జైశ్రీరామ్.
శ్రీమదాంధ్రామృత పాఠకులకు 2025. ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
శా. *శ్రీమన్మంగళ* యాంగ్లవత్సరముగా శ్రీలన్ బ్రసాదింపఁగాఁ
బ్రేమన్ వచ్చె ప్రశోభితాద్భుతముగా, వెల్గొందుడీ మీరు, సు
క్షేమంబున్, ధనధాన్యముల్, సుఖములున్, చిద్భావనాభాగ్యమున్,
ధీమాన్యత్వము, వత్సరాంతమును సద్దీప్తిన్, ధరన్ బొందుడీ!
చం. మనము సతమ్ము నాంగ్లతిథి మానక వాడుచునుండుచుండుటన్
ఘనముగ వత్సరాంతమును గౌరవమొప్ప రహింపఁ గోరుచున్
జనహితమాశచేయుటది చక్కని పద్ధతిగాఁ దలంచెదన్,
మనములఁ గోపగించకుడు, మంచిని గాంచుడు నా ప్రవర్తనన్.
శా. అమ్మా! కాల మహాస్వరూప జననీ! ఆనంద సంధాయినీ!
సమ్మాన్యంబుగ నీదు భక్తతతి సంస్కారాక్షరప్రాజ్ఞులై
నెమ్మిన్ నీ పదసేవనామృత మతన్ నిత్యంబు వెల్గొందగా
సమ్మోదమ్మున వత్సరాంతమును ధ్యాసన్ జేసి కాపాడుమా.
ఉ. దైహికమైన రుగ్మతలు తల్లివి నీవె నశింపఁ జేయుమా,
మోహము వాపి, సత్యము నమోఘముగా గ్రహియింపఁ జేయుమా,
దేహమునందు శక్తినిడి, దివ్యముగా శుభకార్యముల్ సదా
స్నేహముతోడ లోకులకుఁ జేయఁగఁ జేయుమ భక్తపాళికిన్.
ఉ. వేల్పువు నీవె, మానసిక వేదనలన్ దరిఁ జేరనీక, సం
కల్పము సత్ప్రవృత్తిపయిఁ గల్గల్ఁగఁ జేయుచు నాదుకొమ్మ, యీ
యల్పులమైన మేము పరమార్థము నీవని నమ్మియుంటిమే,
నిల్పుము భక్తితో భువిని నీపదసేవసుఖంబునిచ్చుచున్.
🙏🏼🙏🏼🙏🏼
👍
అమ్మ అనుగ్రహంతో🙏🏻
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.