గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2009, మంగళవారం

ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ.

ఇది ఏ పద్యమో - ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.

సువినయంబొప్పఁ జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్ రహించు
సుగుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో? యనంగ.
సుమనసుంబెద్దయెసుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌననంగ
సుజనులే మెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్ దలిర్ప.
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? పృథివి నది భరము కాదె?

అని మీముందుంచిన పద్యానికి కొందరు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

ప్రస్తుతం ఈ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పుతున్నాను.
పైది సీస పద్యము.
ఈ సీస పద్యంలో
1) మత్తేభము.
2) కందము.
3) గీతము. అనేవి గర్భితమై ఉన్నాయి.
వాటిని క్రింద విశదపరస్తున్నాను. గమనించండి.
1) :-
వినయంబొప్ప జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్
గుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో?
మనసుం బెద్దయె సుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌన్
జనులేమెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్
2) :-
సురుచిర సుహాసనంబుల
ధరణి పయినతానె గొప్ప ధన్యాత్ముడుగా
నిరతము.మెలుపున దురితము
లరసి మెలగు కరటినరయ నగునే పృథివిన్?
) గీ:-
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? పృథివినది భరము కాదె

ఈ విధంగా చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే,
పైకి మంచిగా కనిపిస్తూ ఎవ్వరికీ అనుమానమైనా రావడానికి వీలు కలిగించని విధంగా వంచన చేసే నయ వంచకుల విషయంలో జాగ్రత్త సుమండీ.


జైహింద్.
Print this post

7 comments:

rākeśvara చెప్పారు...

ఇందుకు పూర్వం మీరు అచ్చం ఇలాంటి విన్యసమే చేసిచూపించారు గనుక, నేను సీసగీతాలలో మత్తేభ కందాలు దాచారని ఊహించాను.
కానీ అప్పటికీ ఇప్పటికీ అదే 'బాబోయ్' అనిపించే అచ్చెరువు. :)

Vasu చెప్పారు...

అమ్మ బాబోయ్. ఇలాటివి ఎలా రాస్తారు మాష్టారు మీరు. భలే బావుంది.

సురేష్ బాబు చెప్పారు...

చాలా బాగుందండీ. పద్య వృత్తాలతో నాకు పెద్దగా పరిచయం లేనందున నేను వ్యాఖ్యానించలేకపోయాను. ఈ పద్యం మీ కృతమేనా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ! నేనే వ్రాశాను.
పయో ముఖ విష కుంభాఅలను చూసి చాలా బాధతో ఒక సభలో నీ పద్యం వ్రాసి, చదివాను.
సభలో స్పందన కూడా బాగానే వచ్చింది. ఆ సరస్వతీ మాత కటాక్షం. అంతే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వాసూ! అభ్యాసం కూసువిద్య, అన్నారు పెద్దలు. ప్రయత్నిస్తే మీరూ సునాయాసంగా వ్రాయఁగలరు. ఇది సత్యం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు రామకృష్ణ గారు.అద్భుతం గా ఉన్నాయి మీ పద్యాలు.మీరు నిజంగా సరస్వతీ పుత్రులు.అదృష్ట వంతులు ఇంకా ఇంకా మీ కలంనుంచి జాలువారాలని కోరుతు.నూతన సంవత్సర శుభా కాంక్షలు

అజ్ఞాత చెప్పారు...

seesamaalika anagaanEmi?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.