శ్రీమద్ విరోధికి స్వాగతం .
రచన:-చింతా రామ కృష్ణా రావు.
TELUGU LECTURER {Rtd}
చోడవరం. విశాఖపట్టణం జిల్లా.
ఉ:-
స్వాగతమమ్మ! సత్కవుల సంగతినీ వవిరోధివమ్మ! నీ
యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ! సద్
యోగమునిమ్మ! దుష్టులకయోగము గొల్పు విరోధివమ్మ! యే
రోగముఁ లేక మాకిల పురోగతి నిమ్మ! విరోధి వర్షమా!
ఉ:-
సద్రచనాభిలాషులగు సజ్జన వర్యుల శత్రు సంహతిన్
రుద్రుని పోలి చీల్చగ విరోధిగ పేరును దాల్చి వచ్చి, మా
భద్రతఁ జూచు నీకు నిట పల్కెద మిమ్ముల స్వాగతమ్ము. సత్
క్షౌద్రము లొల్కుచున్ జనులఁ గౌరవమొప్పఁగఁ గావు మిమ్మహిన్.
మత్త::-
గున్న మామిడి కొమ్మపై నొక కోయిలమ్మ కుహూ కుహూ
యన్న ధ్వానము పెక్కుటిల్లగ దిక్కులన్నియు మారు మ్రో
గ న్నవాబ్దికి సూచకమ్ముగ కమ్మగా పల్ మారు తా
మిన్ను ముట్టగ కూయ సాగెను మేల్తరమ్ముగ, వింటివే?
ఉ:-
ఘుమ్మని షట్పదాళి కడు చోద్యముగా వికసించు పూలపై
కమ్మని తేనె జుఱ్ఱుచును గర్వముతో విహరింపఁ గంటి. లో
కమ్మున మిత్ర వర్గమును కన్నను, మేల్తర కాలమొచ్చినన్,
సొమ్ములు మించి కల్గినను, చోద్యముగా విహరించుచుందురా?
ఉ:-
రార వసంత! నిన్ను కనులార కనుంగొని. నీదు భాగ్య మే
మారసి, నీ కృపామృతము హాయిగ గ్రోలగనిమ్ము. మాకు నీ
చేరిక వాంఛనీయము. సు చేతనతన్ మదిఁ గొల్పు దీవు. నీ
వారలు నీదు రాక కని ప్రార్థన చేయుచు నుండె సిద్దమై.
జైహింద్.
2 comments:
స్వాగత వచనాలతో పాటి, కోకిలమ్మ గానాలను మత్తకోకిలలో పలికించి మాకు కలువపూల మాలలు అందించారు. ఉగాది శుభాకాంక్షలు.
రార వసంత... భలే పద్యమండీ.
'ఝుమ్మని షట్పదాళి కడుచోద్యముగా' అన్న పద్యంలో మీరు చెప్పదలచుకున్నది:
"మిత్రులని చూచినా, లేదా మంచి కాలం ఆసన్నమైనా, లేదా సొమ్ములు లభించినా ఎవరైనా తిరుగుతారా? కానీ ఇక్కడ తుమ్మెదలు వసంతకాలం ఆసన్నమైనపుడు వికసించిన పువ్వులు అనే మిత్రులని చూసి తేనె అనే సొమ్ములు పొంది కూడా గుంపులుగుంపులుగా చోద్యంగా తిరుగుతున్నాయి."
అని నేను అనుకుంటున్నాను. తప్పైతే సరిదిద్దగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.