గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, అక్టోబర్ 2008, మంగళవారం

తాతా! అన్నందుకేనట బాధంతా.

తాతా! అన్నందుకేనట బాధంతా.

సామాన్య మానవుడు మనిషిగా, సత్ సాంగత్యం వల్ల , సద్గ్రంథ పఠనం వల్ల మనీషిగా ,అతడు కృషి చేసి ఋషిగా, కఠోర దీక్ష వల్ల మహర్షిగా పరిణతి చెందుతాడు. ఐతే ఒక్కొక్క సారి మానవుడు ఆశాపాశ బద్ధుడై సంచరిస్తూ దురహంకారంతో విర్రవీగుతుంటాడు. ఈ క్రమంలో తనమనసుతో పాటు వయస్సుని కూడా మభ్యపెట్టుతుంటాడు. తాను నిత్య యౌవనుడినని అనుకొంటుంటాడు. ఎవరి పలకరింపులోనైనా తన పెరిగిన వయసు స్ఫృశింప బడితేమాత్రం తట్టుకోలేడు.
ఈ విషయాన్నే సూచిస్తూ ఒక చమత్కారంతో కూడిన చాటువు వుంది. మీరూ గమనించండి.

శ్లో:-
ఆపాండురాశ్శిరజాః, త్రివళీ కపోలే
దంతావళీ విగళితో నచ మే విషాదః.
ఏణీదృశో యువతయః పథి మాం విలోక్య
తాతేతి భాషణ పరాః ఖలు వజ్ర పాతః.


చూచారు కదండే? ఒక వ్యక్తి అంటున్న మాటలివి.అతని జుత్తు తెల్లగా అయిపోయినందుకు అతనికి బాధగా లేదట. చెక్కిళ్ళు ముడతలు పడినందుకూ బాధగా లేదట. పండ్లు వూడిపోయినందుకు కూడా అతనికి బాధగా లేదట. అతడు వెళ్ళిపోతూవుండగ మార్గ మధ్యలో కొందరు యువతులు అతనిని చూచి " తాతా " అని పిలిచారట. అంతే అతని మనస్సుకి ఆ మాట వజ్రపు దెబ్బలాగా తగిలిందని వాపోతున్నాడు. మీరూ విన్నారుకదా. ముసిలి తనం పైన పడినా అతని మనసు అంగీకరిచడం లేదు పాపం.అందుకే యుక్త వయసులోనున్న అమ్మాయిలు తాతా అని నడి బజారులో పిలిచేసరికి తట్టుకో లేక పోయాడు. మరి మీరేమంటారు?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.