గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2008, బుధవారం

తమాషా శ్లోకం - అంబలి ద్వేషణం వందే !

తమాషా శ్లోకం :

మనం నిత్య జీవితంలో ఎన్నో కష్ట సుఖాలకు లోనవుతూ కూడా కొంత మానసిక ఉప శాంతిని " సంగీత సాహిత్యాల" వల్ల పొంద గలుగుతున్నాం. అందుకే పెద్దలన్నారు
" సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయం.
ఏక మాపాత మధురం, ద్వితీయం చింతనామృతం."
ఈ మాటలు ఎంత యదార్థము?
కొన్ని కొన్ని తెలుగు పద్యాలు, కొన్ని కొన్ని సంస్కృత శ్లోకాలూ అత్యద్భుతమైన ఆనందాన్ని కలుగ జేస్తాయి.
ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.

శ్లో:-
అంబలి ద్వేషిణం వందే.
చింతకాయ శుభ ప్రదం.
కూరగాయ కృత త్రాసం
పాలనేతి ప్రియం గవాం.


గమనించారుకదా యీ శ్లోకాన్ని.
ఈ శ్లోకం లో " అంబలి, చింత కాయ, కూరగాయ, పాల, నేతి, " యిత్యాది పదాలు మనకి తెలుగు పదాల్లాగా కనిపించి, తెలుగు పదాలతో కూడిన సంస్కృత శ్లోకం లాగా తోస్తుంది. ఐతే కొంచెం ఆలోచించి చూస్తే ఆ పదాలు తెలుగు పదాలు కావు. సంస్కృత పదాలే.ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

బలి ద్వేషిణం =బలిని ద్వేషించు వాడును,
చింతకాయ=చింతించు వారికి,
శుభ ప్రదం=శుభములు కలిగించు వాడును,
కు + ఉరగాయ= చెడ్డవాడయిన ఉరగమునకు {కాళీయునకు} ,త్రాసం=కష్టమును,
కృత= కలిగించిన వాడును,
గవాం= గోవులను,
పాలన+ఇతి= పరి పాలించుట యనిన,
ప్రియం= యిష్టము గల వాడును అగు,
అం= విష్ణువునకు,
వందే= నమస్కరించు చున్నాను.


తాత్పర్యాన్ని చూచినట్లయితే " బలి చక్రవర్తికి శత్రువూ,, తనను గూర్చి చింతించు వారికి శుభము లిచ్చువాడునూ,దుష్టుడయిన కాళీయునకు కష్టమును కలిగించిన వాడును , గోవులను పరిపాలించుటయందు ఇష్టం గల వాడును అగు విష్ణువునకు నమస్కరించుచున్నాను.
గమనించారు కదా! మీకు తెలిసిన క్రొత్త విషయాలతో వచ్చి మాకు, మా బ్లాగు ద్వారా పాఠకులకు ఆనందాన్ని పంచండి.

జైహింద్.
Print this post

3 comments:

చంద్ర మోహన్ చెప్పారు...

చాలా బాగుందండీ! నాగమురళి గారు కూడా ఇలాంటి, తెలుగులా కనిపించే సంస్కృత పద్యాన్ని పరిచయం చేశారు
(http://nagamurali.wordpress.com/2007/11/26/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%82/)

అజ్ఞాత చెప్పారు...

Kaneesam mee valla nayina kasta telugu sahityam gurinchi telusukuntunnanu....Hats off.......

జ్యోత్స్నా చెప్పారు...

ఈ పద్యం వ్రాసిన కవి పేరును చెప్పగలరా ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.