గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2009, బుధవారం

శ్రీ విరోధి నమ సంవత్సర నవ నాయకాది ఫలములు:-

tepuktanganశ్రీకర పాఠక వరులకు
ప్రాకటముగ నీ యుగాది భవ్య ఫలంబుల్
లోకాద్భుతముగనిచ్చును.
మీకిక నే తెలియఁ జేతు మేలును కీళ్ళున్.


శ్రీ విరోధి నమ సంవత్సర నవ నాయకాది ఫలములు:-
1) రాజు శుక్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
శుక్ర రాజ్యాధిపత్యము శుభము మనకు.
వర్షములు పడి నిండుగా పండు భూమి.
పాడి సమృద్ధి కలుగును. పతులు మెచ్చ
సతులు కామోపచారముల్ సలుపు భివిని.

2) మంత్రి చంద్రుడు. దానిఫలము:-
తే.గీ:-
మంత్రి చంద్రుడభ్యుదయంబు మనుజులకును
రాజులకునిచ్చు. వర్షముల్ లక్ష్యమొప్ప
కురియ పంటలు పసువులు ధరను వెలుగు.
యజ్ఞములు బ్రాహ్మణు లుచేయు నద్భుతముగ.

3) సేనాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
చంద్ర సేనాధిపత్యము చక్కనొప్పు.
వెలలు,వర్షములును హెచ్చు నిలను జనులు
రోగ రహితులై సుఖులగు యోగమమరు.
పాడి పంటలతో భువి పరవశించు.

4) సస్యాధిపతి శుక్రుడు. దాను ఫలము:-
తే.గీ:-
పంట కధిపతి శుక్రుడు పరమ శుభుడు.
ధాన్య జాతులు ఫలియించు మాన్యముగను.
తెల్ల భూములు ఫలియించు తృప్తిగాను.
అందరారోగ్య సంపద లందగలరు.

5) ధాన్యాధిపతి బుధుడు. దాని ఫలము:-
తే.గీ:-
బుధుడు ధాన్యాధిపతికాన ముప్పు కలుగు.
మధ్యమమునొప్పు వర్షముం బండ దధిక
పంట. గాలిచే మేఘముల్ పరుగుతీయు .
జనులుదాహార్తి నొందును. గోల పెరుగు.

6) అర్ఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
చంద్రు డర్ఘాధిపతికాన చక్కనైన
వర్షములఁ జేసి బాగుగా పంట పండు.
దేశమభివృద్ధి పొందుచు తేజరిలును.
ధరలు మాత్రము హెచ్చును. తప్పదయ్య!

7) మేఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:-
మేఘముల కధిపతి శశి. మేలు చేయు.
పంటలంతట బాగుగా పండు. నిలను.
పాడి పంటలచే భువి పరవశించు.
ప్రజల యోగము బాగుండు సుజనులార!

8) రసాధిపతి శని. దాని ఫలితము:-
తే.గీ:-
రసముల కధిపతి శని ధరలు తరుగును.
నేయి, నూనె బెల్లము తేనె నేలపైన
వెలలు లేనివగుచు నుండు వింతగాను.
ప్రజల కందుచు, నందక పరుగు పెట్టు.

9) నీరసాధిపతి గురుడు. దాని ఫలము:-
తే.గీ:-
నీరసాధిపు గురుడౌట నియతి నిజము.
వక్కలును రత్నములు పైడి, ప్రత్తి, ధాన్య
ములును, తేనెయు తోళ్ళును, పూలు, మంచి
గంధమిటువంటి వాటికి కలుగు వృద్ధి.
బ్రాహ్మణులు సుఖ జీవులై వరలు భువిని.


ఆఢక ప్రమాణము, ఆఢక స్థితి:-
అష్ఠ యోజన విస్తీర్ణం శత యోజన మున్నతం.
9 భాగములు సముద్రములోను,
9 భాగములు పర్వతముల పైన,
2 భాగములు భూమి పైన వర్షించును.
16 వీసములకు 12 విసముల పంట పండును.

కుంచము 09 - 9 - 2009 వ తేదీ వరకు వృద్ధ వేశ్య చేతి యందుండును - ఆ పిదప - బ్రాహ్మణ బాలుడు చేతి యందుండును. కావున సస్యానుకూల వర్షములు పడును. పంటలు బాగుగా పండును. బ్రాహ్మణ చేతియందలి కుంచము దుర్భిక్షము, సస్య నాశనము కలిగించును.

వాయువు:-
సంవహ అను పేరుగల వాయువు. కావున అల్ప వృష్టి వుండును.

మెరుపు:-
చంచల అనే మెరుపు. కావున సు వృష్టి.

ఉరుము:-
నిర్ఘోష అను పేరుగల గర్జితము. కావున అల్ప వృష్టి.

సముద్రము:-
క్షీర అను పేరుగల సముద్రము. కావున వాయు పీడన ఉన్నప్పటికీ సుభిక్షంగా వుంటుంది.

భూ వాహన శేష ఫలము:-
కర్కోటకుడనే సర్పము భూమిని వహించుచున్నది. దాని వలన వర్షములు తక్కువగా పడును. రాజుకు మరణము సంభవించును.

పశు నాయక ఫలము:-
పశు నాయకుడు - దొడ్డి పెట్టువాడు - విడిపించు వాడు
శ్రీ కృష్ణుడు. అయినందున
పశు వృద్ధిః సుభిక్షంచ బహు సస్యార్ఘ సంపదః
గోష్టే సార్వాధికారీచ శ్రీ కృష్ణః పశ్యాధిపే.

తే.గీ:-
పశువులను పాలనముసేయు వాసుదేవు
డందు వలన వృద్ధి యగును మందలుగను.
దేశము సుభిక్షమై యుండు. దేశమందు
పంటలధికము పండును భవ్యముగను.

బహు క్షీర ప్రదా గావః సర్వ వ్యాధి వివర్జితా.
గోష్టార్బహః సదా నిత్యం శ్రీకృష్ణేన సంరక్షకం.

తే.గీ:-
దొడ్డి పెట్టెడి వాడు మఱి దొడ్డినుండి
విడిచి పెట్టెడి వాడునూ వేణుగోపు
డగుటచే పాలనిచ్చెడు నవని యావు
లరసి చూడ. నిరోగత పెరుగు భువిని.

ఆర్ద్రా ప్రవేశము:-
తే. 21 - 6 - 2009 దీని జ్యేష్ట బహుళ చతుర్దశీ ఆదివారం తె.గం. 3-36. ని.లకు మృగశిర నక్షత్రం, శకుని కరణం, గండ యోగం, వ్షభ లగ్నం, లో అర్ద్రా నక్షత్రం లోకి రవి ప్రవేశించుచున్నందున ధరలు అధికంగా వుంటాయి. గాలుల వలన మేఘాలు తేలిపోవునప్పటికీ సస్యానుకూల వర్షాలు పడును. నీటికి కొరత ఉండదు. గండ యోగం కవున ప్రజలలూ భయాందోళనలు పెరుగుతాయి. వృషభ లగ్నం కావున పసు గణాభివృద్ధి జరుగును.

కర్తరి నిర్ణయము:-
తే. 04 - 5 - 2009 దీ. మద్యాహ్నం గం. 1 - 10ని .ల నుండి దిన కత్తిర్లు.
తే. 11 - 5 - 2009 .దీ నుండి అగ్ని కత్తిర్లు.
తే. 28 - 5 - 2009 ది. సాయంత్రం గం. 06 - 04 ని. వరకు.

మకర సంక్రాంతి:-
తే. 14 - 01 - 2010 దీ.ని సాయంత్రం గం.5 - 33.ని.లకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును.

తిథి:- అమావాస్య. సస్య నాశనం.
పక్షం:- కృష్ణ పక్షం. క్షేమం కలుగును.
గురువారం:- క్షేమం, సుభిక్షం, ఆరోగ్యం.
పేరు:- మంద. విప్రుల కనుకూలం.
సాయంకాలం:- శుభయోగము.
మేష లగ్నం:- ఆనంద దాయకం.
వేపాకునీటి స్నానం:- మహారోగం కలుగును.
వర్ణ వస్త్ర ధారణ:- మహారోగకారి.
పాటలీ పుష్ప ధారణ:- శుభప్రదం.
స్వర్ణభరణ ధారణ;- స్వర్ణమ్ ఖరీదు తగ్గును.
ఖర్జూర ఫల భక్షణం;- ధరలధికం.

గురు మూఢం;-
తే.16 - 12 - 2009 దీ.నుండి తే.06 - 02 - 2010 దీ. వరకు.

శుక్ర మూఢం:-
తే.17 - 02 - 2010 దీ. నుండి తే.17 - 03 - 2010 దీ వరకు.

గ్రహణములు:-
పాక్షిక సూర్య గ్రహణము:-
తే.22 - 7 - 2009 దీ.ని ఉదయం గం.05 - 28 ని. లనుండి గం. 10 - 42 ని. వరకు.

సంపూర్ణ సూర్య గ్రహణము:-
తే.15 - 01 - 2010 దీ. ఉదయం గం.09 - 35 ని.ల నుండి మధ్యాహ్నం గం. 03 - 38 - ని. ల వరకు.

పాక్షిక చంద్ర గ్రహణం:-
తే.31 - 12 - 2009 - దీ
ఇది మన భారత దేశంలో కనబడు.

ఆదాయ - వ్యయములు
మేషం:-
2 - 8
వృషభం:-
11 - 14
మిధునం:-
14 - 11
కర్కాటకం :-
8 - 11
సింహం :-
11 - 5
కన్య :-
14 - 11
తుల :-
11 - 14
వృశ్చికం :-
2 - 8
ధనుస్సు :-
5 - 14
మకరం:-
8 - 8
కుంభం :-
8 - 8
మీనం. :-
5 - 14

రాజ పూజ్య - ఆవమానములు
మేషం:- 1 - 7
వృషభం :-
4 - 7
మిధునం :-
7 - 7
కర్కాటకం :-
3 - 3
సింహం :-
6 - 3
కన్య :-
2 - 6
తుల :-
5 - 6
వృశ్చికం :-
1 - 2
ధనుస్సు :-
4 - 2
మకరం :-
7 - 2
కుంభం :-
3 - 5
మీనం. :-
6 - 5

మొత్తముపై సంవత్సర ఫలం:-
శ్రీ విరోధి నామ సంవత్సరం సుజనుల కవిరోధి. దుష్టులకు విరోధి. పాడి పంటలు బాగున్నప్పటికీ ధర వరలు మాత్రము హెచ్చుగానుండును. ఈశ్వరాభిషేకముము ఈ సంవత్సరం మేలు కూర్చును. దాని వలన గ్రహములు కూడ శాంతించును.

స్వస్తి.
సర్వాణి సన్మంగళాని భవంతు.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.rostepuktangan
Print this post

4 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మురళీ గారు,
మీకు, మీ ఇంటిల్లపాదికీ నూతన వత్స్రర శుభాకాంక్షలు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఆంధ్రామృత వాచస్పతి రామకృష్ణారావు గారూ
మీకు, మీ ఇంటిల్లపాదికీ నూతన వత్స్రర శుభాకాంక్షలు.

పరిమళం చెప్పారు...

ధన్యవాదములండీ ....మీకూ ,మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు .

కొత్త పాళీ చెప్పారు...

కొత్త సంవత్సరానికి గ్రహ ఫలాలు తెలుగు పద్యాల్లో చెప్పడం బహు బాగు రామకృష్ణగారూ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.