గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 53.

శ్లోll
ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్. 70( నేపల చరిత్రమ్ )
తే.గీ.ll
దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.  
భావము:-
అచంచలమైన ఈశ్వర విశ్వాసము కలిగి యుండుట; తన జీవితమును దేశ హితార్థమైయే గడుపుచుండుట; లోకమందరి యెడలను బంధు సమాన దృష్టి కలిగి యుండుట; ఇవన్నీ సత్పురుషులైనవారికి కర్తవ్యములు.
ఈ క్రింది శ్లోకాదులు మేలిమి బంగారం మన సంస్కృతి 50 లో వ్రాసినదే పునరుక్తమైనది. 

మనం మన సమాజంలో జరుగుతున్న అనైతిక లజాబాహ్య ప్రవృత్తులకు చాలా చింతిస్తున్నామే కాని వాటికి గల మూలాలు తెలుసుకో లేకపోవడమే కాక విరుగుడు కూడా కనుగొనాలనే ఆలోచన కూడా చేయ లేకపోతున్నాం.
నిజానికి జన్మతః మానవుడు స్వేత పత్రం లాంటివాడనడంలో సందేహం లేదుకదా! ఐతే ఎదిగే కొద్దీ పుట్టుకతో సంక్రమించిన లక్షణాలు బైట పడుతున్నకొద్దీ మంచి వాడిగానో చెడ్డ వాడిగానో గుర్తింప బడుతుంటాడు.
భగవంతుడు జీవులన్నింటికంటే కూడా మానవునకు ఒక ప్రత్యేకమైన మేధాశక్తిని సమకూర్చాడు. దాని ద్వారా మనవుడు తన నైజాన్ని కప్పి పుచ్చుకోవడం కాని, తనలో లేని గుణాల్ని అలవరచు కోవడం గాని చేస్తూ సమాజంలో మంచి వాడిగానో చెడ్డ వాడిగానో జీవనం సాగిస్తుంటాడు.
మానవుని వ్యక్తిత్వ వికాసానికి అతని కుటుంబము, అతడు నివసించే పరిసరములు, అతడు అభ్యసించే విద్య, అతనితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు, అతనికి బోధించే బోధకులు, ముఖ్యముగా అతని తల్లిదండ్రులు తమ ప్రభావం చూపడం మనకు తెలియ కుండానే జరిగిపోతుంటుంది.
చిఱుత ప్రయం నుంచీ కూడా సద్గుణ సౌశీల్యాలు కలిగించ గలిగే వాతావరణంలో పెరిగిన వ్యక్తి సద్గుణుడై యుండడం మనకు అనుభవైక వేద్యం. ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డలు చెడిపోవాలనే కోరికతో ఉండరు. ఐతే బిడ్డలు మంచిగా పెరిగేలా చేయడంలో వారి కర్తవ్యం మాత్రం అనేక కారణాలవల్ల నిర్వర్తించ లేకపోతున్నారనే మనం అనుకో వలసి ఉంటుంది.
ఇక సామాజికులైతే అనేక కారణాల వల్ల చెడు వర్తనుల్ని చూస్తూ కూడా పెదవి విప్పి యదార్థం చెప్పడానికి
సాహసం చేయ లేకపోతున్నారు భారతంలో భీష్ముడులాగా.
భగవద్గీతలో ఒక చక్కని అనుసరణీయమైన శ్లోకముంది. చూద్దాం.
శ్లో:-
యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. {అ. 3. శ్లో.21. }
తే:-
శ్రేష్ఠులెయ్యవి చేయునో శ్రేష్ఠమనుచు
జనులు చేసెదరయ్యవి సరస మతిని.
శ్రేష్ఠులెద్దాని నిల్పిన చేయు. కాన
శ్రేష్ఠులితరములెన్నడు చేయ రాదు.
భావం:-
లోకంలో శ్రేష్ఠులుగా గుర్తింపబడి గౌరవింప బడుతున్నవారిని జను లనుసరింతురు. వారి ప్రతిపాదనలనే శ్రేష్ఠమైనవిగా భావించి ప్రమాణముగా స్వీకరింతురు. గాన లోకులచే శ్రేష్టులుగా భావింప బడే వారికి సమాజంలో గురుతరమైన బాధ్యత ఉందనడంలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. నిస్వార్థంగా సామాజిక శ్రేయమే లక్ష్యంగా వారి ప్రవర్తనను తీర్చి దిద్దుకొంటూ మార్గ దర్శి కావాలి.
ఇట్టి సామాజిక శ్రేయాన్ని బాధ్యతా యుతంగా నిర్వహించ వలసిన గురుతర బాధ్యత పిల్లలకు చిఱుత ప్రాయం నుండీ బోధన చేసే గురువులకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
నైతిక బోధన నందించదానికి వీలుగా పాఠ్య ప్రణాళికను పకట్బందీగా ప్రభుత్వం నిర్మాణం చేయడంలో నిపుణులైన వారి కప్పగించి, వారిచే సంసిద్ధం చేయించాలి.
ఇందు నిమిత్తం ప్రజాభిప్రాయాన్ని ముందుగ స్వీకరించి పరిశీలించాలి. తరువాత ఏమి చేయవచ్చో మీరే సెలవివ్వండి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.