గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2016, బుధవారం

భార్య – బాధ్యత . . . కంచి పరమాచార్య

జై శ్రీరామ్.
భార్య – బాధ్యత . . . కంచి పరమాచార్య
పరమాచార్య స్వామివారితో ఒక మధ్యవయస్కుడైన గృహస్తు, “నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ ఇంటిపనులు, వంట చెయ్యదు; పిల్లల యోగక్షేమాలను కూడా పట్టించుకోదు” అని చెప్పాడు.

వెంటనే మహాస్వామివారు, “ఈ విషయం నీ స్నేహితులతో చెప్తే, వాళ్ళు నీకు విడాకులు తీసుకో అని సలహా ఇస్తారు. మీ బంధువులకు చెబితే ఆమెని వదిలేసి ఇంకొకర్ని పెళ్ళి చేసుకొమ్మని చెప్తారు. మీ జ్యోతిష్కుణ్ణి అడిగితే రాహు దోషం లేదా కేతు దోషం అని పరిహారం చేసుకొమ్మని చెబుతాడు. వైద్యుని దగ్గరకు వెళ్తే ఎక్స్ రే, ఇసిజి, రక్త పరీక్ష అని కొన్ని మందులు రాసిస్తాడు. మీ ఇంట్లోని ముసలివాళ్ళని అడిగితే, ఎవరైనా చేతబడిని పోగొట్టేవారిని కలవమని చెప్తారు”

“కాని నువ్వు నావద్దకు వచ్చావు. అది సరే. ఇక్కడికి వచ్చి నువ్వు తన ఆరోగ్యం బాగవ్వాలని, తనకు స్వస్థత చేకూరాలని అడగకపోగా, తన ఆరోగ్యంగా లేదని తనను వదలించుకుందామనే ఆశతో ఇక్కడికి వచ్చావు”

“చూడు. . . భార్య అంటే ఈశ్వరుడు ఇచ్చిన కడదాకా తోడుండే జీవిత భాగస్వామి. ఆమెకి బాలేనప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవడం భర్తగా నీ ధర్మం. ఎన్నేళ్ళు తను నీకోసమే జీవించింది. నీ కష్టాలను నీ సుఖాలను పంచుకుంటూ నీకు తోడునీడ అయి మెలిగింది. ఆమెపైన కొద్దిగా కూడా దయ కరుణ లేదా. . . నీ హృదయం ఎంత బండబారిపోయింది. ఇకనుండి నువ్వు నా దర్శనానికి రావడానికి వీల్లేదు” అని చెప్పారు.

అతని మొహం గంభీరంగా మారిపోయింది. అతని మనస్సు కరిగి కళ్ళనీరు పెట్టుకుని, మహాస్వామి వారితో, “నన్ను క్షమించండి పెరియవ! నేను తనను బాగా చూసుకుంటాను. తనకు నేను సేవలు చేస్తాను. దయచేసి నాకు అంత పెద్ద శిక్ష విధించవలదు. కరుణించండి పెరియవ!!” అని వేడుకొన్నాడు.

స్వామివారు సముద్రమంతటి కరుణ కురిపిస్తూ, “తను దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతోంది. తనకు రెండు నెలల వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఆమెని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలకు తీసుకుని వెళ్ళు. అంతా సరిపోతుంది” అని చెప్పి ఆశీర్వదించి పంపించారు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.