జై శ్రీరామ్.
గోదావరీ పుష్కర స్నాన విధానము కొఱకు ఈ క్రింది URL ను ఉపయోగించండి.
https://drive.google.com/file/d/0B0Zi3RYt07USeG9EWnoycm1rMnpGbG9uUGFaUlpqWHBhaHJr/view?usp=sharing
1శ్లో. రేవాతీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే. దానం దద్యా త్కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయంపరం.రేవానదీతీరములో తపస్సు చేసినచో ముక్తి లభిస్తుంది. గంగా తీరంలో తనువుచాలిస్తే ముక్తి వస్తుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం లభిస్తుంది. గోదావరీ తీరంలో ఈ మూడూ ముక్తినిస్తాయి.
2శ్లో. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతీపాతే దినత్రయే. సకృ ద్గోదావరీస్నానం కులకోటిం సముద్ధరేత్.
పుష్యమితో కూడిన ఆదివారంకానీ, జన్మ నక్షత్రము ఉన్న నాడు గానీ, వ్యతీపాతలలో గానీ లేదా ఎప్పుడైనా సరే వరుసగా మూడు రోజులు గానీ ఎవరైతే గోదావరీ నదిలో స్నానం చేస్తారో వారియొక్క కులంలోని కోటిమందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి.
3శ్లో. యా గతి ర్ధర్మశీలానాం మునీనా మూర్ధ్వరేతసాం. సాగతి స్సర్వ జంతూనాం గౌతమీ తీరవాసినాం.
ధర్మము తప్పక జీవించేవాళ్లకూ, మునులకూ, యోగులకూ ఎటువంటి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయో, అటువంటి సద్గతులు గోదావరీ తీరంలో బ్రతికే సర్వ ప్రాణులకూ లభిస్తాయి.
4శ్లో. పంచానామపి భూతానాం ఆపః శ్రేష్ఠత్వమాగతాః. తాసు భాగీరథీ జ్యేష్ఠా తస్యా జ్యేష్ఠాతు గౌతమీ,
ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాత్ భాగీరధీస్మృతా. తయో రేకతరా సేవ్యా గౌతమీ తత్రపావనీ.
పంచభూతములలో నీరు శ్రేష్ఠమైనదిగా తెలుపబడుతున్నది. ఆ నీటిలో కూడా భగీరథుని చే కొనిరాబడిన గంగాజలము అత్యంత శ్రేష్ఠమైనది. శ్రేష్ఠతలో అంతకంటే అగ్రస్థానమున గౌతమునిచే గొనిరాబడిన గంగ(గోదావరి)యే ఉన్నది. గోదావరిలో స్నానం చేసిన తరువాతనే గంగలో స్నానం చేయాలని స్మృతులు చెబుతున్నాయి. రెండూ సమానంగా సేవించ దగినవే అయినప్పటికీ గోదావరియే అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోంది.
5శ్లో. యస్మిన్ దినే సురగురుః సింహస్థోపి యుతో భవేత్. తస్మింస్తు గౌతమీ స్నానం కోటి జన్మాఘ నాశనమ్.
ఏరోజులలో శుభగ్రహమైన గురుడు సింహరాశియందు ఉండునో ఆయా రోజులలో గోదావరీ నదిలో స్నానంచేయుట వలన కోటిజన్మలలో చేసిన పాపములు పటాపంచలై పోవును.
6శ్లో. సింహరాశిం గతే జీవే స్వర్గ మర్త్యేరసాతలే. యానివై సంతి తీర్థాని గౌతమ్యాం తాని సంతిహి.
గురుడు సింహరాశి యందున్నప్పుడు స్వర్గమర్య్తపాతాళాది సమస్త లోకములందలి పుణ్యతీర్థములును గోదావరి యందే చేరియుండును. అనగా పుణ్యార్థులు ఆసమయంలో గోదావరిలో స్నానం చేయాలి.
7శ్లో. తుల్యాత్రేయీ భరద్వాజౌ గౌతమీ వృద్ధ గౌతమీ. కౌశికా చ వశిష్ఠా చ సప్తధాయాంతి నమోస్తుతే.
గోదావరి ధవళేశ్వరం వద్ద( తుల్య, ఆత్రేయీ, భరద్వాజా, గౌతమీ, వృద్ధ గౌతమీ, కౌశికా, వశిష్ఠా అనే ) ఏడు పాయలుగా చీలి సముద్రములో సంగమించుచున్నది. ఆ యేడు పాయలలో దేనియందు మునిగిననూ పుణ్యమే. కానీ అఖండ గౌతమిలో మునుగుట ఇంకనూ పుణ్యముగదా!
8శ్లో. అశ్వమేధ ఫలం చైవ లక్షగోదానజం ఫలం. ప్రాప్నోతి స్నాన మాత్రేణ గౌతమ్యాం సింహగే గురౌ.
పుష్కరాల సమయంలో గోదావారీ నదిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలమొస్తుంది. లక్షగోవులను దానం చేసిన ఫలం వస్తుంది. కావున ఎల్లరూ ఈ శుభవేళ గౌతమీస్నానం చేసి తరిచెదరుగాక!
జైహింద్.
1 comments:
నమస్కారములు
గోదావరీ పుష్కర జలాలలో ఎప్పుడెప్పుడు స్నానం చేస్తే ఏఏ ఫలితాలు లభిస్తాయో చక్కగా వివరించిన శ్రీ శర్మ గారికీ , మాకందించిన శ్రీ చింతా వారుకీ ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.