గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, అక్టోబర్ 2008, మంగళవారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 4

శ్రీమద్ రామాయణ కల్ప వృక్షంలో శ్రీ విశ్వనాధ భావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసం నుండి యింతవరకు మూడు పద్యాలను గూర్చి మీముందుంచగలిగాను. ఇప్పుడు నాల్గవ పద్యం చూద్దాం.

ఉ:- ఇంత మయూర రాజునకు ఏమి పొనర్చెనొ దుష్ట పాము దు
ర్దాంత గళోగ్ర సారణ విదారిత షట్జము గాగ నేగుచున్
దాంత పదాభిఘట్టిత పథంబున నర్ధ వికీర్ణ పింఛమై
ప్రాంత మహోగ్రనాకు వివరాంత ప్రవిష్టము జూచి రోజెడున్.
ఇది రామయణ కల్ప వృక్షము నందలి - నూపుర ఖండము లోని - 4.వ పద్యము.

సీతావియుక్తుడైన శ్రీ రామునికి పంపా సరోవర పరిసర అరణ్యంలో కనిపించిన ఒక దృశ్యం యిది. ఇక్కడ విశ్వనాధ ఒక మయూరమును వర్ణిస్తాడు.
ఒక నెమలి పెద్దగా అడుగులు వేస్తూ కోపంతో మెడ వెనుకకూ ముందుకూ ఊగుతుండగా రౌద్రము వలన పింఛము సగము విప్పుకొని ఒక పామును తరుముతున్నదట. కాని......కొద్ది లిప్తల కాలంలో ఆ పాము నెమలిని తప్పించుకొని ఒక నేల బొరియలోనికి పోయి అదృశ్యము కాగా మయూర రాజు శతృవు తప్పించుకొనగా ఏమీ చేయలేక నస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తూ రోజుతున్నదట. ఇందలి విశ్వనాధ భావుకతను పరిశీలిద్దాం.

" ఇంత మయూర రాజు " అనడం వల్ల గొప్ప వీరుడైన శ్రీ రాముడు మనకు స్ఫురణకు రాక మానడు రావణునికి ఒక దుష్ట సర్పముతో పోలిక ఇస్తూ వర్ణించడంలో అతని భావుకత మనకు ఆహా యనిపించక మానదు.పద్యంలో ప్రయోగించిన సమాసం నెమలి యొక్క పరుగులోని క్రమాన్నీ ఆయాసమునూ సూచిస్తున్నాయి.

మాయ లేడి కోసం వెళ్ళిన శ్రీ రాముడు లక్ష్మణ స్వామి మాటల వల్ల ఒంటరిగా ఉన్న సీతకు ఏ ఆపద వచ్చి పడుతుందో అని చాలా వేగంగా పర్ణ శాలకు వస్తాడు. కాని యింతలోనే రావణుడు సీతను అపహరించడం లంకాపురికి తీసుకొని వెళ్ళడం జరిగిపోయింది. అప్పటి శ్రీ రాముని నిస్సహాయత యీ పద్యంలో ప్రతి బింబితమగుచున్నది.

రావణ స్మరణము శ్రీ రామునిలో క్రోధోద్దీపకము కాగా జానకీ స్మరణము శృంగారోద్దీపకము అగు చున్నది.ఈ మహాకవి ఇక్కడ వర్ణనల యందు ఈ రెండు పార్శ్వములను వదలకుండా వర్ణించాడు. ఇదీ కవి సామ్రాట్ విశ్వనాధుని భావుకత.

చూచారు కదా కవి వతంసులగు శ్రీ బులుసు వేంకటేశ్వర్లువారి ఉపన్యాస గాంభీర్యతను, విశ్వనాధుని భావుకతను?. మరొక పర్యాయం మరొకపద్యం గురించి వారి నోట విన్నది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
వారితో నేరుగా మాటాడ దలచుకొనేవారి కొరకు వారి సెల్ నెంబరు...99491 75899. అందరికీ మరొక్క మారు దీపావళి శుభాకాంక్షలు. జైహింద్. Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

mana vishwanath sathyanarayana gari padhyala bhavukatha chala bagundhi. mana telugu kavithalu, kathalu prachuryam pondhalante eelanti vbhavukatha lani konsagindhadi.
Madhu
United Telecoms Limited
Hyderabad

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.