గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2008, బుధవారం

సమస్యా పూరణము కష్టమా?

సమస్యా పూరణ కష్టమా ?

ప్రియ పాఠక మహాశయులారా! పఠనాభిలాషులారా! పద్య రచనాభిలాషులారా!
సమస్యా పూరణ మీకు ఒక సమస్యగా తోస్తోందా? ఉత్సాహాతిశయులకు తొందరలో అలాగనిపించినా, కొంచెం నిదానంగా ఆలోచిస్తే పూరణ చాలా సులభం అనిపించక మానదు.మీరేచూడండి.
చోడవరంలో అన్నమాచార్య సంగీతపీఠంలో నాకు సత్కారం ఏర్పాటు చేసి ఆ సందర్భంలో కార్యదర్శి రామయ్యరెడ్డి నాకొక సమస్య పూరించమని యిచ్చారు. చూడండి.
" అన్నను గూడె చెల్లి తన యందము లార్చుచు హాయినొందగాన్."
చూచారుగా సమస్య యెలాంటిదిచ్చారో.
ఈ సమస్యను చూచి నేను ఖంగారు పడతాననుకొన్నారందరూ.సత్కరిస్తున్నప్పుడు అలా యిరకాటంలో పెట్టకూడదని అతనిని వారించబోయారు. ఐతే నేను " ఇదీ ఒక సమస్యేనా? అని అనే సరికి అందరూ కూడా యే రకంగా పూరిస్తానో అని చాలా ఆసక్తితో చూడసాగారు. నిజానికి నాకూ చాలా ఖంగారు పుట్టిన మాట వాస్తవం. ఐతే నాలో ఖంగారు బైట పడ కుండా కొంచెం మాటలలో పెట్టి ఆలోచించే సరికి ఆ శారదాంబ కటాక్షించింది . వ్రాసుకోమని యిలా చెప్పుట ప్రారంభించాను. అతడు వ్రాస్తున్నాడు.సునాయాసంగా పూరించినట్లు వారు గమనించేలా చేయగలిగాను.ఆ పూరణ చూడండి.
ఉ:-అన్నయు తమ్ముడున్ కలిసి యత్త కుమార్తెల నక్క చెల్లెలన్
తిన్నగ పెండ్లి యాడిరయ. తీరుగ నందరు మెచ్చనక్క తా
నన్నను గూడె. చెల్లి తన యందములార్చుచు హాయినొందగా
నన్నుల మిన్నయై తనరె, యాతని తమ్ముని గూడి . నిక్కమే.
చూచారా ఎలా పూరింప బడిందో. పూరణ కొరకు యిచ్చిన సమస్యని ఏకంగా మనం చూడకూడదు. పదాలు వేటికి వాటిని విడిగా చూసి దానికి అనుకూలమయే విధంగా ఆలోచిస్తే పూరణ అంత కష్టమేమీ కాదని మీరే గ్రహించగలరు. మిడి మిడి జ్ఞానినయిన నేనే పూరించగలిగినప్పుడు మీరు పూరించ లేకపోవడమేమిటి? మీరూ ప్రయత్నించి చూడండి. శుభమస్తు.
నమస్తే
చింతా రామ కృష్ణా రావు. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.