గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

తేటగీతుల కవులను తెలుపు చుంటి.

తేట గీతి వ్రాయగలరన్నంతలో నిర్భీతిగా అత్యద్భుతంగా మన బ్లాగు కవులనేకమంది వ్రాసిన పద్యాలను, నా స్పందనను వివరిస్తున్నాను.

నేను వారికి తెలియ జేసిన విధము.
తేటగీతి:-
తేట గీతుల పలికెడి తెలుగు వాడ !
మాట లాడగ నేర్తువు తేట తెలుగు.
తేట గీతిని వ్రాయుట తేలికయ్య.
మాట లాడిన యట్టులె, మరువకయ్య.

సూర్యు డొక డుండు ఆ పైన సురపతి గణ
ములన రెండుండు రెండుండు వెలయు రవిగ
ణములు. పాద పాదమునన్దు నప్పిదముగ.
ఆట వెదిగ యతి ప్రాస లరయ నగును.

కవిపాఠకుల స్పందన:-
1) జిగురు సత్యనారాయణ అన్నారు...
మాస్టారు గారు,
తేట గీతిని గణాల ప్రకారము వ్రాయటమేనా (చెప్పటమేనా)లేక దీనికి ఎమైనా "నడక" ఉన్నదా? తెల్పగలరు.
2) రవి అన్నారు...
మీరే ఓ సమస్యను ఇవ్వకూడదా? ఓ పాదం పూరించమని. నిన్న రాఘవ గారి పాఠం చదివాను (పొద్దులో చెప్పినది). చాలా గహనం గా అనిపించింది. అసలు ఓ సుబ్జెచ్త్ అనుకున్నాక, దానికి సంబంధించిన పదాలు వెతికి పెట్టుకోవాలా? ఎలాగ ఆరంభించాలో అంతుచిక్కలేదు.
మన్నించగలరు. నా అజ్ఞానంతో విసిగిస్తున్నందుకు.

3) ఆత్రేయ అన్నారు...
కం:
మాటలు జెప్పిన రీతిగ
ఆటవెలదిని తెలిపిరిగ ! ఆశను మదిలో
నాటిరి ! పద్యము చెప్పగ
ఆటవెల దిననమ నసురికె ఆగక ఆర్యా

పైన వారి అభిప్రాయాలికి నా స్పందన చూడండి.
1) శ్రీ జిగురు సత్యనారాయణ గారూ! గణములు క్రమ బద్ధంగా వుంటే శబ్దం వినసొంపుగావుంటుంది. ఆ పద్యం శృతి పేయంగా వుండి స్మృతి పథంలో నిలుస్తుంది.
తేటగీతి:-
తేట గీతమాటవెలది దేనికైన
గణములెన్నుచు వ్రాసిన ఘనత గాంచు.
గణములందున నడకుండు. క్రమముతోడ
వ్రాయ నెఱిగిన శబ్దంబు వాసి గాంచు.
2) రవిగారూ!
మీ అభిప్రాయం చాలా బాగుంది. మీలాంటి వారు వ్రాస్తారనుకొంటే తప్పక యివ్వగలను.
కందము:-
తప్పక యిచ్చెద. వ్రాయుడు.
>నిప్పుకుచెదబట్టె నయ్య! నేర్పరి యింట<."
తప్పుగ వ్రాయగ తగదయ.
ఒప్పుగ నది భారతాన యున్నదె చెపుమా!
పై పద్యంలో రెందవ పాదం సమస్యా పూరణ కొఱకు ఇచ్చాను. తప్పక వ్రాసి కామెంట గలరని నా విశ్వాసం.
ధన్య వాదాలు.
3) ఆ{చా}ర్యా!
కందము:-
కందమునాఖరి పాదము
నందున దన మనుట బదులు అందురె? దననన్
చెందుకు గానరు మీరలు?
సుందర సుకుమార హృదయ! శోచించుమయా!

1) ఆత్రేయ అన్నారు...
గురువు గారూ, చివరి పాదములో, "దిననమ" నందు ఒక 'న ' ఎక్కువ ప్రచురించబడింది. తీసి చదువితే సరిపోతుందేమో చూడండి.
కం:
అప్పుగ తెచ్చిన డబ్బుతొ
గొప్పగ వడ్డిని గెలిచిన గోమటి తెలివీ
చెప్పులు కొరకగ కుంటిన
నిప్పుకు చెదబట్టెనయ్య నేర్పరి యింటన్‌

వారి అభిప్రాయానికి నా స్పందన చూడండి.
ఆర్యా! తప్పక సరిపోతుంది. సరిచేసేయండి. నిర్దోష మానందావహము కదా!సత్కవితాభివృద్ధిరస్తు.

2) రవి అన్నారు...
తేటగీతి :-
తేటగీతి యది తెల్గులోనొక తేనె ఊట
జిలుగులొలికెడి ఈ గీత తెలుగు వెలుగు
ఎలమి శ్రీనాథ భట్టులు సలలితముగ
చక్కగానిందు చెప్పిరి చాటువులను.
అబ్బ! నేనూ ఓ తేటగీతి రాసానోచ్! (మాస్తారు, చేతులు తెరిచాను. మీ బెత్తానికి పని చెప్పి, పద్యం సరి చేసే బాధ్యత మీదే. జీవితం లో మొదటి తేటగీతి ఇది నాకు. మేఘాల్లో నడుస్తున్నట్టుంది.)

రవి గారి పద్యానికి నా స్పందన చూడండి.
మైడియర్ { భా } రవీ!
మీ పద్యం అద్భుతం. రెండు, మూడక్షరాలు మాత్రమే తొలగించానంతే. సరిపోయింది. చూడండి.
తేటగీతి :-
తేటగీతియ తెల్గులో తేనె ఊట
జిలుగులొలికెడి ఈ గీత తెలుగు వెలుగు
ఎలమి శ్రీనాథ భట్టులు సలలితముగ
చక్కగానిందు చెప్పిరి చాటువులను.

మీకు నా శుభాశీశ్శులు. నా అభిప్రాయం చూడండి.
కంద గర్భ తేటగీతి:-
రవి కనని దాని నంతయు కవి కననగు.
భాసుర గతి. కావ్యమునను. భారవివలె,
కనగల వికపై సువిధేయ! ఘనతర మవ
గ. గమనమరయుచున్! గీతి సుగమ మీకు.
కందము:-
రవి కనని దాని నంతయు
కవి కననగు. భాసుర గతి. కావ్యమునను. భా
రవివలె, కనగల వికపై
సువిధేయ! ఘనతర మవ గ. గమన మరయుచున్.

అర్థం కాకపోతే అడగండి. సందేహించ వలదని మనవి.

3) రవి అన్నారు...
"తేటగీతియ తెల్గులో తేనె ఊట"
అబ్బ. ఎంత చిన్న పొరబాటు చేసానో మీరు చెప్పిన తర్వాత తెలిసింది. నా నెత్తిన ఓ మొట్టు నేనే మొట్టుకున్నాను. (ఆట వెలది మత్తులో పడి పొరబాటు చేశాను :-)).

4) రవి అన్నారు...
ఇందాక ఓ విషయం చెప్పడం మరిచాను. మీరు చెప్పిన కంద గర్భ తేటగీతి, కందం కేరింతలు కొట్టించేంత చక్కగా ఉన్నాయి. (నన్ను గూర్చి చెప్పినందుకు కాదు) ఓ సంవత్సరం పైన బ్లాగింగు లో ఉన్నా, ఇలాంటి అనుభూతి ఇంతకు మునుపు ఎప్పుడూ లేదు.
ఈ వివరణ నా అనుభూతికి ఛాయామాత్రమే.
కైమోడ్పులు, కృతజ్ఞతాభివందనలు.

వారి మాటలకి నా సమాధానం చూడండి.
రవి ఆనందించడం కంటే కవి కిం కేం కావాలి? సంతోషం.
ధన్య వాదాలు.
కవుల స్పందన - నా ప్రతిస్పందన. చూచారు కదా! మరొక పర్యాయం మరొక విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయ గలనని విన్నవించుకొంటున్నాను.
జై హింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.