గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2009, సోమవారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా 5

సాహితీ బంధువులారా! మీ యుత్సాహానికి తగినంత వేగంగా మీరు పూరించడానికి సమస్యలను మీ ముందుంచలేక పోవడానికనేక కారణలు. క్షంతవ్యుడను.

ఈ పర్యాయం మనం పూరించ వలసిన సమస్య గమనించండి.

--------> మంద బుద్ధికి ప్రాప్తించు మన్నన లిల <---------

చూచారుకదా ! ఆలస్యమెందుకు? వెంటనే పూరించి కామెంట్ ద్వారా పంపగలందులకు మనవి.
జైహింద్. Print this post

10 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఆచార్యుల వారికి నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు.

హరి చెప్పారు...

ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు తెలియ జేయ గలరు.

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
పదిలొ తప్పిన స్నేహితుడు మంత్రి ఆయె
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిల

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హరీ! దీర్ఘాయుష్మాన్ భవ.
అద్భుతంగా వుంది మీ భావన.
పద్యం నడక బాగుంది.
మూడవ పాదం చిన్న మార్పుచేస్తే లక్షణ యుక్తంగా వుంటుంది.
పదిలొ తప్పిన స్నేహితుడు మంత్రి ఆయె అని వ్రాసేరు కదా?
దానిని
మంద మతి నాదు సఖుడు తా మంత్రి ఆయె.
అని పూరిస్తే ఇంకా బాగుంటుంది.

ఏదైనా సరే మొదటి ప్రయత్నంలోనే అద్భుత భావావిష్కరణ చేసిన మీకు అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బ్లాగర్ Hari Dornala అన్నారు...

ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు తెలియ జేయ గలరు.

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
బ్లాగర్ Hari Dornala అన్నారు...

ఇది నా మొదటి ప్రయత్నం. .{ ౩వ పాదం లో చిన్న మార్పు చేస్తేసరిపోయింది}

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
మంద మతి నాదు సఖుడు తా మంత్రి ఆయె.
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిల

February 23, 2009 1:48 PM

హరి చెప్పారు...

@చింతా రామకృష్ణారావు గారు

ధన్యవాదాలు.

రవి చెప్పారు...

మహాభారత యుద్ధంలో సైంధవుడు మహేశ్వరానుగ్రహంతో, ఒకే ఒక్క సారి, అర్జునుడి ఒదిలి మిగిలిన పాండవులను జయించేట్టు వరం పొందాడు.

భీషణంబుగ సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలుగురులను
సాంబశివుని అనుగ్రహాన సైంధవుండు
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లీల.

పైన హరి గారి పద్యం, మాస్టారి మార్పుతో మరింత శోభిల్లింది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! ఆసు కవితా భారవీ!చక్కగా పూరించారు సమస్యను.
ఐతే చిన్న మార్పుకై సూచన.మీరు వ్రాసిన క్రింది పద్యం
భీషణంబుగ సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలుగురులను
సాంబశివుని అనుగ్రహాన సైంధవుండు
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లీల.
లో
భీ అనే అక్షరానికి హల్ సామ్యముతో పాటు అచ్ సమ్యము కూడా వుండలి { ఇ - ఈ - ఋ - ౠ - ఎ - ఏ }
{ అ - ఆ - ఐ - ఔ }
{ ఉ - ఊ - ఒ - ఓ }ఇవి అచ్ సమ్యములు గలవి.
భయముఁ గొలుపుచు సాగెడి భండనమున
అంటే సరిపోతుంది.
రెండవ పాదంలో నలుగురులను కంటే నలువురి నిల.
అంటే మరీ బాగుంటుంది కదా.
మూడవ పాదంలో
సాంబ శివుని యనుగ్రహాన సైంధవుండు
అనడానికి బదులు
సాంబశివ దేవు కృపఁ జేసి సైంధవుండు. అని అంటే మరీ బాగుంటుందనుకొంటూన్నాను.
మొత్తం పద్యంలో మార్పుచేసిన తరువాత

భయముఁ గొలుపుచు సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలువురినిల
సాంబశివ దేవు కృపఁ జేసి సైంధవుండు.
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిల.

మీ రచనాసక్తికి అభినందనలు.

రాఘవ చెప్పారు...

లేతప్రాయాన శంకరు రీతి సర్వ-
విద్యలను నేర్చి లౌకిక విషయములను
విడచి పరమాత్మను మదిఁ సేవించు ఆ య-
మందబుద్ధికి ప్రాప్తించు మన్ననలిల!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

చతుర భాషణమ్ము, పరగ జాణతనము
చక్కనైన రూపు మరియు చురుకు బుద్ధి
కలుగు వాని మెత్తురెపుడు కాని, యెందు
మంద బుద్ధికి ప్రాప్తించు మన్ననలిల ?

రవి చెప్పారు...

తే.గీ:-
మెచ్చగా కైత వ్రాయగ నిచ్చగించి
పాటు పడెడి రవికి కైత వాటు నేర్పె
ఒజ్జ రామనార్యులెలమి బుజ్జగించి,
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లిల !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.