శ్రీ పుల్లెల శ్యామ్ గారుదండక రచనా విధానము తెలిసినవారిని వివరించమని చక్కని కోరిక కోరారు. అందుకు డా. ఆచార్య ఫణీంద్రగారు కొంత వివరణ నద్భుతంగా యిచ్చారు.
పిదప శ్రీ ముక్కు రాఘవ కిరణ్ కుమార్ దండకములేయే గ్రంథాలలో లభ్యమైనాయో తెలియఁ జేశారు. పుష్యంగారి బలీయమైన వాఛ ఎందరినో మేలుకొలిపింది. వారికి నా అభినందనలు. నేను కూడా దానికి సంబంధించిన నిర్వచనాన్ని తెలుపుతున్నాను.
సీ:-
పుష్యము పేరుతో పుల్లెల శ్యాము తా
దండక నియమము తనకు తెలుప
మనిరి. ఫణీంద్రులు వినిచె దండకము
తగణములకు పైన తగునుగురుడ
నుచు.రాఘవయు తెల్పెను తను లభించిన
లక్ష్యములసదృశ లక్ష్యమొప్ప.
తిమ్మకవియు తాను సమ్మోదమున దీని
లక్షణమునుతెల్పె నక్షయముగ.
గీ:-
దాని వివరింతునేనిట. తప్పులున్న
ఒప్పులనుదెల్పి వివరింపనొప్పు మీకు.
మీరలెఱిగిన లక్ష్యము మీరు తెలిపి
జ్ఞానబోధను చేయుడో జ్ఞానులార.
రాఘవ వివరించిన దండక ఉదాహరణలు:-
౧ మనుచరిత్రలోనూ వసుచరిత్రలోనూ రగడలైతే ఉన్నాయి కానీ దండకాలు సున్నా.
౨ పారిజాతాపహరణంలో రగడలూ ఉన్నాయి, దండకమూ ఉంది. చిత్రగర్భబంధకవిత్వాలూ ఉన్నాయి. కానీ పంచకావ్యాలలో పారిజాతాపహరణాన్ని ఎందుకు చెప్పలేదా అనుకున్నాను. వెంటనే నాకే అనిపించిందండీ... కేవల ఛందస్సే కాదు కదా కావ్యాన్ని నిలబెట్టేదీ అని.
౩ హరవిలాసంలో ఏకంగా రెండు దండకాలు ఉన్నాయి. రగడలు అస్సలు లేవు. పాండురంగమాహాత్మ్యంలో కూడా ఇంతే.
౪ నేను చూసిన వాటిలో దండకాలు ఎక్కువ శాతం రెండు న గణాలతో ప్రారంభమయ్యాయి. అన్నీ గురువుతోనే ముగిసాయి.
౫ యగణాల దండకం నేను చూడలేదు. కానీ ఉండవచ్చునేమో అని ఊహిస్తున్నాను.
ఇక దండక నిర్వచనాన్ని లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారము అనే ఛందశ్శాస్త్రంలో ఎలా వివరించాడో గమనిద్దాం.
దండకము నిర్వచనము:-
అమరంగ సనహంబులందాదిగానొండెఁ, గాదేని నాదిన్ దకారంబుగానొండె, లోనం దకారమ్ములిమ్మై గకారావసానంబుగాఁ జెప్పినన్ దండకం బండ్రు దీనిన్ గవుల్.
ఉదా:-
అమరన్ { స గణము }
గ సన { న }
హంబు { హ }
లందాది { త }
గానొండెఁ,{ త }
గాదేని { త }
నాదిన్ ద { త }
కారంబు { త }
గానొండె { త }
లోనం ద { త }
కారమ్ము { త }
లిమ్మై గ { త ]
కారావ { త }
సానంబు { త }
గాఁ జెప్పి { త ]
నన్ దండ { త }
కం బండ్రు { త ]
దీనిన్ గ { త }
వుల్. { గ }
పైన నిర్వచించిన నిర్వచనమునందే ఉదాహరణ కూడ యిమిడియున్నదికదా! దానినే నేను వివరించాను.
ఆలస్యమెందుకు ఔత్సాహికులు దండక రచనోన్ముఖులు కండి. రచయితల పాఠకుల మనో వాంఛితము సిద్ధించును గాక.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.