గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2008, సోమవారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత ౩.

చే జారిన తేనె బొట్టు
కవి సమ్రాట్ విశ్వనాధ భావుకతను వివరిస్తున్న కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ఉపన్యాసం నుండి మరొక పద్యాన్ని మీ ముందుంచుచున్నాను.
శా:-కంబళ్ళన్ మెయినిండ గప్పుకొని యాగండైన భల్లూక రా
జంబేదల్ తమి తేంట్లు చేయునది లేకల్లాడి గగ్గోలుగా
సంబాధంబగు తేనె సీత్కృతుల బీల్చన్ జూచు నాకాశ శా
ఖంబట్టూడక యుండ గాలదిమి చక్ర భ్రామ్య దక్షంబుగన్.
కల్ప వృక్షం - కిష్కింధ కాండ - నూపుర ఖండము - 3 వ పద్యము
సీతా వియోగి యైన శ్రీ రాముడు పంపా సరోవర పరిసర అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు.ఆయన ప్రతి చెట్టు పుట్ట పరిశీలిస్తున్నాడు. శ్రీ రాముని కంట బడిన ప్రతి దృశ్యము జరిగిన సీతాపహరణ వృత్తాంతాన్ని రాముని దఃఖాన్ని తెలుపుతూ కథా గతిలో రస నిర్వహణకు దోహదం అగునట్లు వర్ణించడం విశ్వనాధ విశిష్టత.
నిజానికి యే మనిషి యైనా దుఃఖితుడైన సమయంలో తనకు జగత్తు దుఃఖ మయంగాను, సౌఖ్యావహుడైన కాలంలో సుఖ మయంగాను భావించడం సహజం. ఈ మానవ సహజమైన భావన చేత కూడా శ్రీ రామునికి వసంత ఋతువు లోని ప్రకృతి దృశ్యాలు ఉద్వేగం విచారం మోహం భ్రాంతి దఃఖం మొదలైన స్పందనల్ని కల్గించడం ఎంతో సహజం గాను రమణీయంగాను మనకు కనిపిస్తాయి. ఇది విశ్వనాధ యీ ఘట్టంలో సాధించిన కవితాత్మకమైన మహా శిల్పం.

పద్య భావాన్ని పరిశీలిద్దాం.
కంబళ్ళు వంటి దట్టమైన వెంట్రుకలు శరీరం పై గల ఎలుగుబంటి చాల ఎత్తైన వృక్షాన్ని ఎక్కి పడిపోకుండా దృఢంగా చెట్టును కాళ్ళతో నొక్కి వింత ధ్వనులు చేస్తూ తేనె పట్టులోని తేనెను త్రాగుతున్నది. పాపము అంబేదలు అయిన తేనె టీగలు ( అంబేద = దిట్టతనం లేని వాడు, చేతకాని వాడు ) గగ్గోలు పెడుతున్నాయి.
ఈ వర్ణన ద్వారా మహాకవి సాధించిన విశేషార్థస్ఫురణము ఏమిటో చూద్దాం.
" సీత " రాముడు జన్మ జన్మాంతర పుణ్య పరపాకంగా సాధించిన తేనెఊట . మధు ప్రవాహం. భార్యగా ప్రేమ రాశిగా అనుసరణ శీలిగా . అద్వైత మూర్తిగా . పరిచర్యా శీలగా ఇలా " అద్వైతం సుఖ దఃఖయోః " అని భవ భూతి చెప్పిన రీతిని నిలిచిన స్త్రీ ఆమె. అటువంటి తేనెపట్టు వంటి ఆ సాధ్వి రావణుడు వంటి భల్లూకం చేతిలో పడడం శ్రీరాముని ద్యురదృష్టం. అంబేదయైన తేనె టీగ వలెరాముని హృదయం పరియపిస్తున్నది.
కంబళ్ళు కప్పుకొన్న దొంగలా భల్లూక రాజును పోల్చి చెప్పడం - సీతాపహరణ సమయంలో రావణుని వేషం సన్యాసి వేషాన్ని స్ఫురిస్తుంది. ఆకాశ శాఖ అనే పద ప్రయోగం వల్ల రావణుడు సీతను ఆకాశ మార్గాన కొనిపోయాడనే విషయం మనకు అవగతమవుతుంది.
యిలా వాచ్యంగా కాకుండా వ్యంగ్యాన్ని ఆశ్రయించి పాఠకుల హృదయంలో వర్ణనీయ వస్తువును - తదనుభూతిని సృష్టించే కవిత్వము ఉత్తమమైనదని ఆలంకారికులు చుప్తారు. పరమ మనోహరమైన ఈ వ్యంగ్య కవితకు రామాయణ కల్ప వృక్క్షం పుట్టినిల్లు.

విశ్వనాధ హృదయాన్ని బులుసు వేంకటేశ్వర్లు గారు ఎలా బహిర్గతం చేసారో చూచారు కదా. వీరి సెల్ నెంబరు 9949175899.
మళ్ళీ సమయం చిక్కినప్పుడు మరో పద్య రత్నాన్ని గ్రహిద్దాం. జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.