గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 56.

పంచ మాతలు:-

రాజు భార్య, అన్న భార్య, గురుని భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి, ఈ ఐదుగురినీ పంచ మాతలందురు.

ఈ నాడు సంఘములో వావి వరసలు మృగ్యమై అనేక వైపరీత్యాలు మన కెదురౌతున్నాయంటే కారణం సౌశీల్యాన్ని ప్రసాదించ గలిగే సంస్కార వంతమైన విద్య అందకపోవడమే అనక తప్పదు.

రామాయణంలో మనం సీతాన్వేషణ ఘట్టంలో ఒక చక్కని శ్లోకాన్ని చూస్తాము.

సుగ్రీవుడు తమకు దొరికిన ఆభరణముల మూటను సీతవేమో చూడమని రామునకు చూపగా ఆతనికి సీతా వియోగ దుఃఖము కారణముగా కన్నుల నీరు నిండగా వస్తువుల రూపము స్పష్టము కాకపోవుటచే లక్ష్మణుని ఆ ఆభరనములు సీతవేమో చూడమనెను. అప్పుడు ఆ లక్ష్మణుడు చెప్పిన మాటలు ఆనాటి మానవాళికి గల సభ్యతా సంస్కారములకు అద్దంపడతాయి. చూడండి.

శ్లో:-
నాహం జానామి కేయూరే, నాహం జానమి కుండలే.
నూపురేత్వభి జానామి, నిత్యం పాదాభి వందనాత్!!

తే.గీ:-
ఉండు గావుత కేయూర కుండలములు
తల్లి నాయమ సీతకు. తలప నెఱుగ.
అందెలాతల్లివే. కందు ననవరతము
వందనంబులు చేసెడె వాడనగుట.

భావము:-
అన్నా! ఈ కేయూర కుండలములను నే నెఱుగను. ఈ అందెలు మాత్రము నే నెఱుగుదును. నిత్యమూ నా తల్లి సీతమ్మకు పాదాభి వందనము చేయు సమయమున వీటిని కనెడి వాడను కాన ఇవి సీతమ్మవే అని ఎఱుగుదును.!

చూచారా! ఆనాడు మాతృ సమాన యైన అన్న గారి భార్య అయిన వదిన గారి పాదములు తప్ప మరేమియూ లక్ష్మణునకు తెలియదు. ఎంతటి ఘనతరమైన సంస్కృతి?

ఈ నాడు కనీసం ఆ గ్రంథాలతో మనకు గల పరిచయాన్ని, ఆ గ్రంథాలపై మనకు గల పఠనాసక్తిని, మనకు గల అవగాహననీ పరిశీలించుకొంటే మనం సిగ్గుతో కుంచితులమవ వలసి వస్తుందేమో! మరి నైతిక విలువలు మానవాళిలోవికసించేదెలా? మీరూ ఆలోచించండి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.