జైశ్రీరామ్. ఆర్యులారా! నిన్నను శ్రీమతి మలయవాసిని గారికి " వ్యాఖ్యాన వాగీశ్వరి " బిరుదు ప్రదానం సందర్భంగా నేను విరచించిన అభినందన మందార మాల.
శ్రీరస్తు శుభమస్తు. అవిఘ్నమస్తు.
శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారికి
"శ్రీమతి వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కరమ్, 2016"
“వ్యాఖ్యాన వాగీశ్వరి” బిరుదు ప్రదానము. సందర్భముగా సమర్పించిన
అభినందన మందారమాల.
రచన. చింతా రామ కృష్ణా రావు. (9247238537)
౧. శా. శ్రీదేవీ హృదయాబ్జ భృంగ! శుభ సచ్ఛీల ప్రదా! మాధవా!
శ్రీధీశోభిత కోలవెన్ మలయవాసిన్యాఖ్య వాగీశ్వరిన్
స్వాదుస్వాంతులు భీమ శంకరులు తా వ్యాఖ్యాన వాగీశ్వరీ
మాధుర్యాక్షర సత్కృతిన్ గొలిచె. ప్రేమన్ వచ్చి దీవింపుమా.
౨. గూఢ పంచమ పాద గర్భ చంపకమాల.
వరమగు తెల్గు భాష , లయబద్ధ నిదర్శన శబ్దమై నిరన్
తరమును వెల్గు చుండు జయ ధాత్రిని వాఙ్మయ పుస్తకాకృతిన్
వరులె తెలుంగులో పలుకు. వారల వాణియె కాంచ మిన్నగా
వరలెడి సత్యమై మలయ వాసిని నిల్చె ప్రభా సమృద్ధనాన్.
(వరలెడి తెల్గులో మలయ వాసిని వాణి ప్రశస్తమిద్ధరన్.)
౩. క. సుందర విశాఖ సుమమిల - నెందరికో మార్గదర్శ హృదయయు, లోకో
ద్వందిత మలయ సువాసిని - మందారము తెలుగునకని మహితులు పొగడున్.
౪. బహువిధ కంద గీత గర్భ సీసము.
వర వినుతాత్మయౌ మలయ వాసిని సజ్జన మాన్య వర్య శ్రీ
కర గుణ ధీరయున్, ఘనులు కాంచు నయోన్నత గౌరవార్హ, సుం
దర మనమున్ శుభా శ్రిత సుధాత్మనివేద విశిష్ట వాణి, తాన్
ధర మణియే కదా! తెలుఁగు తల్లిని కొల్చెడి తేనె వాగులే.
౫. భావ గోపన సీసము.
శ్రీమత్కవిత్వాన చింతా మణియెకదా! శేషగిరి తనూజ చిత్స్వరూప.
మహనీయ ప్రతిభయే మలయవాసినియయ్యె, దిశలెల్ల సత్కీర్తి తేజమలమె
బహు గ్రంథ కర్తయై బహు ప్రశంసలు పొందె., ప్రభుతయు నెరపె నీ పద్మనయన.
దేశ విదేశాల దివ్యప్రసంగము లసమానముగఁ జేసి దెసలు ముట్టె.
గీ. నట్టి మలయసువాసిని పట్టుపట్టి - తెలుఁగు జాతికి వెలుఁగుఁగా నిలుచుఁ గాత!
మంగళంబులు తెలుఁగుకు మలచుఁగాత. - మంగళాకృత వాణియై మసలుఁగాత!
మంగళమ్ మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
వి.యల్.యస్.విజ్ఞాన సారస్వత పీఠము, భాగ్యనగరము. తేదీ. 08-6-2016.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారికి వి.ఎల్.యస్, విజ్ఞాన సారస్వత పీఠము " వ్యాఖ్యాన వాగీస్వరి " బిరుదు ప్రధానము సందర్భమున మీరందించిన అభినందన మందారములు ఆణిముత్యముల వలె వెలుగులు విరజిమ్ముతున్నవి.మీకు నా అభినందన మందారములు .అక్క
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.