గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2009, బుధవారం

చెప్పుకోడి చూద్దాం 12.

సమాధానం కనుక్కోండి చూద్దాం.
స్త్రీలు తమ భర్త పేరు నుచ్చరించరాదని ఒక లతాంగి తన భర్త పేరు చెప్పిన తీరు చూడండి.

చ:-
సరసిజ నేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న, యా
పరమ పతివ్రతా మణియు భావమునన్ ఘనమైన సిగ్గునన్
కరియును - రక్కసుండు - హరు కార్ముకమున్ - శర - మద్దమున్ - శుకం
బరయగ వీని లోని నడి యక్కరముల్ గణుతింప పేరగున్.

సమాధానము:- BLOCKED.

కరియు ---------= ద్విరద
రక్కసుండు------ = అఘుడు.
హరు కార్ముకమున్ = పినాకి.
శరము----------= సాయక.
అద్దమున్ -------=ముకురం.
శుకంబు ---------= చిలుక
జైహింద్.
Print this post

4 comments:

జ్యోతి చెప్పారు...

భర్త పేరు అడిగితే ఆ పత్రివ్రత సిగ్గుతో ఇలా చమత్కారంగా చెప్పింది..

కరి (ఏనుగు), రక్కసుడు, హరకార్ముకమున్ (శివధనుస్సు), శరం (బాణం), అద్దం, శుకం (చిలుక) వీటి నడుమ అక్షరాలు కలిపితే నా భర్త పేరు వస్తుంది అంటుంది. అది " రఘునాయకులు " కదా..

అంటే ..
(కరి) ద్వి ర దం - ర
(రాక్షసుదు) అ ఘు డు - ఘు
(హరకార్ముకం) పి నా కం - నా
(శరం) సా య కం - య
(అద్దం) ము కు రం - కు
(శుకం) చి లు క -లు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

గీ:-
సాహితీ జ్ఞాన ముప్పొంగు సరస మతిరొ!
చక్కగా నిది పఠియించి ఠక్కుమని జ
వాబు వ్రాయగా నేర్చిన వనిత మణిరొ!
ధన్య వాదము జ్యోతి! విద్యా ప్రదీప్తి!

జ్యోతి చెప్పారు...

అపారమైన తెలివితేటలుండి, పైకి అమాయకంగా ఉండే ఓ ఇల్లాలిని ఆమె భర్త పేరడిగితే ఏకంగా సవాలు విసిరింది..

విపులాక్షి ! "నీ విభు పేరేమి?" యన్నను
చాతుర్య మెసగ నా నాతిబలికె
నక్రంబు హేమంబు నగధాము పుప్పొడి
యబ్బురం బేనుగు యాజి పడవ
అన్నిటి మూడేసి అక్షరంబులు గల
మారు నామంబుల తీరు జూచి
నాధు పేరునకును నడిమ వర్ణంబులు
సరియని జెపితి నెరిగి కొనుము
యుచు నానాతి బల్కె, తా నతిశయముగ
ఇట్టి నామంబు గలవాడే యీతడనుచు
వంచనలులేక బుధులెరింగించిరేని
వారికే నాచరించెద వందనములు.

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???

mmkodihalli చెప్పారు...

అచ్చంగా ఇలాంటి సమస్యనొకదానిని నా బ్లాగులో చాలా కాలం క్రితం ఉంచాను.కానీ ఇంతవరకూ సమాధానం తెలియలేదు. మీ టపాకు జ్యోతి గారి సమాధానం మరియు వారిచ్చిన మరొక సమస్య చదివాక మళ్లీ ఆ పొడుపుకథకు చెందిన లింకును ఇస్తున్నాను.

http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.