గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2025, శుక్రవారం

భక్తిసాధనం వారు వ్రాయుటకవకాశం కలిగించిన మకుటం. మంగళాంబికా! నా పద్యదశకము.

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః🙏🏼

మంగళాంబికా!🙏🏼


౧) ఉ.  శ్రీ మధుసూదనుండు, శశిశేఖరుఁడున్, విధి, నిన్ భజించుటన్

శ్రీమదనంత సృష్టి విరచించుట గొప్పఁగఁ జేయఁగల్గిరే,

నీమముతోడ నిన్ గొలుచు నీ వరభక్తుల కాత్మశక్తివై

ప్రేమగ నిన్ భజించునటు ప్రీతిని చేయుము మంగళాంబికా! 


౨) చ.  కమలదళాయతాక్షి! నినుఁ గానని కన్నులు కన్నులెట్లగున్?

బ్రముదముతోడ నీ భజన వర్ధిలఁ జేయని జన్మ జన్మయా?

శ్రమగఁ దలంపఁబోక నినుఁ జక్కఁగఁ జూచెడి భాగ్యమిచ్చుచున్,

సమధిక భక్తితోఁ గొలుచు శక్తినొసంగుమ, మంగళాంబికా!


౩) ఉ.  నీ పదపద్మ సేవను వినిర్మల చిత్తము తోడఁ జేసినన్,

బాపవిదూరులై జనులు వర్ధిలునమ్మరొ భక్తినొప్పుచున్,

హేపరమేశ్వరీ! జనని! హేశివ! శాంకరి! యంచు భక్తితో

నీపరతత్త్వమున్ గొలువనీ, కరుణాకర మంగళాంబికా!


౪) ఉ.  నీదగు మందహాసము గణించుచు నెవ్వఁడు చూడఁ గల్గునో

మోదముతోడ వానికి సమున్నతి గొల్పుదువమ్మ నీవు, స

ద్బోధను పొంది వాఁడు గుణపూర్ణుఁడుగా జగతిన్ బ్రసిద్ధుఁడై

నీదరిఁ జేరగల్గునుగ, నిశ్చయమిద్దియె, మంగళాంబికా!


౫) ఉ.  నీ వనురాగమూర్తివి, వినిర్మలచిత్తము నిత్తువీవె, మా

భావనలందు నీపయిని భక్తిని పూర్తిగఁ గొల్పుదీవె, నీ

సేవలె చేయఁ జేయుచును, చిత్తము నీపయి నిల్పఁ జేయుచున్,

గావుము మమ్ము నీవు, వర కామిత దాయిని! మంగళాంబికా!


౬) ఉ.  నేనిల రామకృష్ణుఁడను, నీ ప్రియ పుత్రుఁడనమ్మ! నీ దయన్

జ్ఞానులతోడ సంగతిఁ బ్రకాశము చిత్తములోనఁ గల్గుటన్

ధీనిధులెన్నునట్టులుగ దివ్యముగా నిను గొల్చు పద్యముల్

మౌనమెలర్ప వ్రాసెదను లక్ష్యము తోడను, మంగళాంబికా!


౭) ఉ)  ఏ జనయిత్రి సత్కృపకు నీశ్వరుడున్ పరితప్తుఁడౌనొ, నా

కేజనయిత్రి సమ్మతిని యీ కవితామృతమే లభించెనో,

యే జనయిత్రి పాదరజమే సృజియింపఁగఁ జాలు సృష్టినే,

యా జనయిత్రి వీవెకద, యన్నులమిన్నవు, మంగళాంబికా!


౮) ఉ.  నీ పదపద్మరేణువె మనీషునిగా యొనరించు భక్తునిన్,

నీ పదపద్మరేణువె యనేకశుభంబులు గొల్పు నిత్యమున్,

నీ పదపద్మరేణువె గణించి నశింపఁగఁ జేయు దుర్గతుల్,

నీ పదపద్మ రేణువె వినిర్గతి నాకగు, మంగళాంబికా!


౯) ఉ.  ఏమని నిన్ గణింతు పరమేశ్వరి! నీ పరతత్త్వమెన్ని, ని

న్నేమని బల్కరింతు పలుకే కరువౌగద నిన్నుఁ జూడ, నీ

కేమని విన్నవించెదను, హే జగదంబిక కావుమంచు, నీ

వే మది నెన్ని కావవలె నీశ్వరి నన్నిల, మంగళాంబికా!


౧౦) మంగళరూపిణీ! జయము, మంగళముల్ మముఁ జేరనిమ్ము, నీ

మంగళ నామ సంస్మరణ మాకు శుభంవులొసంగు నిత్యమున్,

మంగళ కారిణీ! నయసమంచిత వృత్తిని గొల్పి మమ్ములన్

మంగళ కార్యచారులుగ మంచిగ కావుము, మంగళాంబికా!


అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.