గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2009, సోమవారం

మత్తేభ - కంద - గర్భ సీసము {అంశము - వివాహ వ్యవస్థ}

ఆర్యులారా!
నిన్నటి దినమున అంతర్ జాతీయ వివాహితుల దినోత్సవమని తెలిపి " వివాహ వ్యవస్థ " అంశంపై కవులను పద్య రచన చేయమని విశాఖ పట్టణం జిల్లా పద్య కవితా సదస్సు వారు కవుల నాహ్వానించారు.

చోడవరం గ్రామంలో ప్రసన్న భారతి అనే సుప్రసిద్ధ సాహితీ సంస్థ ఆధ్వర్యవంలో సాహితీ గోష్టి నిర్వహించారు.
జిల్లా పద్య కవితా సదస్సు అధ్యక్షులు శ్రీ కె.కోటా రావు అధ్యక్షతలో డా. యెం.వెంకటేశ్వర రావు - కవులచే స్వీయ పద్య పఠనం చేయించారు. కార్యక్రమంలో పాల్గొనిన అనేకమంది కవులతో పాటు నేనుకూడా పాల్గొన్నాను.

నా స్వీయ రచన కూడా అక్కడ వినిపించాను.
సహృదయులైన మీరు ఆ రచన చూచి తగు సూచనలు చేస్తారని, గుణదోషాలు తెలుసుకొని తగిన మార్పులు చేర్పులు చేయడం ద్వారా నా కవితా పాటవాన్ని పెంచుకోవాలనే కుతూహలంతో ఈ రచన మీ ముందుంచుతున్నాను.
శ్రమ అనుకోకుండా తప్పక మీ కామెంట్స్ పంపగలరని ఆశిస్తున్నాను. తప్పైతే మన్నించే మహనీయ మనస్కులు మీరు. కాబట్టే యీ సాహసం చేస్తున్నాను.

ఇక చూడండి నా రచన.
వివాహ వ్యవస్థ అంశముపై నా కవిత:-

మత్తేభ కంద గర్భ సీసము:-
సు మహనీయం బగు సూత్ర బంధ మిది యౌన్ - మాన్యత్వమౌన్, ధామమౌన్, సతంబు
సు మహనీయం బగు శుక్ర సాక్ష్యమిది యౌన్, - మంత్రాత్మికా యుక్తమౌన్, నిజంబు.
సు మహనీయం బగు శోభనీయమిది యౌన్, - మర్యాద యౌన్, మన్ననౌన్, ఘనంబు.
సు వహనీయం బిది, సుందరంపు భవితన్ - వర్ధిల్ల జేయున్ కృపన్. వివాహ

తేటగీతి:-
సు రుచిర విధాన మంతయు - కరి వరదుని
భావ మహిమ కానగ నగు ! భాసుర గతి
పరిణయ విధి చూపరు లెల్ల పరవశ మవ
గ వరలును వసుధన్ కడు గౌరవముగ.

గర్భ మత్తేభము:-
మహనీయం బగు సూత్ర బంధ మిది యౌన్ - మాన్యత్వమౌన్, ధామమౌన్,
మహనీయం బగు శుక్ర సాక్ష్యమిది యౌన్, - మంత్రాత్మికా యుక్తమౌన్,
మహనీయం బగు శోభనీయమిది యౌన్, - మర్యాద యౌన్, మన్ననౌన్,
వహనీయం బిది, సుందరంపు భవితన్ - వర్ధిల్ల జేయున్ కృపన్.

గర్భ కందము:-
సు రుచిర విధాన మంతయు -
కరి వరదుని భావ మహిమ కానగ నగు ! భా
సుర గతి పరిణయ విధి చూ
పరు లెల్ల పరవశ మవగ వరలును వసుధన్.

ఈ సాహితీ కార్యక్రమాంలో భాగంగా శ్రీ వి.అప్పల నరసిమ్హమూర్తి రచించిన " జుత్తాడ స్రీరామచంద్ర శతకము, మనీషా పంచకము " అనేరచనలను శ్రీ కోటారావు, డా.మెరుగుమిల్లి వెంకటేశ్వరరావులు ఆవిష్కరించారు.
పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు చాటు పద్యాలను వివరిస్తూ ప్రసంగించారు.
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ దేవరపల్లి సన్యాసి రవు, శ్రీ పి.వి.రమణమూర్తి, శ్రీ రేపాక కన్నయ్య శెట్టి.డా,రాజశేఖర్మున్నగువారు యీ కార్య క్రమాన్ని చక్కగా నిర్వహించడంలో శ్రమించారు.

ఇంతకీ నా సీసాన్ని మీరాపోసన పట్టే సమర్ధులు. కాబట్టి మరొక్కసారి పైనున్న మత్తేభ - కంద - గర్భిత సీస పద్యాన్ని చదివి మీసూచనలనందించ వలసినదిగా నా విన్నపము.
జైహింద్. Print this post

7 comments:

Sanath Sripathi చెప్పారు...

సాహిత్య, ఛందో వ్యాకరణాల లో ప్రాథమిక విద్యార్థిని.
మత్తేభ కంద గర్భ సీసము, గర్భ మత్తేభము,
గర్భ కందము అంటే ఏమిటో కూడా తెలియజేయగలరు.

-సనత్ కుమార్

rākeśvara చెప్పారు...

చాలా బాగున్నాయి గురువు గారు. ఇలాంటి వ్రాయాలంటే నాలాంటి పామరులకు జన్మలు పట్టేస్తుందేమో :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

1) శ్రీమాన్! ప్రియ సనత్ కుమారా!
తెలియనిది మనకయోమయం. తెలిసింతరువాత చాలా సులభం.
మీరు నేను వ్రాసిన సీస పద్యం చూశారు కదా!అదే పద్యంలో గర్భితంగా " మత్తేభం పద్యం" కూడా వుంటుంది. అలాగే సీసంతో పాటు కలిసేవున్న తేటగీతిని చూస్తే దానిలో " కంద పద్యం " కూడా వుంటుంది. .
అంటే మనం వ్రాసే సీస పద్యంలో సీస పద్యంతో పాటు మధ్యలో వున్న మత్తేభం కూడా లక్షణ సమన్వితమై వుండేలాగ వ్రాసినట్లయితే దానిని మత్తేభ గర్భ సీసం అంటారు. దానితో పాటు కందం కూడా లక్షణ యుక్తంగా వ్రాసి యున్నట్లయితే కంద గర్భం అంటారు.
మీలాంటివారి కోసం ఆ సీసంలోవున్న మత్తేభాన్ని , అలాగే కందాన్ని పైకి లాగి వేరే వ్రాసి చూపించాను.
సీస లక్షణాలతో ఒక పద్యం వ్రాసినపుడు దానిలోనే మత్తేభము - కందము కూడా వచ్చేలా వ్రాయగలగడం సాధన వలన వస్తుంది. మీకు అర్థమయేలాగ చెప్పగలిగాననుకొంటున్నాను. సందేహం తీరకపోతే మళ్ళీ అడగడానికి సంకోచించకండి. నా సెల్ నెంబర్ : - 9247272960. మరి సెలవా?

2) ఆయుష్మాన్! రాకేష్!
నేనూ మీలాగే అనుకొనేవాడినొకప్పుడు. మరిప్పుడు?
అలాగే మీకూను.
ప్రయత్నం చేసి చూడండి. తప్పక సిద్ధిస్తుంది. మనో వాంఛా ఫల సిద్ధి మీకు అగును గాక.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మాస్టారు గారు,
చాలా బాగుంది.

Sanath Sripathi చెప్పారు...

ధన్యవాదాలు మాస్టారూ !
కొత్తగా ఉంది కానీ మత్తు మాత్రం భలే ఉంది.

భవదీయుడు సనత్ కుమార్

అజ్ఞాత చెప్పారు...

:-)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔనండి సనత్ గారూ. ఇది చాలా {గం} మత్తుగానే వుంటుంది.
dhanya vaadamulu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.