గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2009, గురువారం

చక్కని మన యింట శ్రావణ మహా లక్ష్మి.

చ:-

ముసిరిన కర్మదుష్ఫలము పూజలుచేయఁగ బుద్ధిఁ బాపగా,
కసురుకొనేటి కర్మమును కాంచుటకైనను లేకఁ జేయు నా
బిసరుహనేత్ర లక్ష్మి సుమపేశలమానస, కొల్చు వారికిన్.
పసుపునుకుంకుమన్ పరమభక్తినొసంగుడు పేరటాండ్రకున్.

ఉ:-

శ్రావణమాసమందు సువిశాలహృదంతరవాసి యౌచు పల్

ధీవరులింటనిల్చు"సిరి" తృప్తిగ సంపద లందఁ జేయుచున్.
సేవలు చేసి యామె కృప చేకొనుడందరు. స్త్రీ జనంబులన్
యా వరలక్ష్మిగా తలచి యాదరమొప్పగఁ గొల్చుటొప్పెడిన్.

శా:-

అమ్మా!శ్రీహరి రాణి!నీదు కృపతో అష్టస్వరూపాత్మవై
నెమ్మిన్ మా గృహమందు నుండ తగునో యమ్మా! కృపాంభోనిధీ!
మమ్మున్ గావగ నెవ్వరమ్మ కలుగున్ మాయమ్మనీకన్న?నిన్
సమ్మాన్యంబుగ నందరందు కనుటన్ సత్ కృత్యమున్ గొల్పుమా!


జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.