6. చ. అవనిని కాణ్వ శాఖను మహాత్ములనేకులు జ్ఞాన తేజులై
ప్రవిమలకీర్తిఁ గొల్పిరి. పరాత్పర సన్నిభులెల్లరున్ గనన్.
భువిననురాగయుక్తులగు పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
7. చ. శ్రవణ కుతూహలమ్ముగ, ప్రశంసలనందెడు రీతి వేదమున్
సువిదిత రీతి చెప్పఁగల శోభనమూర్తులు వేద పండితుల్
భువిని వశించు భాస్కరులు. పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
8. ఉ. భావన చేత , మాటలను, పట్టుగ చేసెడి చేతలన్ సదా
ధీవరులెన్న నొక్కటిగ తీరుగ చేసెడి దివ్యమూర్తులన్
సేవలు నీకు చేయు శుభ చిత్తులకేను నమస్కరింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
9. ఉ. భావిని చూచి చెప్పెడి ప్రభావము కల్గిన కాణ్వశాఖ రా
జీవ మహాత్ములన్ దలచి చేసెద వారికి వందనంబులన్.
శ్రీవరణీయులై చెలఁగు చిన్మయమూర్తులకీవె తోడుగా.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
10. చ. శ్రవణ కుతూహలమ్మయిన చక్కని కావ్యములల్లు సత్కవుల్
భువిని వసింతురందుఁ గల పూజ్యులలోపల కాణ్వ శాఖజుల్
ప్రవరులుగా గణింపఁబడు వారిని కల్గెడి దివ్యమైన భా
తివి కన యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
1 comments:
నమస్కారములు
అలతి అలతి పదములతో సులభ గ్రాహ్యమైన పద్యములు అద్భుతముగా నున్నవి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.