయిలో పలుకుటను అనుదాత్తమనీ మనం గ్రహించ వలసి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.