జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
16. చ. వెతలు భరించ లేక ప్రభవించెడు దుర్గతులాప నేరమిన్
క్షితిని కృశించుచుండిరి విశిష్టమహాత్ములె. శక్తి హీనులై.
బ్రతుకఁగ దివ్య మార్గమును, బాధలఁ గెల్చెడి
శక్తినిమ్ము బా
ధితులకు యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
17. చ. క్షణమున భంగురంబటుల కాలము గర్భము జొచ్చు పృథ్విపై
గుణగణులాదిశాఖజులు కూర్ముని తప్ప యిహంబు కోరరీ
ధనములు రత్నహారములు ధర్మపరిగ్రహులైన వీరికిన్
తృణమయ! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
18. ఉ. శ్రీవర తేజులౌ ప్రథమచిద్వర శాఖజులైనవారికిన్
దీవన లీయ వేడెదను. దీనులనెల్లెడ కావ వేడెదన్.
భావజ న్యూనతన్ దుడిచి భాస్కర తేజము గొల్పఁ గోరెదన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
19. ఉ. భావి తరంబులన్ సుగతి వర్ధిలఁ జేయు మహాత్ములెందరో
మీ వరణీయ తేజమును మీ మహనీయతలన్ స్మరించు. సం
సేవలఁ దేల్చు మిమ్ములను . చిత్తమునన్ స్మరియింతు వారలన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
20. చ. వలయునదేది దుర్గతిని బాయఁగ నెంచిన మానవాళికిన్?
ఫలములనెట్లు వీడనగు పాపము పుణ్యము చేయువారికిన్?
మెలకువ కొల్పు మాకు, గుణమేదుర. సత్పరివర్ధకంబు కాన్
దెలుపుము! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.