గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2008, శనివారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 2.

" అంతస్సంఘర్షణలో శ్రీరాముని హృదయ కుసుమం "
శ్రీ విశ్వనాధ సత్య నారాయణ రామాయణ కల్ప వృక్ష మహా కావ్యంలో వారి భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ప్రసంగ సారాంశాన్ని 21-10-2008వ తెదీన కొంత చూచాం. ఇప్పుడు మరొక పద్యం లోని భావుకతను తెలుసుకొందాం.
రామాయణ కల్ప వృక్షం కిష్కింధ కాండ- నూపుర ఖండం -2వ పద్యం.
చ:-మరియు మతంగ మౌని మహిమ స్పృశముల్ పరమానుకూల శాం
తరసము మాన లేవు రతి నాయక సాయక తీవ్ర రూప బం
ధురత త్యజింప లేవు సుమనోవ్రజ మల్లల పంప నీటి తుం
పురులను చల్ల గాలులను మోచి సుమావళి మాత్రమైనవై.

మహా కవి భావనకు అంతు అనేది ఉండదు.ఊహాశాలిత్వం మహాకవుల బుద్ధి వైభవం మన ప్రాచీన కవుల వర్ణనల్లో దర్శన మిచ్చినట్లే రామాయయణ కల్ప వ్రృక్షంలోనూ దర్శన మిస్తుంది.

శ్రీరాముడు సీతావిరహియై పంపా సరోవర పరిసర అరణ్యంలో లక్ష్మణ సమేతుడై సంచరిస్తున్న ఘట్టం యిది.
పంపా సరోవర ప్రాంతం మతంగ మహర్షి మహిమ చేత విలసితం అయినది. ఆ మహర్షి తపః ప్రభావం వల్ల ఆ పుణ్య ప్రదేశంలోని పూవులు శాంత రసమును వెలి గ్రక్కు తున్నాయి. మఱి వాటి జన్మ సిద్ధమైన, సహజమైన మన్మధ బాణ గుణమును వదలకుండా ఉన్నాయి. ఈ రకమైన రెండు పరస్పర గుణ సంఘర్షణలచేత పంపా సరస్సు నుండి గాలిలో తేలి వచ్చిన నీటి తుంపురులకు తడిసి వట్టి పువ్వులుగానే మిగిలిపోయాయి. అనుకొంటాడు శ్రీ రాముడు.

సీతా వియోగంలో దఃఖితుడైన శ్రీరాముడు - వసంత ఋతు శోభలో సీతా విరహియై మన్మధప్రభావితుడైన శ్రీరాముడు. ఇద్దరు శ్రీరామచంద్రులు మనకిక్కడ కనిపిస్తారు.
కవి శ్రీరాముని అంతస్సంఘర్షణను పూవులపై మిషగా ఉంచి మన మనస్సుకు కనిపింప చెస్తాడు. వాల్మీకి రామాయణంలో సీత లేని యీ సమయంలో యీ పూల సౌందర్యం నాకు నిష్ఫలంగా తోస్తోంది. అంటాడు శ్రీరాముడు. వాల్మీకి సూచించిన పూల సౌందర్యం అనే మాటను గ్రహించి విశ్వనాధ అనితర సాధ్యంగా ఇంత వర్ణన చేసారు.

శ్రీరాముని ప్రస్తుత దుఃఖానికి రెండు కారణాలు కనబడతాయి. అరణ్య వాసంలో నిన్ను సేవిస్తూ వసంత సౌందర్య విరాజితములైన వనాలను చూసి ఆనందిస్తానని సీత ఇదివరకు రామునితో పలికింది. అట్టీ సీత ఇప్పుడు లేదు. కనుల ముందు వట్టి వసంతం మాత్రమే ఉంది. ఇది శ్రీరాముని దఃఖానికి మొదటి కారణం. రెండవది రస సంబంధి. విప్రలంభ శృంగార నాయకుడైన శ్రీరాముని యందు ప్రస్తుతము ప్రియావిరహము దఃఖ కారణము అగుచున్నది.

మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంత మందలి పూవులు శాంత గుణమును వదలలేకుండుట - తమ జన్మకు సహజ గుణమైన { పూవులు మన్మధాస్త్రములు కదా } తీవ్ర రూపమును వీడ లేకపోవుటను విశ్వనాధుడు వాడడం అత్యద్భుతము. పూవులు కేవలము పుష్పములుగా మిగిలిపోయినవని చెప్పడం శ్రీరాముని మనస్సులోని ఒకానొక నిర్వికార దశకు సూచకము. కావ్యములో ప్రవేశించే కొలదీ కవి భావుకతా సీమలు పరమ రమణీయముగా దర్శనమిస్తాయి.
చూచారూకదా బులుసువెంకటేశ్వర్లు గారు బహిర్గతం చేసిన విశ్వనాధ కృతిలోనిభావుకత.ఈ కవి వతంసుని సెల్ నెంబర్:-99491 75899.
మరికొన్ని విషయాలను త్వరలో మీముందుంచగలందులకు యత్నింతును. జైహింద్.
Print this post

1 comments:

PVRao చెప్పారు...

"కవివసంత" శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి భావుకత అద్భుతము.. దయచేసి కొనసాగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.