తనను పెండ్లియాడి అయోధ్యకు వచ్చినప్పటి తొలినాటి సీతయొక్క గుణ గణాలను స్మరిస్తున్నాడు శ్రీరాముడు.
క:-
తెలిసిన వయసున నన్నున్
గొలుచుట యబ్రమ్ము గాదు క్షోణీ సుతకున్.
తెలియని వయసున నన్నున్
కొలిచిన యది సర్వ దైవ కూటమ్ము వలెన్. { వి.రా.క.వృ.కి.నూ. ౨౬ }
తెలిసిన వయసులో నన్ను సేవించుటలో ఆశ్చర్య మేమున్నది? తెలియని వయసున అనగా బాల్యము నందే నన్ను సీత సకల దైవములను నాలోనే దర్శించి నట్లు సేవించినది.
కాపురమునకు వచ్చినప్పటి సీత ఇంకా బాల్యావస్థలో నున్నది. భార్యకు భర్త అనగా ఎట్టివాడో, ఎట్టి వానిగా సృతులు చెప్పుచున్నవో తెలియదు. కానీ ఆ చిన్న తనపు దినములలోనే ఆమె రాముని సకల దేవత స్వరూపునిగ భావించినది. సేవించినది. ఇప్పుడు సీతా ఆదర్శమునందు రామునకు ఆయా స్మృతులు హృదయమునందు కదిలి వేదన కలిగించు చున్నవి.
ఉ:-
భార్యకు నంచు ప్రా చదువు బాటల నేమి గుణాళి యున్నదో?
భార్యకు ధారుణీ సుతకు బంధురమా గుణ పాళి యున్నదీ
అర్యమ వంశ నూత్న వధు వామెకు నాకు వియోగ కల్పనా
ధుర్యము దైవమే గుణము తోచని యంధముగా కనంబడున్. { వి.రా.క.వృ.కి.నూ. ౨౭ }
భార్య ఎట్లుండ వలెనని వేదమార్గములందు చెప్ప బడినదో నా సీతకు ఆ సుగుణము లన్నియు ఉన్నవి. సూర్య వంశమునకు కోడలుగా వచ్చిన ఆమెకు, నాకు, ఈ విధమైన ఎడబాటు కల్గుటకు ఏ కారణమూ కనబడదు. దైవము గ్రుడ్డిదేమో బహుశ!
ఆశ్రమములలో గృహస్థాశ్రమము గొప్పదని వేదము కీర్తించినది. భార్యకు సహ ధర్మ చరి, సహ ధర్మ చారిణి యని పేర్లు. అందుకే ఆమె ద్వితీయ అని పేరు పొందినది. పురుషుని యజ్ఞాధికార ఫలమున ఆమెకు రెండవ స్థానము. పురుషుడు ఆమెకు పుత్ర రూపమున జన్మించును. కనుక ఆమె జాయా అని పిలువ బడినది. సకల లోక ప్రస్తరణకు మూల కందము గృహస్థశ్రమము కాగా ఆ ఆశ్రమమునకు ఆలవాలము స్త్రీ - గృహిణి. భార్యా విహీనునకు యజ్ఞాధికారము లేదనగా ఆమె ప్రాముఖ్యతను ఎంతని చెప్ప నగును!
భర్త కష్టమును తన కష్టముగా - ఆయన సంతోషమును తన సంతోషముగా భావించుచు, పతిదూరస్థుడైనచో అలంకారములు విసర్జించుచు, భర్త మరణించగా తానును ప్రాణములు వీడునది పతివ్రత అని శాస్త్ర వచనము.
{ ఆర్తార్తే ముదితే హృష్టా - ప్రోషితే మలినాకృశా - మృతే మ్రియేత యేనారీ - సా స్త్రీ జ్ఞేయా పతివ్రతా. }
ఇప్పటికీ మన వారు సంకల్పము చెప్పుకొను నప్పుడు " ధర్మ పత్నీ సమేతస్య " అని చెప్పుకొనుచునే యున్నారు కదా!
పెండ్లి నాడు తన కూతురును రామునికి అప్పగించుచు " ఇయం సీతా మమ సుతా - సహ ధర్మ చారీ తవ - ప్రతీచ్ఛచైనాం భద్రంతే. - పాణిం గృహ్ణీష్వ పాణినా " అన్న జనక మహర్షి నీకు నా కుమార్తె యైన సీత సహ ధర్మ చారియై యుండగలదు అనినాడు. శ్రీరాముడు పితృ వాక్య పరి పాలకుడై వన వాసమునకు ఏగునప్పుడు సీత తానును భోగ భాగ్యములను తృణీకరించి, ‘ వన వాసి ’ ఐనది. అద్వైతం సుఖ దుఃఖయోః. అన్నట్లు చరించినది.
సీత గుణ బంధురత ఆమె వియోగమున శ్రీరామునకు దుఃఖ హేతు వగు చున్నది.
వివాహము ఒక ఒప్పందముగా కాక పవిత్ర బంధముగా చూడ వలెను. భర్తచే భార్య బానిసగా కాక స్నేహితురాలిగా ఆధ్యాత్మిక భాగ స్వామిగా చూడబడుతుంది. అని ఐతరేయ బ్రాహ్మణము పేర్కొంది. " స్త్రీ లక్ష్మీ దేవికి ప్రతీక " అని శతపథ బ్రాహ్మణము చెప్పినది.
" సుఖా సప్త పదీ భవ సఖ్యంతే గమేయం
సఖ్యంతే మా యేషాః సఖ్యంతే మా యోష్ఠ్యాః. "
{ఓ కన్యకా! నీవు నాతో అన్ని కర్మల్లో సమానాధికారం పొందుతూ, నాతో ఏడడుగులూ నడచి రా! నేను కూడా నీ సఖ్యాన్ని పొందుతాను. మనమిద్దరం ఒకరి స్నేహాన్ని మరొకరు విడువ కుండా పరమానురాగంతో మెలగుదాం. } అని ఛాంద్యోగ బ్రాహ్మణం దాంపత్యము నందు స్త్రీ పాత్రను శ్లాఘించు చున్నది.
ఋగ్వేదము నందలి దశమ మండలమున స్త్రీ తన అత్తవారింట ఎట్లు నడచుకొన వలెనో వివరింప బడినది.
" ప్రా చదువు బాటల - " అంటే వేద మార్గముల యందు అని అర్థం. అనగా వేద ధర్మోచితంగా ప్రవర్తించిన సీతకు ఇట్టి కష్టములు {అపహరణము} సంభవించి నందుకు రాముడు విధిని పై పద్యమున నిందించినాడు.
రాముని కిం కర్తవ్యతా మూఢతను విశ్వనాధ ఈ విధముగా నిరూపించు చున్నాడు. కవిత్వమున అవస్థా నిరూపణము అనునది వర్ణనలో ఒక శిల్పము. విశ్వనాధ మహా శిల్ప వేత్త అని మనకు అర్థమవక మానదు.
చూచాం కదండి. సమయం కుదిరినప్పుడు మరొక పద్యం తెలుసుకొందాం.
జైహింద్.
4 comments:
అద్భుతంగా వున్నది వివరణ .
ఆర్యా చిన్న విన్నపము.
మీప్రాంతము లో సన్యాసి అను పేరుగల మాహత్ములొకరు పలు లోకోపకార్యములను చెసెనని విన్నాము. ఆయనగూర్చి పూర్తి సమాచారము కావాలి అందించగలరా .
ఆర్యా! దుర్గేశ్వరా! సుమనర్నమస్సులు.
క:-
సన్యాసులు పెక్కుండ్రిట
ధన్యాత్ములు. సేవచేయు తన్మయులగుచున్
ధన్యాత్మా తెలుపుడు ఆ
సన్యాసి వసించు నెచట? సరగున చెపుడీ.
చాలా బాగుంది మీ ఆంధ్రామృతం! ధన్యవాదాలు.
ఆర్యా! శ్రీ చిట్టా ప్రసాదు సాహితీ ప్రియా! ఆంధ్రామృతాన్ని గ్రోలి ఆనందిస్తున్న మీకు అభినందన పూర్వక ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.