గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2009, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 54.

కలి విడంబన శతకంలో ఒక శ్లోకమున్నది. అది చమత్కమో లేక కొందరి విషయంలో నైనా యదార్థమో మీరే ఆలోచించెదరు గాక. ముందు శ్లోకమును, అనువాదమును, భావమును చూడండి.

శ్లో:-
వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా!
యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ!!

ఆ:-
వైద్య రాజ! నీకు వందనంబులు సేతు.
యముని సోదరుండ! అందుకొనుమ!
యముడు ప్రాణముగొను. యమ సోదరుండ! మా
ధనము, ప్రాణములను గొనుదు వీవు.

భావము:-
యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!

పూర్వం ప్రజానీకానికి "వైద్యో నారయణా" అని కీర్తింప బడే విధంగా వైద్యులు తమ వైద్యాన్నందించి ప్రాణాలు కాపాడేవారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనిపిస్తోంది. వైద్యం కోసం రోగి వెళ్ళితే దీనినే అవకాశంగా తీసుకొనే వైద్యులు తద్వారా అత్యవసరం అనుకొని కోదరైతే, అవసరమని కొందరైతే, అనవసరంగా కూడా అక్కలేని వైద్య పరీక్షలతో రోగి జేబు ఖాళీ చేయిస్తున్న వారు కొందరు ఉండడం నీటి డాక్టర్లలో మనం చూస్తుంటాం.

మానవ జన్మ చాలా గొప్పది. అందులోనూ వైద్య శాస్త్రం అధ్యయనం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం. అలా వైద్యులైన వారు చాలా మంది తమ స్వార్థానికి దూరంగా ఉంటూ అత్యవసర వైద్య సేవలో తమ జన్మ ధన్యం చేసుకొనే పుణ్య మూర్తులు సాక్షాత్తు మానవాకృతిలోనుండు మహనీయ పరమాత్మలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయ మనీషులే మానవాళికి ప్రథమ పూజ్యులు.

ఉ:-
వైద్యము నభ్యసించి, తన వారికి కూడ సుదూరమౌచు, " నా
బాధ్యత" వైద్య సేవ యని, భక్తిగ రోగికి సేవ చేయుచున్,
సద్యశ మందుచున్న మిము సర్వ విధంబుల దైవ మెప్పుడున్
హృద్యముగా కనుంగొనుత! సృష్టిని ముఖ్యుడ! వైద్య పుంగవా!!

అని మహాత్ములైన భిషగ్వరులకు పాదాభి వందనం చేస్తున్నాను.

వైద్యాన్ని అసరాగా చేసుకొని, ధన మాన ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు మాత్రం అంతకు అంతా పరిహారం చెల్లింపక తప్పదన్న విషయం మాత్రం యదార్థం. అది దైవ శాసనం.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.