జైశ్రీరామ్.
"శ్రీ రాయపెద్ది అప్పా శేష శాస్ర్రి గారి విశేష పరిశీలన .వారు చరవాణిలో ముచ్చటించారు. ఈ వైజ్ఞానిక పరిశీలనా వ్యాస విశేషాలకు మిత్రుల స్పందన కోరుచున్నారు.అద్వైత సిద్ధాంతము-ఒక వైఙ్ఞానిక పరిశీలన రచన: రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, (ఆదోని కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, ) (హ్యుమానిటీస్ విభాగాధిపతి, సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి, ఎమ్మిగనూర్) My Email ID rassastry@gmail.com my phone number 9440244283
అద్వైత తత్వాన్ని వేదాంతపరమైన పారిభాషిక పదజాలాన్ని ఉపయోగించి గానీ, కేవలం తాత్త్విక దృష్టితోగానీ కాకుండా వైఙ్ఞానికపరమైన దృష్టితో పరిశీలించి, విశదీకరించే ప్రయత్నమే ఈ చిన్ని వ్యాసం .
భౌతిక, రసాయనిక, ఖగోళ, జీవశాస్త్రాల విషయాలను సవివరంగా, కూలంకషంగా చర్చించడానికి గానీ విపులమైన వేదాంత చర్చ చేయడానికిగానీ ఈ వ్యాసపరిధి చాలదు. సరళమైన భాషలో, అద్వైత సిద్ధాంతానికీ, ఆధునిక వైఙ్ఞానిక శాస్త్రానికీ మధ్య ఉన్న సమన్వయాన్ని నిరూపించే ప్రయత్నానికి రూపకల్పనే ఈ ప్రయోగం. కమండలంలో సముద్రాన్ని ఇమిడ్చే ప్రయత్నంలో ఈ రచయిత ఎంతవరకూ సఫలీకృతుడయ్యాడో విఙ్ఞులైన పాఠకులే నిర్ణయించాలి)
ఏ శాస్త్రీయ అన్వేషణకైనా శాస్త్రీయ చిత్త ప్రవృత్తి అవసరం. ఏ విషయాన్నైనా, మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, అంగీకారయోగ్యమైన గీటురాళ్ళతో పరిశిలించి, సత్యాన్ని అంగీకరించడమూ, అసత్యాన్ని తిరస్కరించడమే శాస్త్రీయ దృక్పథం. జగన్మిథ్యాత్త్వాన్నీ, జీవ బ్రహ్మత్వాన్నీ ప్రతిపాదించిన మొదటి చారిత్రక వ్యక్తి శ్రీఆదిశంకరులు. వారు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత భౌతికశాస్త్రాచార్యులు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతపు నేపథ్యంలో పరిశిలించి నిగ్గుతేల్చే ప్రయత్నం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, శ్రీఆదిశంకరులు ప్రతిపాదించిన "మాయ" ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షత, సాపేక్షసత్యం అన్న భావానికి అతి చేరువలో ఉంటుంది కనక. "శ్లోకార్థేన ప్రవక్ష్యామి,యదుక్తం గ్రంధకోటిభిః, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవోబ్రహ్మైవ నాపరః" అంటారు శ్రీఆదిశంకరులు. అనేక గ్రంథాలలో చెప్పబడిన దానిని అర్ధ శ్లోకములోనే చేబుతానంటారు. అదేమిటంటే"బ్రహ్మ మాత్రమే సత్యము జగత్తు మిథ్య (అంటే అసత్యము), అలాగే బ్రహ్మ మాత్రమే సత్యము జీవుడు బ్రహ్మమేగానీ ఇతరము కాదు" అని. శంకరులే అద్వైత సిద్ధాంతము నకు సారభూతమైన తమ రచన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములో "మాయాకల్పిత దేశ, కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం" అంటారు. మాయ చేత దేశము, కాలము, కలనము విచిత్రముగా చిత్రీకరింప బడ్డాయి అని దీని భావము. ఆధునిక విఙ్ఞాన శాస్త్రం అంగీకరించిన సత్యాల ఆధారగానే, హేతువాద దృష్టి తోనే పరిశీలించి దేశము, కాలము, స్థూల దృష్టికి గోచరిస్తున్న విధం గా పదార్థము, దిక్కులూ చివరికి మన ఉనికి కూడా ఎలా సాపేక్ష సత్యాలు మాత్రమే గానీ కేవల సత్యాలు కావో పరిశీలిద్దాము. ఈవిశ్వము ఎలా భ్రాంతి కాగలదన్న విషయాన్ని మొదట పరిశీలిద్దాము. కోట్లాది 1గెలాక్సీల (తారా బ్రహ్మాండాల)తో అనంతకోటి 2కాంతి సంవత్సరాల పర్యంతం విస్తరించి, అసంఖ్యాకమైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలూ, గ్రహ శకలాలూ తారా ధూళి తో కూడి ఉన్న యీ బ్రహ్మాండము మిథ్య అంటే సులభంగానమ్మశక్యంగాదు.ఈ దృశ్యమానవిశ్వం ఊహాతీతమై కోటానుకోట్ల మైళ్ళ పర్యంతం విస్తరించిఉన్నది. ఈ విశ్వమంతా 110మూలకాల (elements)తో నిర్మించబడిఉన్నది. (వీనిలో82మూలకాలు స్థిరమైనవి, మిగతావి అస్థిరమైన, పరివర్తనాశీలమైనవి. వీనిని రేడియో ధార్మిక మూలకాలు అంటారు. వాని అర్ధజీవితకాలాన్ని(half life period) బట్టి ఇవి కొన్ని లక్షల లేక కోట్ల సంవత్సరాల అనంతరం ఇవి సీసముగా పరివర్తన చెందుతాయి.) ఈమూలకాలన్నీ అణువులు (molecules) మరియూ పరమాణువుల(Atom)తో నిర్మించబడ్డాయి. ఈ పరమాణువుల కేంద్రకము(nucleus) లో ధన విద్యుదావేశము కలిగిన ప్రోటానులు, మరియూ ఎలాంటి విద్యుదావేశములేని న్యూట్రానులూ ఉంటాయి. కేంద్రకము చుట్టూ నిర్ణీతకక్ష్యల్లో ఋణవిద్యుదావేశాన్నికలిగిన ఎలెక్ట్రానులు ఉంటాయి. కేంద్రకముపదార్థముతో దట్టముగా నిండిలేదు.కేంద్రకములోని ప్రోటానులు న్యూట్రానుల మధ్య శూన్యప్రదేశమే అధికముగా ఉంటుంది. అలాగే కేంద్రకము చుట్టూ పరిభ్రమించే ఎలెక్ట్రానుల మధ్య కూడా శూన్యమే అధికంగా ఉంటుంది. 3ప్రోటాన్లు,న్యూట్రానులు, ఎలెక్ట్రానులు అతి అల్పముగా మాత్రమే ద్రవ్యరాశి లేక పదార్థాన్ని కలిగినవి. 4కేంద్రకములోనూ, కేంద్రకాల మధ్యా, పరిభ్రమిస్తున్న ఎలెక్ట్రానుల మధ్యా, అలాగే అణువుల మధ్యా, పరమాణువుల మధ్యా అధిక భాగము శూన్యమే. ఈ శూన్య స్థలాన్ని తొలగించి అత్యల్పంగా ఉన్న ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్య రాశిని మాత్రమే లెక్కలోనికి తీసుకొంటే అనంతంగా విస్తరించి ఉన్నట్లు కనిపించే ఈ విశ్వంలో ద్రవ్య రాశి అతి కొద్ది గా మాత్రమే ఉన్నది. ఈ పదార్థాన్ని (ద్రవ్య రాశిని) ఇక ఇంతకంటే దగ్గర గా చేర్చటానికి వీలుకానంత సాంద్రం గా (దట్టంగా) నొక్కి వేయగలిగితే (కేవలం ఊహ మత్రమేఅనుకోండి) ఎంత ద్రవ్య రాశి మిగులుతుంది? అల్పాల్పంగా మాత్రమే! ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సర్ జేమ్స్ జీన్స్ఒక రమణీయమైన కల్పన చెపుతాడు. వాటర్లూ రైల్వే స్టేషన్ అంతా ఖాళీ చేసి నాలుగు ఇసుక రేణువులు మాత్రమే చల్లితే అది ఎంత దట్టం గా ద్రవ్యరాశితో క్రిక్కిరిసి వుంటుందో ఈ బ్రహ్మాండం కూడా అంతే ద్రవ్య రాశి తో క్రిక్కిరిసి వుందని అంటాడు.మరి అంత అత్యల్ప పరిణామంలో ఉన్న ద్రవ్యరాశి అనంతకోటిమైళ్ళ దూరం విస్తరించినట్లుగా ఉంటూ, ఊహాతీతమైన శక్తిపుంజాలను విశ్వమంతావిరజిమ్ముతూ ఉండటం కంటే మాయకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? అత్యల్పమైన, అతి పలుచనైన ద్రవ్యరాశి, కేవలం ధన ఋణ విద్యుదావేశాలు ఇంద్రియాలతో అనుభవింపదగిన విశ్వంగా దర్శనమివడం పెద్ద మాయ కాదా? దీన్నే మనం ఊహించుకోగలిగిన ఒక ఉదాహరణరూపంలో తీసుకొంటే విషయాన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోగలము. ఆరున్నర అడుగుల పొడవు, 90కిలోల బరువు, రెండు అడుగుల చుట్టుకొలత కలిగిన మనిషిని చూస్తే ఇతను ఏమీ కాదు, ఇతనిలో ద్రవ్యరాశి ఏమీ లేదు, కేవలం శూన్యం మాత్రమే ఇలా భాసిస్తూ ఉంది అని అనగలమా? కానీ నిజానికి అదే వాస్తవం. ఎందుకంటే ఆమనిషిలో ద్రవ్యరాశిని మాత్రమే లెక్కలోనికి తీసుకొంటే అది దాదాపు శూన్యం అనే చెప్పుకోవచ్చు. కానీ కళ్ళ ముందు కనిపిస్తూ, చేతికి తగులుతూ, చెవులకు వినిపిస్తూ, వాసన చూడటానికి వీలయ్యే ఈ 90కిలోల మనిషి శూన్యం మాత్రమే, ఇతనిలో పదార్థం ఏమీ లేదు ఎంతో విడ్డూరంగానూ, నమ్మ శక్యం కాకుండానూ ఉంటుంది. దీన్నే భ్రాంతి లేక మాయ అని చెప్పుకోవచ్చు. ఇదే మనo చూస్తున్న సకల చరా చర జీవ రాశి విషయంలోనూ వర్తిస్తుంది. అద్వైతసిద్ధాంతానికి సారభూతమైన దక్షిణమూర్తి స్తోత్రంలో చెప్పినట్లు దేశం, కాలం మాయా నిర్మితాలు మాత్రమేనని చెప్పటం ఎలా సాధ్యమౌతుందో పరిశీలిద్దాము. మొదట కాలం ఎలా "మాయా కల్పన" లేక "మిథ్య" అన్న విషయాన్నిపరిశీలిద్దాము. సత్యమన్నది అఖండశిలాసదృశం(monolithic structure) గానే కాకుండా, విభిన్న స్థాయిల్లో, వివిధ రకాలుగా భాసించే సాపేక్ష సత్యంగాకూడా దర్శనమిస్తుంది. ఈ వ్యవహారిక సత్యాలు లేక సాపేక్ష సత్యాలు ఇంద్రియాలతో అనుభవించదగినవి. కేవల సత్యం లేక పరమ సత్యం (Absolute Reality) ఇంద్రియాతీతమైనది. మనం అత్యంత సత్యం అని భావించే "కాలం" కేవలం సత్యాభాస అని చెప్పుకోదగ్గ సాపేక్ష సత్యం (Relative Reality) మాత్రమే. వెలగపండు ఆకారంలో ఉన్న భూగోళం తన చుట్టూ తాను తిరుగుతూ అండాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నందువల్ల కలుగుతున్న భ్రమే "కాలం". సూర్యోదయం నుంచీ సూర్యోదయం వరకూ గల కాలాన్ని ఒక రోజుగా భావిస్తున్నాము. దీనిని 24 గంటలుగానూ,గంటకు 60నిముషాలుగానూ, నిముషానికి60సెకండ్లుగానూ చేసుకొన్నది కేవలం మానవకల్పితమైన కాల విభజన మాత్రమే. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఒక సారి తిరగడానికి పట్టే సమయాన్ని ఒక సంవత్సరంగా లెక్కిస్తున్నాము. అసలు సూర్యోదయ, సూర్యాస్తమాయాలే భు భ్రమణం వల్ల ఏర్పడుతున్న దృశ్యభ్రాంతులయినప్పుడు "ఈ రోజు" అన్న మాటకు అర్థం ఏముంది? మనము భూమికి బద్ధులుగా ఉన్నంత వరకే ఈ సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు గంటల లెక్క చెల్లుతుంది.భూమిని వదలి మనం రోదసి లోనికి ప్రవేశించితే, సూర్యోదయ, సూర్యోస్తమయాలు లేని చోట కాలం అన్న మాటకు అర్థం ఏమి ఉంటుంది? భూత, భవిష్య, వర్తమానాలుగా మనం విభజించుకొన్న కాలము ఒక అర్థ రహితమైన భావనగా మాత్రమే మిగులుతుంది. రోదసిలో ఉన్నది కాలాతీతమైన, కాల రహితమైన శాశ్వత స్థితి మాత్రమే. కానీ మనము భూమికి బద్ధులమై ఉన్నంత వరకూ, ఈ కాలము అన్నది అంగీకరించక తప్పని ఒక సాపేక్ష సత్యము. (ఈ భూమి మీద కూడా కాలము అన్నది అన్ని దగ్గరలా ఒకే రకం(uniform) గా లేదు. భూమి స్వరూపం గోళాకారంగా ఉండటంవల్ల మన "ఇవ్వాళ" అమెరికాలో “రేపు”అవుతోంది. జపాన్ లో "నేడు" మనకు "రేపు" అవుతోంది). ఇక ఇదే విషయాన్ని రెండవ స్థాయిలో పరిశీలిద్దాము 6ఒక వస్తువు కాంతి వేగం అందుకొన్నప్పుడు కాలం స్తంభించి పోతుంది. ఉదాహరణ చూద్దాము. ఒక వ్యక్తి ఒక రైల్వే ప్లాట్ ఫారం మీద నిలబడి ఉన్నాడనుకొందాం. ఎదురుగా ఉన్న రైల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడనుకొందాం. ఆ రైలు సెకండుకు 2,40,000 మైళ్ళవేగంతో ప్రయాణించినప్పుడు ప్లాట్ ఫారం మీద ఉన్న వ్యక్తికి 10సెకండ్ల కాలం గడిస్తే, రైలులోనివ్యక్తికి ఆరు సెకండ్ల కాలం మాత్రమే గడుస్తుంది. అదే రైలు కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు కాలం పూర్తిగా స్తంభించిపోతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాము. అపుడే జన్మించిన ఇద్దరు కవలల్లో ఒకరిని భూమిమీదనేఉంచి, ఇంకొకరిని కాంతివేగంతో ప్రయాణం చేసే అంతరిక్షనౌకలో విహారానికి పంపామనుకొందాం. 20 సంవత్సరాల తరువాత భూమి మీద ఉన్న బిడ్డకు 20ఏళ్ళు వస్తాయి. అప్పుడు అంతరిక్ష నౌక భూమికి తిరిగి వస్తే అందులోని బిడ్డ వయసు మాత్రం ఏమీ పెరిగి ఉండదు. అలాంటపుడు ఎలా చూసినా ఈ "కాలము" కేవలము మాయాకల్పితమే, భ్రాంతిజనితము, సాపేక్షసత్యమేగానీ పరమ సత్యము, లేక కేవల సత్యము కాదన్నది స్వయం విదితంగా (Self-Evident) ఉన్నది గదా. సర్వదా, సర్వథా మనము సత్యమని సంభావించే విషయాల్లో దిక్కులు కూడా ప్రధానమైనవి. ఇవికూదా ఎలా మిథ్యా జనితాలో చూద్దాము. తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం అనే ఈ నాలుగు దిక్కులూ వాటికి అనుబంధంగా ఉన్న ఉప దిక్కులూ ఎలా భ్రాంతి జనితాలో ఛూద్దాము. ఇంతకు ముందు ప్రస్తావించుకున్నట్లు సూర్యోదయ, సూర్యాస్తమయాలు దృగ్భ్రాంతులే కదా? సూర్యుడూ ఉదయించేదిక్కు తూర్పు, అస్తమించే దిక్కు పడమర, అన్నవి సూర్యోదయ సూర్యాస్తమయాల పైన ఆధార పడినవి.భూమి తనచుట్టూ తాను తిరిగేదిశమారితే, సూర్యుడు ఇప్పుడు మనం పడమర గా భావించే దిక్కున ఉదయించి ఇప్పుడు మనం తూర్పుగా భావించె దిక్కున అస్తమించి ఉండే వాడు కాడా? అసలు దృగ్భ్రాంతిపై ఆధారపడిన ఈ దిక్కులు మిథ్య కావా? అలాగే భూమికి ఉన్న అయస్కాంత తత్వంపై ఆధారపడినవే ఉత్తర, దక్షిణ దిశలు. కనుక మనము భూమికి పరిమితమై ఉన్నంతవరకే వాస్తవాలుగా ఉండి ఆ తరువాత అవాస్తవాలుగా మారేవి ఈదిక్కులు. రోదసీలోకి ప్రవేశించినపుడు ఈ దిక్కులకేదీ దిక్కు? అలాగని సంపూర్ణం గా వీనిని నిరాకరించడమూ సాధ్యం కాదు. ఎందుకంటే మన దైనందిన జీవితం ఈ కాలంపైనా, దిక్కులపైనా ఆధారపది నడుస్తున్నది. వీటిని నిరాకరించినట్లయితే అస్తవ్యస్తమౌతుంది; కనుక సత్యాభాస మాత్రమే ఐన ఈదిక్కుల నిర్ణయం కూడా మిథ్యా జనితమైన సాపేక్ష సత్యమే ఐనప్పటికీ ఒక స్థాయివరకూ గ్రహించవలసినదే అవుతున్నది. ఇక "దేశము" (space) అన్నది ఎలా సాపేక్షమౌతుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాము. భూమినుంచి ఆకాశాన్ని చూసినపుడు కొన్ని చదరపు మీటర్లు మాత్రమే విస్తీర్ణం కలిగినట్లు కనిపించే "దేశం (స్థలం) నిజానికి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల విస్తీర్ణం కలిగినది కావచ్చు. తమమధ్య కొన్ని లక్షల, కోట్ల మైళ్ళ దూరం కలిగిన కొన్ని నక్షత్రాలు ఒక రాశిగా మనకు కనిపిస్తూ (నిజానికి అది గూడా ఒక దృగ్భ్రమే) కొన్ని చదరపు మీటర్ల స్థలంలో సర్దుకొని కనిపిస్తున్నాయి. ఇది మనకూ ఆరాశుల్లోన్ని నక్షత్రాలకూ మధ్య ఉన్న దూరంవల్ల కలుగుతున్న దృశ్యభ్రాంతి. కనుక దేశం యొక్క విస్తీర్ణం ఎంత విశాలమైనది లేక ఎంత సంకుచితమైనది అన్నది కూడా సాపేక్ష సత్యమే గానీ కేవల సత్యము కాజాలదు గదా? ఇంకొక ఉదాహరణ చూద్దామా? పది అడుగుల పొడుగు, పది అడుగుల వెడల్పు కలిగిన ఒక రాతి గోడ ఉందని అనుకోండి. ద్రష్ట, దృశ్యముల (చూసేవాడు, చూడబడేది) మధ్యపరిమాణాల్లోఒక నిర్దిష్ట నిష్పత్తి (specific ratio) ఏర్పడినపుడు మాత్రమేఅది యథార్థమైన పరిణామములో గోచరిస్తుంది. చూసేవాడు ఒక ఎలెక్ట్రాన్ సైజులో ఉంటే ఈ గోడే ఒక అనంతవిశ్వంగా అగుపిస్తుంది. చూసేవాడు ఒక గెలాక్సీ పరిమాణం కలిగినవాడైతే అదే గోడ వాడి దృష్టికి ఆనదు, దాదాపు అదృశ్యమయ్యేటంత అత్యల్ప పరిమాణం కలిగినదిగా అవుతున్నది. కనుక దేశము లేక స్థలము వాస్తవ రూపము ఏమిటి?ద్రష్ట,దృశ్యవస్తువుల మధ్య పరిమాణాల నిష్పత్తి మరియూ ద్రష్ట,దృశ్యవస్తువుల మధ్య దూరము వస్తువుయొక్క పరిమాణాన్ని నిర్దేశిస్తున్నప్పుడు "దేశం" (space) మాత్రం సాపేక్ష సత్యం మాత్రమే, మిథ్యా జనితమే అనిచెప్పడంలో సందేహం లేదుగదా? కాంతివేగం అనుల్లంఘనీయం. కాంతి వేగాన్ని మించి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ననుసరించి కాంతివేగంతో ప్రయాణం చేస్తే ద్రవ్య రాశి అనంతము అవుతుంది*.5కనుక అది అసాధ్యం. 5 శూన్యంలోనైనా, ఏదైనా యానకంగుండానైనా కాంతి వేగంలో ఎలాంటి మార్పూ ఉండదు. కనుకనే కాంతి వేగాన్ని constant factor అనీ దాని సంకేతాన్ని "C" అనీ వ్యవహరిస్తారు. ఎంత అనంత దూరం ప్రయాణించినా అది స్థిరంగానేఉంటుంది. (ఈ చివరి విషయం మాత్రం ఇటీవలనే ఫ్రెడరిక్ హోయల్ మరియూ విష్ణు జయంత్ నర్లీకర్లు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం కొంచెం అనంగీకార్యం అవుతుంది.ఐనా కాంతివేగం అనుల్లంఘనీయం అన్నవిషయంలో భేదాభిప్ర్రాయానికి తావులేదు. ఫోటాన్లు కాంతివేగం కంటే అధికవేగం కలిగి ఉన్నా అవి పదార్థాలు కావు. కేవలం శక్తి పుంజాలు మాత్రమే. అలాగే ట్రాకియాన్లు కూడా కాంతి వేగంకన్నా అధిక వేగం కలిగిన కణాలే. కానీ వాటి జీవిత కాలం సెకన్లో పది లక్షవవంతు కన్నా తక్కువ కనుక దానిని కూడా గణన లోనికి తీసుకోనవసరం లేదు.)కాంతి వేగాన్ని గూర్చి ఇంత సుదీర్ఘం గా ఎందుకు చర్చించ వలసి వస్తున్నదంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలను అర్తం చేసుకోవడానికి అది అత్యవసరం కనుక. మనమందరమూ సహజంగానే మన అస్తిత్వాన్నీ, మన భూగోళం అస్తిత్వాన్నీ శంకించడానికివీల్లేని పరమవాస్తవాలుగా పరిగణిస్తాము. కానీ మన అస్తిత్వము, మన భూగోళం అస్తిత్వం కూడా కేవల సత్యములుగా అంగీకరించడం సాధ్యం ఎలా కాదో ఇప్పుదు పరిశీలిద్దాము. ఒకవస్తువు, పొడవు, వెడల్పు వంటి పరిమాణాలు అది భూమి మీద స్థిరం గా ఉన్నప్పుడు మాత్రమే మార్పు లేకుండా ఉండగలవు. ఉదాహరణకు ఒక అడుగు పొడవు కలిగిన ఒక స్కేలు ఎల్ల వేళలా ఒక అడుగు పొడవు కలిగిన స్కేలుగా మాత్రమేఉంటుందని మనము సహజంగానే అనుకొంటాం. కానీ వేగంపెరిగిన కొద్దీ అది కుంచించుకొని పోయి చివరికి కాంతివేగంచేరే సరికి అది ’0’ కొలత కలిగినదిగా అవుతున్నది అంటే అది "అదృశ్యమౌతుంది"7 మరి పొడవు,వెడల్పులూ ఒక ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే స్థిరమైనవిగా ఉంటాయి అని అన్నప్పుడు అవికూడా సాపేక్ష సత్యాలె అవుతున్నాయి. అలాగే బరువు కూడా. గురుత్వాకర్షణలో మార్పు వచ్చినప్పుడు అది కూడా మారుతుంది. భూమి మీద 60కిలోలు తూగే మనిషి చంద్రుని మీద 10కిలోలు మాత్రమే తూగుతాడు. అలాగే ఇంతకు ముందుఅనుకున్నట్లు కాంతివేగం అందుకొంటే బరువుకూడా అనంతం అవుతోంది.మరి బరువు కూడా స్థిరమైనదిగా పరిగణించలేము. ఇలా మనము సత్యము, మార్పు లేనివి అనుకొన్నవన్నీ అస్థిరములు, మరియూ వేగాన్ననుసరించి, పరిస్థితులననుసరించి మారేవిగా నిరూపణ అవుతున్నాయి. మనమందరమూ సహజంగానే మన అస్తిత్వాన్నీ, మన భూగోళం అస్తిత్వాన్నీ శంకించడానికివీల్లేని పరమవాస్తవాలుగా పరిగణిస్తాము. కానీ మన అస్తిత్వము, మన భూగోళం అస్తిత్వం కూడా కేవల సత్యములుగా అంగీకరించడం సాధ్యం ఎలా కాదో ఇప్పుదు పరిశీలిద్దాము. సూర్యుని నుంచీ కాంతి భూమిని చేరడానికి దాదాపు తొమ్మిది నిముషాలు పడుతుంది. ఈ క్షణంలో సూర్యుడు పేలిపొయినా ( అది సాధ్యమయ్యే విషయం కాదనుకోండి) ఆవిషయము మనకు తెలియడానికి తొమ్మిది నిముషాలు పడుతుంది. సూర్యుని తరువాత మనకు అత్యంతచేరువలోని నక్షత్రం ఆల్ఫా సెంటారీ (దీన్నే ప్రాక్సిమా సెంటారీ అని కూడా అంటారు.). ఇది భూమినుంచి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రానికి గ్రహాలు ఉన్నాయనీ ఆ గ్రహాలమీద బుద్ద్ధికుశలత కలిగిన మానవులు ఉన్నారనీ, వాళ్ళ వద్ద ఊహాతీతమైన శక్తివంతమైన టెలిస్కోపులు కూడా ఉన్నాయనీ ఊహించుకొందాము. ఆ గ్రహము మీది మానవులు మన భూమిని చూస్తే నాలుగున్నర సంవత్సరాల వెనుకటి భూమిని మాత్రమే వాళ్ళు చూడ గలరు. ఇదే ఊహను తర్కబద్ధంగా ఎంతవరకు తీసుకు పోగలమో(to the logical extreme) అంతవరకు తీసుకు వెళ్ళి చూద్దాం. భూమినుంచి వెయ్యి మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం తాలూకు ఉపగ్రహం మీద నుంచీ భూమిని చూసే వారికి మన సౌర కుటుంబం ఉండవలిసిన చోట ఒక పెద్ద శూన్యం మాత్రమే గోచరిస్తుంది. అంటే మన సూర్యుడు, సౌరకుటుంబం తాలూకు గ్రహాలూ, ఉపగ్రహాలు ఇత్యాదులేవీ ఇంకా జన్మించనేలేదన్నమాట. మరి మన ఉనికి సత్యమా, అసత్యమా? మనకు సత్యం. వేయి మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవారికి అసత్యం.అంతే మన ఉనికి కూడా సాపేక్ష సత్యం మాత్రమేనని అంగీకరించక తప్పదు. విశ్వంలో ఏకకాలీనత (simultaneity) అన్నది లేక పోవడంవల్ల ఏర్పడిన విచిత్ర పరిస్థితి ఇది. మాయ అన్నది ఇలాంటి ఊహాతీతమైన పరిస్థితులను సృస్ఠిస్తుంది. ఈ విధంగా దేశం , కాలం, దిక్కులు, చివరకు మన అస్తిత్వం తోసహా మనం పరమ సత్యాలుగా సంభావిస్తూ వస్తున్నవన్నీ సాపేక్ష సత్యాలు మాత్రమేగానీ కేవలసత్యాలు కాదని అర్థం చేసుకొన్న తరువాత, శక్తి, పదార్థాల మధ్య గల అనుబంధాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. శక్తి సత్యమైనది, నిత్యమైనది అంటే నాశనం లేనిది అలాగే పదార్థము లేక ద్రవ్యము కూడా నిత్యమైనది, సత్యమైనది, నాశనము లేనిది.ఇవి వేదాంతులు పరబ్రహ్మ తత్వాన్ని గూర్చి వల్లించే వేదాంత వాక్యాలు కావు. భౌతిక శాస్త్రం ప్రవచించే శక్తి నిత్యత్వ, పదార్థ నిత్యత్వ ప్రాథమిక వచనాలు. వేదాంతమూ, విఙ్ఞానశాస్త్రమూ ఒకేనాణానికి బొమ్మా బొరుసులుగా అనిపిస్తున్నాయు గదా? శక్తి పదార్థం గా పరివర్తన చెందుతుంది. అలాగే పదార్థం శక్తి గానూ పరివర్తన చెందుతుంది. ఈ శక్తి, పదార్థ రూపాంతరీకరణ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. పదార్థం, శక్తి పరస్పర భిన్నములు కావని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడే విశ్వమంతా నిండియున్న శక్తియే మనలో శరీరంగానూ మరియూ జీవశక్తిగానూ కూడా ఉన్నదని అర్థం అవుతుంది. ఇంతకు మునుపు మనం ప్రస్తావించుకొన్న110మూలకాలుగానూ, వాని మిశ్రణ మూలంగా ఏర్పడిన మిశ్రమాలు (compounds and mixtures) గానూ, ద్రవ, వాయు రూపాలలో లేక ప్రోటానులు, ఎలెక్ట్రానులు, న్యూట్రానులు అస్తవ్యస్తమైన స్థితిలో ఉండే ప్లాస్మా గానూ పదార్థం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. కాంతి, శబ్ద,విద్యుత్, అయస్కాంత ఉష్ణ రూపాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్నది శక్తి. ఈ శక్తే జీవ, నిర్జీవ పదార్థాలన్నింటిలోనూ పదార్థ రూపంగా పరిణామం చెంది గోచరిస్తున్నది. సమస్త ప్రాణికోటి ధరించి ఉన్న శరీరంగానూ, కణజాలం, రక్తము, కండరాలు, మాంసము, ఎముకలు, కణాంతస్థ పదార్థాలైన జీన్స్, క్రోమొజోములు, డీ ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ , ప్రొటీన్లు, అమినో ఆసిడ్లు ఇత్యాది సకల జీవ వస్తుజాలమంతా పదార్థముగా రూపాంతరము చెందిన శక్తి ధరించిన రూపాలే. సూర్యుని నుంచి కోట్లాది మైళ్ళ దూరాలకు విరజిమ్మబడినదిగానీ లేక బృహత్ విస్ఫోటన (big bang) సమయంలో ఊహాతీతమైన దూరాలకు విరజిమ్మబడినదిగానీ ఐనదీ, ఊహాతీతమైన ఉష్ణోగ్రతవద్ద ఉన్నదీ ఐన పదార్థం క్రమంగా "ఘనీభవించి" గ్రహగోళాలుగానూ, ఉపగ్రహాలుగానూ, తోకచుక్కలు, గ్రహశకలాలుగానూ మరియూ ఇతర నభోమూర్తులుగానూ ఏర్పడింది. ఆ తరువాత క్రమంగా సంభవించిన పరిణామాలననుసరించి చివరికి జీవరాశిగా (అంటే వృక్ష, జంతు జాతులుగా) ఆవిర్భవించింది. ఈ పరిణామాలను సవిస్తరంగా చర్చిండానికి ఇది వేదికా కాదు, సందర్బమూ కాదు కనుక పుస్తక విస్తరణ భీతితో కేవలం తలస్పర్శి (superficial) పరిచయంతో సరిపెట్టుకోవాలసి వస్తున్నది. అభివృద్ధి చెందిన మెదడు కల జీవరాశిని పరిశీలించినపుదు వేదాంతంలో చెప్పబడిన "జీవుడు" నుగూర్చిన సులభమౌతుందన్న ఉద్దేశ్యంతోనే, అల్ప శ్రేణికి చెందిన జీవరాసుల విషయం గాక ఉన్నత శ్రేణికి చెందిన (సకశేరుక జాతికి చెందిన) మానవుదు మొదలైన జీవరాశి విషయమే పరిశీలనకు తీసుకొందాము. జీవరాసులన్నీ ఈ విశ్వాన్ని, బాహ్యప్రేరణలకు స్పందించే తమ ఙ్ఞానేంద్రియాలద్వారానే గ్రహించి అనుభవిస్తున్నాయి.ఉదాహరణకు ఒక వస్తువుపై పడిన కాంతి కొంతదూరం ప్రయాణించ్న తర్వాత కంటిలోని కటకం (lens) ద్వారానూ, కంటిలోని ఇతర ద్రవ పదార్థాల ద్వారానూ రయాణించి అనంతరమ్ నేత్ర పటలం (retina)పైన తలకిందులుగా బొమ్మరూపంలో పడుతున్నది. తరువాత విద్యుదయస్కంతస్పందనల రూపంలో దృష్టి నాడి (optic nerve) ద్వారా మెదడులోని దృష్టి కేంద్రం(optic centre) చేరుతున్నాయి. అక్కడ జరిగే సంక్లిష్త విద్యుత్, రసాయన చర్యలవల్ల మెదడు ఆ వస్తువును గుర్తించగలుగుతున్నది. ఇలాగే శబ్ద, స్పర్శ, రస, గంధాలను ఇతర ఙ్ఞానేంద్రియాలద్వారా అంతిమంగా మేధస్సు విశ్వదర్శనం చేస్తున్నది. కానీ ఇక్కడే వస్తుంది అసలు ప్రశ్న. అసలు ఈ విశ్వాన్ని దర్శిస్తున్నది ఎవరు? మెదడు అని అందామనుకొంటే, అదే మెదడే మృత కళేబరంలోనూ ఉన్నది కదా? మరి ఆ మృత కళెబరం విశ్వాన్ని గుర్తించడంలో గానీ, ఇతర జీవ వ్యాపారాలను నిర్వహించడంలోగానీ ఎందుకు విఫలమౌతున్నది? ఎలెక్ట్రాన్లన బంధిస్తున్న, కేంద్రకంలోని ప్రోటానులనూ న్యూట్రాన్లను కలిపి ఉంచుతున్న బంధన శక్తి (cohesive force) రూపంలో శక్తి ఆ మృత కళేబరంలోని రసాయన పదార్థాలన్నింటిలోనూ కూడా ఉన్నది కదా? మరి ఎక్కడున్నది లోపం? మెదడు ద్రష్ట కాదు అని అంగీకరించవలసి వస్తుంది. కనుక వేదాంతులుగానీ, విఙ్ఞాన శాస్త్రవేత్తలుగానీ, శరీరానికి అతీతంగా, శరీరానికి అన్యమైన "జీవుడు" ఒకడున్నాడని అంగీకరించవలసి వస్తుంది. అనేక రూపాలు ధరించి లీలా కేళి జరుపుతున్నశక్తిరూపియైన పరబ్రహ్మమే, జడమైన పర్వతాలుగానూ,ఎత్తైన వృక్షాలుగానూ,లోతైన సముద్రాలుగా, చలనశీలమైన నదీ నదాలుగా, విస్ఫోటనశీలమైనఅగ్ని పర్వతాలుగా, ఆహ్లాదకరమైన అడవులూ, పచ్చిక మైదానాలుగా, అనంతమైన వైవిధ్యంతో అలరారుతున్న చరాచర జీవ రాశిగానూ భాసిస్తున్నది. ఈ సందర్భంలో శంకరుల దక్షిణామూర్తి స్తోత్రంలోని "మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్స్వేచ్ఛయా" అన్న వాక్యం ఙ్ఞప్తికి వస్తుంది. అలాగే చిల్లులకుండలోని దీపకాంతులు బయటకు విరజిమ్మబడుతున్నట్లు, శరీరంలోని ఙ్ఞాన రూపమైన జీవుడే కన్ను, చెవి మొదలగు అవయవాల ద్వారా బయటకు ప్రసరిస్తున్నాడన్న శంకరుల వాక్యం "నానా చిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం, ఙ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే" అన్న వాక్యం స్ఫురణకు వస్తుంది. మరణ పర్యంతం సచేతనంగా ఉంటూ, మరణానంతరం అచేతనమయ్యే ఈ శరీరం గానీ, శరీరాంతస్థుడైన జీవుడు గానీ, ఆ శక్తి యొక్క రూపాంతరాలే. విశ్వమంతటా, లోపలా, వెలుపలా పరివేష్టించి ఉన్నది "ఏకామేవాద్వితీయం బ్రహ్మా’ అనీ మరియూ "అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః" అనియూ చెప్పదగిన శక్తియే అయిఉన్నప్పుడు దానికంటే అన్యమైనది ఏది ఉండగలదు కనుక? ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ పలుకు ఇదేభావాన్నిస్ఫురింపజేయడం లేదూ? కనుక దీన్ని పరబ్రహ్మమని వేదాంతులు, శక్తి అనీ పదార్థమనీ వైఙ్ఞానికులూ భావిస్తున్నారు. ఈ దృష్టితో జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పడం సంపూర్ణంగా అంగీకారయోగ్యమైన పరమ సత్యమే అవుతుంది. ఈ వ్యాసం ముగించే ముందు ఒక చిన్న మాట.దేశ, కాలాది సకల విషయాలూ సాపేక్ష సత్యాలు మాత్రమే అన్నంత అవేవో చాలా తేలికగా కొట్టి పారవెయదగిన విషయాలని మాత్రము భ్రమించరాదు.అనేక సంవత్సరాల నిరంతర సాధన తరువాత అదృష్టం బాగుండి, అపరోక్షానుభూతిని అనుభవించ గలిగిన మహా యోగీశ్వరులు మాత్రమే ఇవేవీ పరమసత్యాలు కావని గ్రహించ గలుగుతారు గానీ అంతవరకూ వానిని వ్యావహారిక సత్యాలుగా అంగీకరించటం తప్పనిసరి.భౌతిక శాస్త్రంలో ప్రాథమిక పాఠాలు మొదలు పెట్టగానే స్టీఫెన్ హాకింగ్, ఐన్ స్టీన్ అంతటి వారలము కాలేము కదా. అలాగే మనము వేదాంతపరంగా ప్రాథమిక స్థాయిలో ఉన్నంతకాలం జపతపానుష్ఠానాదులను, నిత్య పూజాదికాలను వదలి వేసి మిట్ట వేదాంతంవల్లె వేస్తే మనకు లభించేది కర్మపరిత్యాగదోషమేగానీ అపరోక్షానుభూతి కాదు. అవాఙ్ఞ్మానసగోచరమైన ఆపరబ్రహ్మమే నేను అన్న అపరోక్షానుభూతిని సిద్ధింప జేసుకొన్న తరువాత కూడా ఆదిశంకరులు భక్తి తత్వ్వనికి అంత ప్రాధాన్యత నిస్తూ లక్ష్మీ నృసింహ కరావలంబస్తోత్రము వంటి భక్తి స్తోత్రాలను పుంఖానుపుంఖాలుగా రచించారంతే మనము ఇట్టి భ్రమకు లోను కాకూడదన్న ఉద్దేశ్యంతోనే. కనుక ’అహం బ్రహ్మాస్మి’ అన్న మాట చిలుక పలుకుల వలె వల్లె వేయదగిన మాటగా కాక జన్మ జన్మల సంస్కారం పక్వానికి వచ్చి సాధనలో సిద్ధిపొంది అపరోక్షానుభూతిని సొంతం చేసుకున్న మహనీయుల అంతిమ స్థాయి అనుభూతి గా గ్రహించవలసి ఉన్నది. ఇతి శం అధో - దీపిక (Foot Notes) 1 కోటానుకోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు 2 కాంతి సెకనుకు 1, 86,000 మైళ్ళవేగంతో ప్రయాణిస్తుంది. అంత వేగంతో కాంతి ఒక్క సంవత్సరకాలంలో ప్రయాణించే దూరాన్ని అంటే 1,86,000X60X60X24X365 మైళ్ళ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. 3 ప్రోటానులోని ద్రవ్యరాశి 1.6726 x 10-27 కిలోగ్రాములు, న్యూట్రానులోని ద్రవ్య రాశి 1.67492 x 10-27కిలోగ్రాములు, ఎలెక్ట్రానులోని ద్రవ్యరాశి 9.108 X 10-31కిలోగ్రాములు 4 పరమాణువు సైజు 1 X 10-10 మీటర్లు, కేంద్రకము (nucleus) సైజు 1x10-15 మీటర్లు 5(M=m0 x అనే సూత్రీకరణం ఆధారంగా where m0= mass at rest, v=velocity of the particle and c= velocity of light) 6 t=t0 x అనే సూత్రీకరణం ఆధారంగా where t0= time at rest, v=velocity of the particle and c= velocity of light 7(L=L0 x where L0= length at rest, v=velocity of the object and c= velocity of light అనే సూత్రీకరణం ఆధారంగా)"
జైహింద్.