జైశ్రీరామ్.
|| 16-15 ||
శ్లో. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః.
తే.గీ. నేను ధనికుడనుకులీను నేనె ఘనుడ,
యజ్ఞ ముల్జేయుదున్, దానమాచరింతు
ననుచు మూర్ఖుడై పతనంబు గనునతండు
రాక్షసములక్షణంబిది, శిక్షితుడగు.
భావము.
నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?
యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో
భ్రాంతి చెందుతారు.
|| 16-16 ||
శ్లో. అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ.
తే.గీ. అంతు లేని తలపులతో, భ్రాంత చిత్తు
లగుచు నజ్ఞానమున జిక్కి, యంతులేని
కామభోగాలచే నరకమునబడుచు
హేయముగ నాసురులు భువి మాయదగులు.
భావము.
అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని,
కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.