జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
1.ఉ. శ్రీ వనజాప్త లబ్ధ వర చిన్మయ వేద నిధాన! నిత్యమున్
దేవ సుపూజితాద్యుఁడగు దివ్య వినాయకునాత్మనెంచి, నిన్
భావన చేసి యీ శతక భర్తగ, నే విరచింతు నీపయిన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
2. ఉ. భూవలయంబులో సుజన పూజిత దివ్య పదారవిందయౌ,
భావనలోన మెల్గు వరవాణికి, పుస్తక రమ్యపాణికిన్,
శ్రీవనజాత సంభవుని చిన్ముఖ వాసినికంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
3. ఉ. జీవనమిచ్చినట్టి రఘు చిన్మయ వేంకట వీర సద్గురున్,
భావన చేసి నా మదిని, భక్తిసమన్వితునై భజించుచున్
దీవనలీయఁ గోరుదును దివ్యముగా విరచింపదీనినో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
4. ఉ. దేవులకెల్ల దేవుఁడును, దీనజనావన దీక్షితుండు, స
జ్జీవన మార్గదర్శకుఁడు, శ్రీకర కృష్ణుడు, వానినెన్నుచున్
బ్రోవఁగ గోరుచున్ మదిని పూజ్య పదంబుల కంజలింతు నో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
5. ఉ. జీవన భాగ్య హేతువయి, సృష్టికి మూలమునై యహర్నిశల్
భావనకైన చిక్కని ప్రభా నిలయుండగు భాస్కరుండు సం
భావితమూర్తియై పగలు వర్ధిలు. వానికినంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.
(సశేషమ్)
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఒక మంచి శతకమును మా కందిస్తున్న పాండితీ స్రష్టకు అభినందన వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.