జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
11. చ. కలియుగమందు పుట్టుటను కానిపనుల్ పచరించుచుంటిమే,
తెలియకపోవుటన్. కృపను తీరుగ మా మదులందు జ్ఞానమున్
బలముగ పొందఁగా వలయు. భవ్యుఁడ సన్నుత దివ్యమార్గమున్
దెలుపుము యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
12. చ. పరిపరి వేడెదన్. సుగుణ వర్ధన చేసెడి సత్కవిత్వమున్
నిరుపమ మార్గమందు వరణీయముగా నెలకొల్పుమయ్య. నన్
గరుణను చూడుమయ్య. గురుగౌరవ తేజములిమ్ము నాకు సు
స్థిరముగ, యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
13. చ. అతులిత తేజసంబు పరమాద్భుత రీతిని నిన్ను చేర, సం
స్తుతులను ముంచెనీజగతి శోభిలుచుండెడి నిన్నుఁగాంచి, యే
గతిని వహించె నిన్ ప్రభలు? కాంచఁగ మాకును చూపుమయ్య. వం
దిత పద! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
14. చ. క్షితిని మహాత్ములెల్లరును శిక్షణనిచ్చెడి సద్గురూత్తముల్.
సతతము వారి వర్తనము చక్కఁగనెంచి గ్రహించువారు స
న్నుతమతులై రహించెదరనూనగతిన్. మరి నాకు కూడ యా
ధృతినిడు, యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
15. చ. సుజనులె నీదు మార్గమున శోభిల వర్తిలనేర్తురయ్య స
ద్విజయము కాంచగా వలచి. విజ్ఞులు వారలు. నన్ను నీవు నీ
విజయ పథమ్మునన్ నడిపి విజ్ఞతతోడ వశింపఁ జేయుమా.
ద్విజవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.
1 comments:
నమస్కారములు
శతక పద్యములు మాకందించు చున్నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.